సాక్షి, న్యూఢిల్లీ : టూల్‌కిట్ వ్యవహారంలో ముగ్గురు యువతుల అరెస్ట్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. అరెస్ట్‌ల ప్రక్రియను షూరు చేశారు. తొలుత ఓ యువతిని అరెస్ట్ చేయగా.. అనంతరం మరో ఇద్దరిని అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యవరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్‌కిట్‌తో ఈ ముగ్గురు యువతులు (దిశరవి, శాంతాను, నికితా జాకబ్) ఎడిట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే ఆదివారం బెంగళూరుకు చెందిన యువ యాక్టివిస్ట్ దిశరవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయగా.. 24 గంటలు గడవకముందే శాంతాను, నికితాలపై ఢిల్లీ హైకోర్టు నాన్‌బెయిల్‌వారెట్ జారీచేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు నికితను అరెస్ట్ చేయగా.. శాంతాను పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అరెస్ట్ నుంచి నాలుగు వారాల పాటు తనకు విముక్తి కల్పించాలని కోరుతూ నికితా బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా.. రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో చోటుచేసుకున్న హింసకు సంబంధించిన ఘటనలో ఈ ముగ్గురు యువతుల పాత్రపై ఢిల్లీ పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు.
సోమవారం నిర్వహించిన మీడియా సమావేశం ద్వారా వివరాలు తెలిపారు. ‘జనవరి 26న జరిగిన హింసాత్మక ఘటనతో దిశరవి, శాంతాను, నికితా జాకబ్‌కు ప్రత్యక్షంగా సంబంధముందని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం. స్వీడన్ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ తయారుచేసిన టూల్‌కిట్‌ను తొలుత దిశరవి ఎడిట్ చేశారు. అనంతరం శాంతాను, నికితా దీనిలో భాగస్వామ్యం అయ్యారు. కెనడాకు చెందిన చెందిన ఓ యువతి అందించిన సలహాలు, సూచనల ఆధారంగా సోషల్ మీడియాలో ఆ టూల్‌కిట్‌ను షేర్ చేశారు. టూల్‌కిట్‌ను టెలిగ్రామ్ ద్వారా గ్రెటా వీరికి షేర్ చేశారు.
టూల్‌కిట్ గూగుల్ డాక్యుమెంట్‌ను ఎడిట్ చేసిన వారిలో దిశ ఒకరు. ఆ డాక్యుమెంట్‌లో మార్పులు చేర్పులతోపాటు వ్యాప్తి చేయడంలో దిశ కీలక కుట్రదారు. అంతేకాకుండా జనవరి 11న వీరంతా జూమ్ యాప్‌ద్వారా వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను త్వరలోనే కోర్టులో ప్రవేశపెడతాం. మరికొన్న విషయాల కోసం విచారణ జరుపుతున్నాం’ అని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాగా గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌ను ఖలికిస్తాన్ ఉగ్రవాదులు తయారుచేసినట్లుగా ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ టూల్‌కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ముగ్గురు యువతుల అరెస్ట్‌పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రపూరింతగానే వీరిని అరెస్ట్ చేసిందని విపక్ష నేతలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment