Toolkit Case
-
భారత ట్విటర్ ఎండీని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ టూల్‌కిట్ కేసుకు సంబంధించి మే 31న భారత ట్విటర్ ఎండీ మనీశ్ మహేశ్వరీని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. భారత ట్విటర్ ఎండీని విచారించడానికి మే 31న ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్ పోలీస్ బృందం కర్ణాటకలోని బెంగళూరుకు వెళ్లినట్లు వినికిడి. ఇక నటి స్వరా భాస్కర్, భారత ట్విటర్ ఎండీ మనీష్ మహేశ్వరి, ఇతరులపై ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వృద్ధ ముస్లిం వ్యక్తిపై దాడికి సంబంధించిన కేసుపై ఢిల్లీలోని తిలక్ మార్గ్ స్టేషన్లో ఫిర్యాదు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఫేక్ న్యూస్, వినియోగదారుల రక్షణ అంశంలో కేంద్రం, ట్విటర్ మధ్య వివాదం నేపథ్యంలో ఇండియాలో ఉన్న చట్టపరమైన రక్షణను తాజాగా కేంద్రం ఎత్తివేసింది. కొత్త ఐటీ నిబంధనల అమలుపై పదే పదే హెచ్చరిస్తున్నా ట్విటర్ పట్టించుకోని కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ‘కాంగ్రెస్ టూల్‌కిట్’పై బీజేపీ నేతల పోస్ట్‌లకు ట్విటర్ ‘‘మానిప్యులేటెడ్ మీడియా’’ అని ట్యాగ్ చేసింది. ఈ ట్యాగ్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరింది. దీనిపై నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని ట్విటర్ ఇండియా కార్యాలయాలకు మే 24న సాయంత్రం వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే ట్విటర్, ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. చదవండి: ట్విటర్‌కు హైదరాబాద్ పోలీసుల నోటీసులు -
ట్విటర్‌పై కేంద్రం ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌పై కేంద్ర ఐటీశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం వుందన్నట్విటర్ వ్యాఖ్యలను ఖండించింది. ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలు చేసిందని ఐటీ శాఖ వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ట్విటర్ పాఠాలు నేర్పుతోందని కేంద్రం మండిపడింది. ట్విటర్ ఉద్దేశ్యపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఐటీశాఖ ఆరోపించింది. నిబంధనల గురించి పాఠాలు నేర్పేందుకు ట్విటర్ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత న్యాయ వ్యవస్థను దెబ్బతీయాలని ట్విటర్ చూస్తోందని కేంద్రం వ్యాఖ్యానించింది. కాగా, ‘కాంగ్రెస్ టూల్‌కిట్’పై బీజేపీ నేతల పోస్ట్‌లకు ట్విటర్ ‘‘మానిప్యులేటెడ్ మీడియా’’ అని ట్యాగ్ చేసింది. ఈ ట్యాగ్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరింది. దీనిపై నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని ట్విటర్ ఇండియా కార్యాలయాలకు మే 24న సాయంత్రం వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే ట్విటర్, ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ వివాదం చిలికి చిలికి పెను తుఫానులా మారింది. మరోవైపు ‘కాంగ్రెస్ టూల్ కిట్’ వ్యవహారంలో ప్రభుత్వం తమను టార్గెట్ చేస్తోందని, పోలీసుల చేత బెదిరించే ఎత్తుగడలకు పాల్పడుతోందని ఆరోపించింది. భావ ప్రకటనా స్వేఛ్చకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. చట్టం పప్రకారం తాము నడుచుకుంటామని అంటూనే తీవ్ర పదజాలంతో ప్రభుత్వంపై విరుచుకుపడింది. చదవండి: కొత్త డిజిటల్ నిబంధనలపై స్పందించిన సుందర్ పిచాయ్ -
11 మందిపై ఆ ట్యాగ్ వేయాల్సిందే: రణ్‌దీప్ సుర్జేవాలా
న్యూఢిల్లీ: కోవిడ్ టూల్‌కిట్ వివాదానికి ఇప్పట్లో ముగింపు పడేలా లేదు. 11 మంది కేంద్ర మంత్రులపై బూటకపు మీడియా ట్యాగ్ వేయాలని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా ట్విట్టర్‌ను డిమాండ్ చేశారు. టూల్‌కిట్ పేరిట బీజేపీ నేతలు తప్పుడు మీడియా పోస్టులు పెడుతున్నారని ట్విట్టర్‌కు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. అటు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రస్తావించకుండా “టూల్ కిట్.. సత్యం నిర్భయంగా ఉంటుంది” అని ట్వీట్ చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పెట్టిన పోస్టులు బూటకపువి అంటూ ట్విట్టర్ ఆయన ఖాతాపై “మ్యానిపులేటెడ్ మీడియా” అనే ట్యాగ్ పెట్టింది. అంటే మసిపూసి మారేడు కాయ పద్ధతిలో తయారు చేసిన మీడియా పెడుతున్నారని దాని సారాంశం. కాగా కేంద్ర ప్రభుత్వం ఆ ట్యాగ్ తొలగించమని ట్విట్టర్‌ని డిమాండ్ చేసింది. దర్యాప్తు సంస్థలు ఆ విషయం పరిశీలిస్తున్నాయి కనుక తొందరపడి అలాంటి ట్యాగ్లు పెట్టడం సరికాదన్న రీతిలో కేంద్ర ప్రభుత్వ ఐటీ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌కు లేఖ రాసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత సుర్జేవాలా ఒక్క సంబిత్ పాత్ర కాకుండా కేంద్రంలోని 11 మంది మంత్రులపై ఆ ట్యాగ్ వేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వారు కూడా పాత్ర తరహాలోనే నకిలీ మీడియా, పోర్జరీ డాక్యుమెంట్లు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆ 11మంది కేంద్ర మంత్రుల పేర్లును కూడా వెల్లడించారు సుర్జేవాలా. వారిలో గిరిరాజ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్, రమేశ్ పోక్రియాల్, డాక్టర్ హర్ష్ వర్ధన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, గజేంద్రసింగ్ షెఖావత్ ఉన్నారు. అందరినీ ఒకేలా చూడాలని సుర్జేవాలా ట్విట్టర్‌ను కోరారు.రు. కేంద్రమంత్రులు అసత్యపు మాటలు తమ ట్విట్టర్ ఖాతాలో పెడితే ప్రజలు నమ్మే ప్రమాదముందని సుర్జేవాలా ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: ‘టూల్‌కిట్’ కేసులో ట్విట్టర్ యాజమాన్యానికి నోటీసు -
‘టూల్‌కిట్’ కేసులో ట్విట్టర్ యాజమాన్యానికి నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద కోవిడ్ టూల్‌కిట్ కేసులో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ ట్విట్టర్ యాజమాన్యానికి సోమవారం నోటీసు జారీ చేసింది. టూల్‌కిట్ వ్యవహారంపై అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే రెండు పోలీసు బృందాలు ఢిల్లీలోని లాడోసరాయ్‌లో ఉన్న ట్విట్టర్ ఇండియా కార్యాలయానికి చేరుకున్నాయి. అక్కడున్న సిబ్బందికి నోటీసు అందజేశాయి. దేశ ప్రతిష్టను, ప్రధానిమోదీ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్ కుట్రపన్నుతోందని బీజేపీ ఆరోపించింది. తప్పుడు ప్రచారం చేయడానికి టూల్‌కిట్‌ను సృష్టించిందని విమర్శించింది. తప్పుడు ప్రచారం కోసం ట్విట్టర్‌ను సైతం కాంగ్రెస్ వాడుకుంటోందని బీజేపీ చెబుతోంది. (చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్న 76 ఏళ్ల బామ్మ) -
Toolkit రగడ: దుమ్మెత్తి పోసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ
న్యూఢిల్లీ: కోవిడ్‌పై రాజకీయ వివాదానికి తెరలేపిన 'కాంగ్రెస్ టూల్‌కిట్' వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య చెలరేగిన మాటల యుద్ధం చల్లారడం లేదు. నిన్నటి వరకు ట్విట్టర్ వేదికగా టూల్‌కిట్ విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న పార్టీలు ఇప్పుడు కరోనా మ్యూటెంట్ పేరిట దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ట్విట్టర్ లేబుల్‌తో ఈ గొడవ సమసిపోతుంది అనుకుంటున్న సమయంలో టూల్‌కిట్ వివాదాన్ని తిరగదోడారు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా. ఈరోజు ఆయన భోపాల్‌లో మాట్లాడుతూ ‘‘ఇండియన్ వేరియంట్ అనే వైరస్ లేకున్నా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్... ఇండియన్ వేరియంట్, సింగపూర్ వేరియంట్ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నేత కమల్ నాథ్ కూడా ఇలాగే చెప్పారు. టూల్‌కిట్‌తో కమల్‌నాథ్‌కి సంబంధం ఉందని చెప్పడానికి ఇంతకంటే వేరే ఆధారం లేదు’’ అంటూ విమర్శించారు. కమల్ నాథ్ కౌంటర్.. నరోత్తం మిశ్రా ప్రకటనపై ఘాటుగా స్పందించారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్. ఈ వైరస్‌ని మొదట చైనా వైరస్ అన్నారు. ఇప్పుడు ఇండియన్ వేరియంట్ వంతు వచ్చింది. మన శాస్త్రవేత్తలు, డాక్టర్లు కూడా న్యూ స్ట్రెయిన్‌ని ఇండియన్ వేరియంట్ అనే పిలుస్తున్నారు. కేవలం బీజేపీనే దీన్ని అంగీకరించడం లేదు. మన ప్రధానికయితే ఇండియన్ వేరియంట్ అంటేనే భయం పట్టుకుంది. అందుకే టూల్‌కిట్ అంటూ అర్థం లేని విమర్శలు చేస్తున్నారంటూ’’ బీజేపీకి కౌంటర్ ఇచ్చారు కమల్‌నాథ్. ఏమిటీ వేరియంట్.. వైరస్లు సర్వసాధారణంగా వెనువెంటనే వాటి రూపాన్ని మార్చుకుంటాయి. వాటినే స్ట్రెయిన్, మ్యూటెంట్‌గా పిలుస్తారు. ఇండియాలో వచ్చిన కరోనా మ్యూటెంట్‌కి సాంకేతికంగా బీ.1.167 గా గుర్తించారు. అయితే మీడియాతో పాటు సోషల్ మీడియాలో దీన్ని ఇండియన్ వేరియంట్‌గానే పేర్కొంటున్నాయి. ఇండియన్ వేరియంట్ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించనప్పుడు ... ఆ పేరు ఎందుకు ఉపయోగిస్తున్నారని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడైనా ఇండియన్ వేరియంట్ అనే పదం కనిపిస్తే తొలగించాలని లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ని హెచ్చరించింది కేంద్రం. చదవండి: ట్విట్టర్.. నీకిది సరికాదు: కేంద్రం -
ట్విట్టర్.. నీకిది సరికాదు: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: టూల్‌కిట్ వివాదం ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వాల మధ్య అగ్గి రాజేసింది. ఒక అంశంపై విచారణ కొనసాగుతుండగా ట్విట్టర్ తీర్పులు చెప్పడం సరికాదంటూ కేంద్రం అభిప్రాయపడింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర చేసిన ట్వీట్‌ని మానిప్యులేటెడ్ మీడియాగా ట్విట్టర్ లేబుల్ వేయడాన్ని తప్పుపట్టింది మోదీ సర్కార్. మానిప్యులేటెడ్ మీడియా లేబుల్ తొలగించాలని ట్విట్టర్‌ని కోరింది. టూల్‌కిట్ వివాదం కరోనా సంక్షోభాన్ని అడ్డుపెట్టుకుని మోదీ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందంటూ ఆరోపించారు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర. మోదీ ఇమేజ్‌కి భంగం కలిగించేలా విదేశీ మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తూ కాంగ్రెస్ కుట్ర పన్నుతోందంటూ కొన్ని డాక్యుమెంట్స్‌తో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ టూల్‌కిట్ ఎక్స్పోస్డ్ అంటూ కామెంట్ చేశారు. బీజేపీ శ్రేణులు ఈ ట్వీట్‌ని విపరీతంగా వైరల్ చేశాయి. కాంగ్రెస్ ఫైర్ సంబిత్ పాత్ర టూల్‌కిట్ పోస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండి పడింది. అంతటితో ఆగకుండా సంబిత్ పాత్రతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటు మరికొందరు బీజేపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోంది. ట్విట్టర్ చర్యలు సంబిత్ పాత్ర టూల్‌కిట్ పోస్ట్‌పై ట్విట్టర్‌కి కూడా ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్‌తో కాంగ్రెస్‌ని ఇబ్బంది పెట్టేందుకే సంబిత్ పాత్ర ఈ పోస్ట్ చేశారంటూ ట్విట్టర్‌కి వివరించింది. కాంగ్రెస్ ఫిర్యాదుపై ట్విట్టర్ స్పందించింది. సంబిత్ పాత్ర ట్వీట్‌కి మానిప్యులేటెడ్ మీడియా అంటూ లేబుల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ లేబుల్ పైనే కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
దిశారవికి బెయిల్: కుటుంబీకులను చూసి కంటతడి
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా చర్యలు చేపట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవికి బెయిల్ లభించింది. రూ.లక్ష పూచీకత్తుగా చెల్లించి బెయిల్ పొందాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. టూల్ కిట్ కేసులో దిశ రవి అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు కోర్టుకు హాజరయ్యే సమయంలో కుటుంబసభ్యులను చూసి దిశా రవి భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి దిశా రవి సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు తెలిపిందని.. గణతంత్ర దినోత్సవం రోజు రెచ్చగొట్టేలా ప్రయత్నాలు చేసినట్లు దిశ రవిపై అభియోగాలు నమోదయ్యాయి. టూల్ కిట్ పేరుతో పక్కా ప్రణాళికతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుందని దిశ రవిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని నివాసంలో 22 ఏళ్ల దిశా రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు మంగళవారం ఢిల్లీ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విచారణ సందర్భంగా ధర్మాసనం ‘అసలు టూల్‌కిట్ ఏమిటి’ అని ప్రశ్నించింది. ఆధారాలు అస్పష్టంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేస్తూ దిశా రవికి కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే రూ.లక్ష పూచీకత్తు చెల్లించడం దిశా రవికి కష్టతరమని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ఇదే కేసులో నిఖితా జాకబ్, శంతను ములుక్‌లను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి గతంలోనే బెయిల్ మంజూరైంది. -
దిశా రవికి ఒక రోజు పోలీసు కస్టడీ
న్యూఢిల్లీ: ‘టూల్ కిట్’ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన పర్యావరణ పరిరక్షణ మహిళా కార్యకర్త దిశా రవిని ఒక రోజు పోలీసు కస్టడీకి సోమవారం ఢిల్లీలోని చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు అనుమతించింది. ఇతర నిందితులతో కలిపి ఆమెను విచారించేందుకు అనుమతించాలని పోలీసులు కోరడంతో మెజిస్ట్రేట్ పంకజ్ శర్మ ఈ ఆదేశాలిచ్చారు. అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన కేసు ఇదని పోలీసులు కోర్టుకు తెలిపారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తూ రూపొందిన టూల్ కిట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి సంబంధించి దిశా రవితో పాటు నికిత జాకోబ్, శంతను ములుక్‌లపై ఢిల్లీ పోలీసులు దేశద్రోహం సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎవరితో కలిపి తనను విచారించాలని పోలీసులు చెబుతున్నారో.. ఆ సహనిందితులు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని, పోలీసు కస్టడీలో లేరని, అలాంటప్పుడు తన కస్టడీని పోలీసులు ఎలా కోరుతారని దిశా రవి మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకువచ్చారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉంచి కూడా సహ నిందితులతో కలిపి తనను విచారించే అవకాశం ఉందని వాదించారు. మరోవైపు, దిశా రవి బెయిల్ పిటిషన్ సెషన్స్ కోర్టులో పెండింగ్‌లో ఉందని, మంగళవారం దానిపై తీర్పు వెలువడనుందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. -
సంతృప్తికర సమాధానాలు ఇవ్వండి: జడ్జి
న్యూఢిల్లీ: ‘‘అసలు టూల్‌కిట్ అంటే ఏమిటి? దిశ రవిపై ఏయే ఆరోపణలు ఉన్నాయి? ప్రాసిక్యూషన్ వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? జనవరి 26 నాటి హింసతో ఆమెకు ఉన్న ప్రత్యక్ష సంబంధాలు నిరూపించేందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయా?’’ అని ఢిల్లీ హైకోర్టు పోలీసులకు ప్రశ్నలు సంధించింది. కేవలం ఊహాజనిత అంశాల కారణంగా ఓ వ్యక్తికి బెయిలు నిరాకరించాలని కోరుతున్నారా అని ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘టూల్ కిట్’ కేసులో అరెస్టైన పర్యావరణ వేత్త దిశ రవి బెయిలు పిటిషన్ నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసుల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ తన వాదనలు వినిపించారు. ఈ మేరకు.. ‘‘ ఖలిస్థాన్ ఉద్యమానికి మద్దతు పలుకుతున్న పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్(పీజేఎఫ్) సంస్థతో దిశ రవికి సంబంధాలు ఉన్నాయి. ఎంఓ ధలివాల్ ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని ఆమె కలిశారు. కాబట్టి తన ఉద్దేశాలు ఏమిటో స్పష్టంగా అర్ధమవుతోంది’’ అని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన జస్టిస్ ధర్మేంద్ర రానా.. ‘‘మరి నాకైతే ఎంఓ ధలివాల్ ఎవరో తెలియదు’’అని వ్యాఖ్యానించారు. కాగా పీజేఎఫ్ అనే ఎన్జీవో సహ వ్యవస్థాపకులే ఈ ధలివాల్. మానవ హక్కులు, సామాజిక న్యాయం గురించి ఈ సంస్థ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 11 నెలల క్రితం దీనిని స్థాపించారు. అయితే ఖలిస్థాన్ వేర్పాటు వాదులకు ఇది మద్దతుగా ఉంటోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం గురించి న్యాయమూర్తికి తెలిపిన సాలిసిటర్ జనరల్.. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమాన్ని వాడుకుని, హింసకు ప్రేరేపించేలా కుట్రలు చేశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఓ వెబ్సైట్ లింక్‌ను కూడా న్యాయస్థానానికి సమర్పించారు. అయితే, ఇది డైరెక్ట్ లింకేనా లేదా కేవలం ఊహాజనిత అంశాలతో దిశరవికి ఈ అంశంతో ముడిపెడుతున్నారా అని జస్టిస్ రానా ప్రశ్నించారు. ఆమెకు వ్యతిరేకంగా ఇంకా బలమైన సాక్షాధారాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ఇందుకు బదులుగా.. ఈ కుట్రలో ఒక్కొక్కరు ఒక్కో పాత్ర పోషించారని, లోతుగా దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే అన్ని ఆధారాలు సేకరిస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ బదులిచ్చారు. అదే విధంగా దిశ రవి బయటకు వస్తే సాక్ష్యాధారాలను మాయం చేసే అవకాశం ఉందని, కాబట్టి ఆమెకు బెయిలు మంజూరు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘విచారణకు ఆమె సహకరించడం లేదు. తనకు సంబంధించిన డివైస్‌లను ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో కొంత సమాచారం డెలిట్ అయినట్లు గుర్తించాం. విచారణ కొనసాగుతోంది’’ అని పేర్కొన్నారు. అవన్నీ కాదు సంతృప్తికర సమాధానాలు ఇవ్వండి అంటూ న్యాయమూర్తి ప్రాసిక్యూషన్‌కు స్పష్టం చేశారు. తీర్పును మంగళవారం వరకు రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా స్వీడిష్ గ్రెటా థంబర్గ్ షేర్ చేసిన టూల్ కిట్‌ను దిశ రవితో పాటు మరో నికితా జాకబ్, శంతను ములుక్ ఎడిట్ చేశారని, తద్వారా గణతంత్ర దినోత్సవం నాటి ట్రాక్టర్ ర్యాలీలో హింస చెలరేగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన దిశ రవిని ఫిబ్రవరి 13న అరెస్టు చేశారు. చదవండి: ‘టూల్‌కిట్’ అంటే ఏంటో తెలుసా? దిశ రవి అరెస్టు: ఏమిటీ ఎఫ్ఎఫ్ఎఫ్? -
దిశ రవి.. ఎఫ్ఎఫ్ఎఫ్ అంటే ఏమిటి?
న్యూఢిల్లీ: జూలై 2020న బహు తక్కువ మందికి పరిచయం ఉన్న మూడు చిన్న పర్యావరణ పరిరక్షణా బృందాలకు చెందిన వెబ్సైట్లను మూసివేసి, వారిపైన ఉపా చట్టం ప్రయోగిస్తామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించినప్పుడు మొదటసారి వీరి పేర్లు వెలుగులోకి వచ్చాయి. అందులో ఒకటి ప్రస్తుతం టూల్‌కిట్ కేసులో అరెస్టయి పోలీసు కస్టడీలో ఉన్న దిశ రవికి సంబంధించిన వెబ్సైట్. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’’ఇండియా చాప్టర్‌కి దిశరవి సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఖలిస్తానీ సానుభూతి పరులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు వీరిని అరెస్టు చేసిన విషయం తెలిసందే. ఏమిటీ ఎఫ్ఎఫ్ఎఫ్ ? అసలింతకీ ఏమిటీ ఎఫ్ఎఫ్ఎఫ్? ఎఫ్ఎఫ్ఎఫ్ ఇండియా అనేది∙పర్యావరణ పరిరక్షణా సంస్థ. ఇది ప్రాజెక్టులకు అనుమతులు తదితరాలపైనా, పర్యావరణ సమస్యలపైనా, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చే నోటిఫికేషన్లపైనా ఈమెయిల్ క్యాంపెయిన్ చేస్తుంది. మతవిద్వేష అంశాలు.. అయితే ఎఫ్ఎఫ్ఎఫ్ ఇండియా వెబ్సైట్ ‘‘భారత సార్వభౌమాధికారానికి, శాంతికి, ప్రశాంతతకు, ప్రమాదకరంగా మారింది’’అని ఢిల్లీ పోలీసులు జూలై8, 2020న వెబ్సైట్ బాధ్యులకు నోటీసులు జారీ చేశారు. అలాగే వెబ్సైట్లో ‘‘మతపరమైన విద్వేషపూరిత అంశాలు, మెటీరియల్’’ఉన్నదని, ఇది సెక్షన్ 18 ప్రకారం(తీవ్ర వాద చర్యకు ఉసిగొల్పేదిగా, లేదా అందుకు కుట్రపన్నేదిగా)ఉన్నదని, ఇది అన్‌లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్(యుఏపీఏ)కిందకి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. అయితే ఆ తరువాత వెంటనే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఎఫ్ఎఫ్ వెబ్‌సైట్‌ని తిరిగి తెరిచేందుకు అనుమతించారు. ఆ తరువాతి రోజు నుంచి వెబ్సైట్ తిరిగి ఆరంభించారు. అయితే అప్పటి నుంచి ఆ వెబ్‌సైట్‌పై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఎఫ్ఎఫ్ఎఫ్ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అని అర్థం. అంటే మన భవిష్యత్తు కోసం శుక్రవారాన్ని కేటాయించండి అని. ప్రభుత్వాల చైతన్యం కోసం శుక్రవారాన్ని కేటాయించండి అన అర్థం. ప్రభుత్వ వర్గాల్లో పర్యావరణ చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు ప్రతి శుక్రవారం విద్యార్థులు నిరసన తెలిపే లక్ష్యంతో స్వీడన్‌కి చెందిన పర్యావరణ ఉద్యమకారణి గ్రేటాథన్బర్గ్ 2018లో ఎఫ్ఎఫ్ఎఫ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఏడాదికి ఎఫ్ఎఫ్ఎఫ్ ఇండియా చాప్టర్‌ని స్థాపించారు. ప్రస్తుతం ఇది దేశంలోని పలు నగరాల్లో ఉంది. దేశవ్యాప్తంగా 150 మంది పూర్తిస్థాయి పర్యావరణ కార్యకర్తలు ఇందులో పనిచేస్తున్నారు. ఇతర దేశాల్లోని ఏకీభావం ఉన్న పర్యావరణ పరిరక్షణా సంస్థలతో కలిసి ఎఫ్ఎఫ్ఎఫ్ పనిచేస్తుంది. అటవీ సంరక్షణకోసం ప్రచారోద్యమం గోవాలోని మొల్లెం అటవీప్రాంత పరిరక్షణ, జమ్మూలోని రైకా ఫారెస్ట్ పరిరక్షణోద్యమం, మధ్య ప్రదేశ్‌లోని దుమ్నా నేచర్ పార్క్‌ల పరిరక్షణలు ఈ పర్యావరణ సంస్థ చేపట్టిన ప్రచారకార్యక్రమాల్లో ప్రధానమైనవి. అరే కాలనీలో మెట్రో ప్రాజెక్టుకోసం వేలాది చెట్లను నరికివేస్తున్నప్పుడు 2019, అక్టోబర్‌లో, ఎఫ్ఎఫ్ఎఫ్ కార్యకర్తలకీ పోలీసులకీ మధ్య ఘర్షణ తలెత్తడంతో ఎఫ్ఎఫ్ఎఫ్కార్యకర్తలను కొందరిని అరెస్టు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ ప్రజల ఉద్యమం ‘‘పర్యావరణ న్యాయం కోసం ప్రపంచ ప్రజల ఉద్యమం’’(గ్లోబల్ పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ క్లైమేట్ జస్టిస్) అనే నినాదంతో తమ వెబ్సైట్ లక్ష్యాన్ని ఈ ఎఫ్ఎఫ్ఎఫ్ సంస్థ సుస్పష్టంగా వెబ్సైట్లో ఉంచింది. ‘‘సమగ్ర, పర్యావరణ సమతుల్యత కోసం నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా ఉద్యమం నిర్వహిస్తామని, పర్యవారణ సమతుల్యత కోసం అహింసా మార్గంలో క్లైమేట్ స్ట్రయిక్, లేదా శాంతియుత ప్రదర్శనలు నిర్వహిస్తామని, తద్వారా రాష్ట్రప్రభుత్వాలు పర్యావరణ సంక్షోభాన్ని నిలువరించే చర్యలు చేపట్టేలా ఎఫ్ఎఫ్ఎఫ్ ఇండియా కృషి చేస్తుందని ఈ సంస్థ తన వెబ్సైట్లో స్పష్టం చేసింది. కుట్రదారులంటోన్న పోలీసులు ఏది ఏమైనా, దిశ, నికితా జాకబ్, శాంతాను ములుక్ లు రైతుల ఆందోళనకు మద్దతు పలికే గ్రేటాథన్ బర్గ్ టూల్‌కిట్ ని ట్వీట్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రైతుల ఆందోళనను అవకాశంగా తీసుకొని భారత దేశాన్ని అస్థిరపరిచే ‘అంతర్జాతీయ కుట్ర’గా దీన్ని పోలీసులు అభివర్ణిస్తున్నారు. గ్లోబల్ క్లైమేట్ స్ట్రయిక్ 2019 సెప్టెంబర్‌లో ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ సంస్థ వాతావరణ మార్పులపై గ్లోబల్ క్లైమేట్ స్ట్రయిక్ కార్యక్రమంలో భాగంగా భారత్‌లో సైతం పలు ప్రదర్శనలు నిర్వహించింది. మొదట పర్యావరణ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైన ఈ సంస్థకు చెందిన కార్యకర్తలు అనంతరం ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్ఆర్సీ ఉద్యమాల్లో ఎఫ్ఎఫ్ఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతోన్న రైతు ఆందోళనకి సైతం తమ మద్దతు తెలిపారు. అయితే వీరి ప్రథాన లక్ష్యం మాత్రం పర్యావరణ పరిరక్షణే. వీరంతా వాతావరణ మార్పులపై చైతన్యం తీసుకొచ్చే ప్రచార కార్యక్రమాల్లో భాగమై ఉంటారు. అందులో భాగంగా వీరు సరస్సులను శుభ్రపరచడం, పార్కులను పరిశుభ్రం చేయడం, సమస్యాత్మకంగా మారిన పర్యావరణ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తారు. చదవండి: #AT21: ఆ వయసులో నేను.. చదవండి: దిశ రవి అరెస్టుపై స్పందించిన ఆమె స్నేహితుడు -
టూల్‌కిట్ కేసు: ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న టూల్‌కిట్ కేసుకు సంబంధించి దిశ రవి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఢిల్లీ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘టూల్‌కిట్ కేసు దర్యాప్తులో భాగంగా.. ఢిల్లీ పోలీసులు మీడియాకు ఎలాంటి సమాచారం లీక్ చేయలేదు’’ అనే అంశానికి కట్టుబడి ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ‘‘టూల్‌కిట్ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు, మీడియా హౌస్‌లు తన వ్యక్తిగత వాట్సాప్ చాట్లను బహిర్గతం చేశారు. ఇక మీదట ఇలా జరగకుండా పోలీసులను ఆదేశించండి’’ అంటూ దిశ రవి ఢిల్లీ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా శుక్రవారం ఢిల్లీ హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు, మీడియా అత్యుత్సాహం వల్ల పిటిషనర్ గోప్యత హక్కు, కీర్తి హక్కు, న్యాయమైన విచారణ హక్కులకు తీవ్రమైన భంగం వాటిల్లినట్లు కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఒక జర్నలిస్టును వారి సోర్స్ గురించి వెల్లడించమని ఎలా ఒత్తిడి చేయలేమో.. దర్యాప్తు కొనసాగుతున్న కేసు విషయంలో కూడా ఇలాగే ఉండాలి. టూల్‌కిట్ కేసులో పోలీసులు తాము ఎలాంటి సమాచారం లీక్ చేయలేదని చెబుతుండగా.. మీడియాలో ఇందుకు విరుద్ధమైన కథనాలు ప్రసారం అవుతున్నాయి’’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టూల్‌కిట్ కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున.. దీనికి సంబంధించి పోలీసులు మీడియాకు ఎలాంటి సమాచారం లీక్ చేయవద్దని ఢిల్లీ హై కోర్టు ఆదేశించింది. దర్యాప్తు కొనసాగుతుండగానే.. దాని గురించి సగంసగం, ఊహాజనిత సమాచారం ప్రచారం చేయబడుతోంది అని దిశ రవి తరఫు న్యాయవాది అఖిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. "గోప్యత హక్కు, దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, వాక్ స్వాతంత్ర హక్కుల మధ్య సమతుల్యత అవసరం. ఇటీవలి టూల్కేట్ కేసుకు సంబంధించి ప్రసారమైన కథనాలు చూస్తే.. ఖచ్చితంగా మీడియా సంచలనాత్మక రిపోర్టింగ్ చేసిందని అర్థం అవుతోంది. ఏదైనా అంశం గురించి మీడియా సమావేశాలు జరగడం సాధారంణం. అలాంటి సమయంలో మీడియా సంచలనాత్మమైన పద్దతిలో సమాచారాన్ని వ్యాప్తి చేయడం తగదు’’ అని కోర్టు అభిప్రాయ పడింది. "దర్యాప్తుకు ఆటంకం కలగకుండా సమాచారాన్ని ప్రసారం చేసే సమయంలో సరైన సంపాదకీయ నియంత్రణ ఉండేలా చూసుకోండి" అని కోర్టు న్యూస్ ఛానెల్స్‌కు సూచించింది. "ప్రతివాదులు అందరికీ వివరణాత్మక సమాధానాలు దాఖలు చేయడానికి సమయం అవసరం" అని కోర్టు తెలిపింది. ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ (ఎ.ఎస్.జి) సూర్యప్రకాష్ వీ రాజు దీనిపై మాట్లాడుతూ.. ‘‘దిశ రవి పోలీసులపై ఒత్తిడి తెవడమే కాక వారిని అపఖ్యాతి పాలు చేస్తున్నారు.. దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇటువంటి పిటిషన్ దాఖలు చేశారు’’ అని ఆరోపించారు. చదవండి: అణచేస్తే అణగని జనగళం -
అణచేస్తే అణగని జనగళం
దేశద్రోహం అభియోగంతో ‘టూల్‌కిట్ కేసు’లో దిశను, మరికొందరిని అరెస్టు చేయడం ద్వారా మరెవరూ.. ఉద్యమాలవైపు వెళ్లకుండా గట్టి సంకేతమివ్వా లన్న సర్కారు ఆలోచన వికటించింది. ఓ అంతర్జాతీయ హక్కుల కార్యకర్త, ఇక్కడి రైతు ఉద్యమం పట్ల సానుభూతిగా ఉండటం, వారి సమస్యకు పరి ష్కారం కోరడం తప్పెలా అవుతుంది? దేశీయంగా తలెత్తుతున్న వ్యతిరేకతను అణచే మోదీ ప్రభుత్వపు ప్రతి చర్యా, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను ఒక్కో మెట్టు దిగజారుస్తోంది. రైతులకు ఏది మంచో, వారేం కోరుకుంటున్నారో... ఆ దిశలో నిజాయితీగా కృషి చేయడమే ప్రజాస్వామ్యానికి బలం. ప్రజాందోళనలు సునాయాసమైన ఆహ్లాద క్రీడలు కావు. ఎంతో శ్రమ, త్యాగాలతో కూడుకున్నవి. శక్తివంతమైనవి కూడా! తాము చేసేది, ‘సమాజ ఉమ్మడి ప్రయోజనాల కోసం’ అనే తలంపులోనే ప్రగాఢ శక్తి ఇమిడి ఉంది. ఎన్నో ప్రతీఘాత చర్యలకు ఎదురొడ్డి నిలుస్తాయి. వెంటనే ఫలితం కనపించకపోయినా... ఎప్పుడో ఒక ప్పుడు, ఏదో రూపంలో ఫలిస్తాయి. వాటిని కించపరిస్తే... అగ్నికి ఆజ్యం పోసినట్టు మరింత రగులుతాయి. అణచివేస్తే నేలకు కొట్టిన బంతిలా రెట్టించిన ఒత్తిడితో పైకి లేస్తాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కేంద్రంలోని పాలకపక్ష వ్యూహకర్తలు ఈ చారిత్రక సత్యాన్ని ఎందుకు విస్మరించారు? వ్యవ సాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం, దన్నుగా ఎక్కడికక్కడ జరుగుతున్న మద్దతు పోరా టాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి విమర్శలనెదుర్కొంటోంది. కొన్ని నెలలుగా ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి పాలకపక్షీయులు చేయని ఆలోచన లేదు, పన్నని వ్యూహరచన లేదు! అయినా, సాధిం చిందేమీ లేదు. గణతంత్ర దినోత్సవం నాటి దుర్ఘటనల ఆధారంగా... వేర్పాటు వాదులు, విధ్వం సక శక్తుల చేతుల్లోకి ఉద్యమం వెళిపోయిం దని చేస్తున్న ప్రచారానికీ స్పందన రాలేదు. ఆ ఒక్క ప్రతికూల పరి ణామంతో ఉద్యమ నాయకులూ ఢీలా పడ్డారు. ప్రభుత్వం దీన్ని ప్రచా రాస్త్రం చేయడంతో అంతా ‘ఇక అయిపోయింది’ అనుకున్నారు. కానీ, తిరిగి పుంజుకున్న రైతాంగ ఉద్యమం భౌగోళికంగా, భావజాలపరంగా ఇంకా విస్తరిస్తోంది. సరి కొత్త సవాళ్లు విసురుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా విరుగుడు ఆలోచిస్తూ కొత్త కార్యాచరణ చేపట్టింది. తాజాగా, పర్యావరణ కార్యకర్త దిశరవి అరెస్టు, అంతకు ముందు ఆమెపై దేశద్రోహం, కుట్ర, విద్వేషం రగిలించడం వంటి అభియో గాలతో ఢిల్లీ సైబర్ పోలీసులు కేసు పెట్టడం దేశం లోపల, బయట పెద్ద చర్చనే లేవనెత్తింది. మరో ఇద్దరు హక్కుల కార్యకర్తలపై దేశ ద్రోహం కేసు పెట్టి ‘బెయిల్‌లేని అరెస్టు వారెంట్’ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేయడంతో వారిద్దరూ బెయిల్ తీసుకుంటున్నారు. ‘శాంతియుత అస మ్మతి, విమర్శ, నిరసన... దేశ పౌరుల ప్రాథమిక హక్కు’ రైతు ఉద్య మంలో అరెస్టయిన ఇద్దరికి బెయిల్ ఇస్తూ ఢిల్లీ అదనపు సెషన్స్ జడ్జి ఇటీవల చేసిన ఈ వ్యాఖ్య రాజ్యాంగపరమైన మౌలికాంశాన్ని తెరపైకి తెచ్చింది. ‘నిరసనల్ని తొక్కిపెట్టడానికో, విమర్శకుల నోరుమూయిం చడానికో దేశద్రోహం చట్టాన్ని దుర్వినియోగపరచనీయం’ అన్నారీ సందర్భంగా! ఏమనుకుంటే ఏమౌతోంది? ప్రభుత్వం, నిర్దిష్ట సంకేతమివ్వాలనే కొన్ని చర్యలు చేపడుతుంది. కానీ, కొన్నిమార్లు సదరు చర్య అందుకు భిన్నమైన సందేశాన్ని జనం లోకి తీసుకుపోతుంది. దిశ అరెస్టులోనూ అదే జరిగింది. దేశద్రోహం అభియోగంతో ‘టూల్‌కిట్ కేసు’లో దిశను, మరికొందరిని అరెస్టు చేయడం ద్వారా మరెవరూ.... ఉద్యమాలవైపు వెళ్లకుండా గట్టి సంకేత మివ్వాలన్న సర్కారు ఆలోచన వికటించింది. ‘56 ఇంచ్‌ల ఛాతీ, నిత్య కసరత్తులతో సడలని దృడఖాయం, వెరువని ధీరోదాత్తమైన వజ్ర సంకల్పం.. ఇరవయేళ్ల అమ్మాయికి ఇంతగా భయపడుతోందా?’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వ్యాఖ్యలు, సంప్రదాయ మీడియాలో వెలసిన కార్టూన్లు పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. న్యూయార్క్‌లో ఉండే భారత మేధావి, ప్రఖ్యాత కాలమిస్ట్ సలీల్ త్రిపాఠీ దాదాపు ఇలాగే స్పందించారు. ‘‘ఢిల్లీ పోలీసులు పేర్కొన్న దాన్ని బట్టి... భారత్ ఇపుడు అతి ప్రమాదస్థితిలో ఉంది. 2.6 ట్రిలి యన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, అణ్వాయుధంతో ప్రపంచంలోని అయి దింట ఒకటైన మహాదేశం, ఓ బలీయశక్తి ముందు అత్యంత దుర్భ లంగా కనిపిస్తోంది. అదేదో మరో అణ్వాయుధమున్న శత్రుదేశం కాదు, విడివిడిగా–ఎవరికి వారుగా ఉండే సెలబ్రిటీలు, విభిన్నరంగాల సామాజిక కార్యకర్తలు, పోరాటాలు–ఉద్యమాలతోనే జీవించే, ప్రధాని మోదీ పరిభాషలో ‘ఆందోళన జీవుల’ బృందమది’’ అంటారాయన. డిజిటల్ సాంకేతికత వచ్చాక, ఐటీ తదితర రంగాల నెట్వర్కింగ్ వ్యూహకర్తలే కాకుండా ప్రజాపోరాటాలు జరిపేవారు కూడా ‘టూల్ కిట్’ ఉపకరణాన్ని వాడుతారు. ఇదేం మారణాయుధం కాదు. ఐటీ యుగంలో ఇదొక పరస్పర సమాచార మార్పిడి వేదిక. భాగమైనవారు, సమాచారాన్ని వేర్వేరు రూపాల్లో పంచుకుంటారు. ఇది చాలా సాధా రణ ప్రక్రియ. అయితే, దీన్ని ‘ఖలిస్తాన్’ వేర్పుటువాదంతో ముడిపెట్టి, వారితో రహస్యంగా సంబంధాలు నెరపడం కింద నిర్దిష్ట అభియోగా లతో దిశరవితో పాటు మరో హక్కుల కార్యకర్త, ముంబై అడ్వకేట్ నికితా జాకోబ్, పర్యావరణ కార్యకర్త–ఇంజనీర్ శంతను ములుకుల పైనా కేసులు నమోదు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఇదివరకే జారీ చేసిన మార్గదర్శకాల్ని బేఖాతరంటూ, అంతర్రాష్ట్ర అరెస్టుల్లో పాటిం చాల్సిన కనీస పద్దతుల్నీ ఢిల్లీ పోలీసులు విస్మరించారు. దిశను బెంగళూరు నివాసంలో అరెస్టు చేసేటప్పుడు పోలీసులు భయోత్పాతం సృష్టిం చారు. ఇదంతా పోలీసుల, తద్వారా ప్రభుత్వం వైఖరిని వెల్లడించేదే అనే విమర్శలున్నాయి. మొరటు చర్యలు అణచగలవా? సమస్యను, దాని మూలాలను అర్థం చేసుకోవడంలో వైఫల్యం వల్లే పలు విషయాల్లో కేంద్ర ప్రభుత్వం అతిగా స్పందిస్తోందన్నది విమర్శ. స్వీడన్ పర్యావరణ యువకార్యకర్త గ్రెటా తన్‌బర్గ్ ట్వీట్‌కు స్పందిం చడం ఓ ఉదాహరణ. వేర్వేరు రంగాల దేశీ ప్రముఖులతో ప్రతిస్పం దనలు ఇప్పించి, వ్యవహారాన్ని జటిలం చేయడమే కాక దేశ ప్రతిష్టను అంతర్జాతీయ సమాజంలో దిగజార్చారు. ఓ అంతర్జాతీయ హక్కుల కార్యకర్త, ఇక్కడి రైతు ఉద్యమం పట్ల సానుభూతిగా ఉండటం, వారి సమస్యకు పరిష్కారం కోరడం తప్పెలా అవుతుంది? దాన్ని దేశ సార్వ భౌమాధికారంలో చొరబాటుగా పరిగణించడం విమర్శలకు తావి చ్చింది. ఇదే నిజమైతే... నేటి చైనా నాయకత్వ సరళిపైన, నిన్నటి ట్రంప్ నిర్ణయాల పట్ల, మొన్నటి హిట్లర్ నియంతృత్వం మీద మనం, మన మేధావులు చేసిన వ్యాఖ్యలన్నీ ఆయా దేశాల సార్వభౌమాధికార ధిక్కరణలేనా? ఎవరిపైన అయినా దేశద్రోహం ఆరోపించడం తేలిక! నిరూపించడం దుర్లభం. లేనపుడు రుజువుచేయడం అసంభవం. ఉద్యమాలను బలహీనపరచడానికి, సాధారణ జనంలో దురభిప్రాయం కలిగించడానికి దేశద్రోహం ఆపాదిస్తున్నారనే విమర్శ బలపడుతోంది. రైతాంగ పోరాటాన్ని అణచే ఎత్తుగడల్లో ఇదీ ఒకటనే భావన జనంలోకి చొచ్చుకు పోతోంది. ఉద్యమాలను సామరస్యంగానే తప్ప మొరటు, అణచివేత చర్యల ద్వారా అదుపుచేయలేమన్నది ప్రపంచవ్యాప్తంగా నిరూపిత మైంది. అమెరికా మేధావి, విశ్లేషకుడు జెనె షార్ప్ 200కు పైగా అహింసాయుత నిరసన పోరాటాలను, ‘నియంతృత్వం నుంచి ప్రజా స్వామ్యం వైపు’ అనే తన పుస్తకంలో నిర్వచించారు. అనేక దేశాల్లో కార్యకర్తలు, ఉద్యమనేతలు దీన్నొక మార్గదర్శిగా మలుచుకొని నియం తృత్వాల స్థానే ప్రజాస్వామ్యాలు ఏర్పరచుకున్నారు. బ్రిటిష్ విశాల సామ్రాజ్యాధీశుల్ని పిడికెడు ఉప్పుతో వణికించిన మహాత్ముడిని పలుమార్లు ఆ పుస్తకంలో ఆయన ఉటంకించారు. దేశీయంగా తలెత్తుతున్న వ్యతిరేకతను అణచే మోది ప్రభుత్వ ప్రతి చర్యా, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను ఒక్కో మెట్టు దిగ జారుస్తోంది. ఉదారప్రజాస్వామ్యమనే కీర్తి క్రమంగా పలుచబారు తోంది. మోదీ వీసాను అమెరికా పునరుద్దరించాక, సదరు సంబంధాల మెరుగుకు ఎన్ని యేళ్లు ఆయన శ్రమించాల్సి వచ్చింది? ఈ అయిదా రేళ్ల కృషిలో అంతర్జాతీయంగా భారత్‌కు లభిం చిన పేరు ప్రతిష్టల్ని, కీలక పాత్రనీ ఎందుకు కాలదన్నుకోవడం? రైతాంగం మదిలో చోటు కోల్పోవడం వల్లే, తమకు బాగా పట్టున్న ఉత్తరాదిలోనూ జనాదరణ కోల్పోవాల్సి వస్తోందని పంజాబ్ పట్టణ ఎన్నికల ఫలితాల్ని చూసి పాలకపక్షం గ్రహించాలి. పంతం వీడి, రైతులకు ఏది మంచో, వారు ఏం కోరుకుంటున్నారో... ఆ దిశలో నిజాయితీగా కృషి చేసి, జనాభీ ష్టాన్ని నిరవేర్చడమే ప్రజాస్వామ్యానికి బలం. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్: dileepreddy@sakshi.com -
#AT21: ఆ వయసులో నేను..
ఇరవై ఏళ్ల క్రితం యూనివర్సిటీలో డీన్ ఆర్డర్ కాపీని డీన్ ఎదుటే ముక్కలు ముక్కలుగా చింపి డీన్ ముఖాన విసిరికొట్టిన విద్యార్థి ఈరోజు.. జీవితం ఏరోజుకా రోజు పాస్ చేస్తుండే ఆర్డర్స్‌ని విధేయుడై ఒబే చేస్తుండవచ్చు. **** ఇరవై ఏళ్ల క్రితం నాన్న పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే అమ్మ సపోర్టుతో ఇంట్లోంచి జంప్ అయిపోయి ఢిల్లీ చేరుకుని హాస్టల్ లో ఉండి, చిన్న ఉద్యోగం చేసుకుంటూ సివిల్స్‌కి ప్రిపేర్ అయిన అమ్మాయి ఈరోజు.. మహిళా సంక్షేమ శాఖలో పెద్ద ఆఫీసర్ గా పని చేస్తూ ఉండొచ్చు. **** మరీ ఇంత గంభీరమైనవే కాకున్నా.. ఆ వయసులో.. 21, 22 ఏళ్ల వయసులో.. తామెలా ఉన్నదీ ట్విట్టర్లో కొందరు షేర్ చేసుకుంటున్నారు! అందుకు వాళ్లకు ప్రేరణ నిచ్చింది.. ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఐదుగురు యువతులు.. దిశ, సఫూరా, ప్రియాంక, నవదీప్, నిఖిత. బయటి ప్రపంచంలో, ఇంటర్నెట్లో రెండు చోట్లా ఇప్పుడు యువ ప్రభంజనమే విప్లవిస్తోంది! బయటి ప్రపంచానికి ఒక ప్రతిఫలనంగా, ఒక ప్రతిధ్వనిగా సోషల్ మీడియా పల్లవిస్తోంది. రైతు ఉద్యమాన్నే చూడండి. ఇప్పుడిది మెల్లిగా ఒక యువ మహోద్యమంగా మలుపు తీసుకుంటున్నట్లే ఉంది. దిశ రవి, నవదీప్ కౌర్, నిఖితా జాకబ్, సఫూరా జర్గార్, ప్రియాంక పాల్.. అంతా తమ ఇరవైలలో ఉన్న గళాలు, స్వరాలు, శంఖారావాలు. వీళ్లలో కొందరు జైళ్లలో ఉన్నారు. మరికొందరు జైళ్ల బయట అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు. అకస్మాత్తుగా ఇండియా కు జవసత్వాలు వచ్చినట్లయింది. నేటి యువతరం మధ్యలోకి నాటి ఇరవైల యువతీయువకులు కూడా వచ్చేసి ఆనాటి తమ పిడికిళ్లను ఉత్సాహంగా విప్పి చూపిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం తామెలా ఉద్యమించిందీ, తమనెలా పెద్దవాళ్లు నిరుత్సాహపరిచిందీ, తామెలా గెలిచిందీ, తామెలా నిలిచిందీ.. ట్విట్టర్లో ‘ఎట్ 21’ హ్యాండిల్‌తో.. ‘ఆ వయసులో నేను’ అంటూ అనుభవాలు షేర్ చేసుకుంటున్నారు. అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇప్పటి యూత్‌ని ప్రశంసిస్తున్నారు. అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. వాళ్లను ఇంతగా ప్రభావితం చేసి, వాళ్ల పాత జ్ఞాపకాలు గుర్తు చేసిన ఈతరం యంగ్ లీడర్స్ ఈ ఐదుగురు గురించైతే తప్పకుండా తెలుసుకోవలసిందే. దిశా రవి (21) ప్రస్తుతం ఈమెపై ఢిల్లీలో విచారణ జరుగుతోంది. స్వీడన్ టీనేజ్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు భారత్‌లోని రైతు ఉద్యమ ‘వ్యూహ రచన’లో సహాయం చేసిందన్న ఆరోపణ పై బెంగుళూరు నుంచి దిశను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆమెపై ‘టూల్‌కిట్’ కేసు పెట్టారు. రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు కుట్రపూరితంగా ఒక ప్రణాళిక తయారైందని అనుమానిస్తూ ఆ ప్రణాళికకే పోలీసులు ‘టూల్‌కిట్’ అని పేరుపెట్టారు. దిశ ‘ఫ్రైడేస్ ఫర్ ఫార్యూన్ ఇండియా’ (ఎఫ్.ఎఫ్.ఎఫ్.) సంస్థ వ్యవస్థాపకురాలు. పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తుంటారు. 2018లో ఎఫ్.ఎఫ్.ఎఫ్. ప్రారంభం అయింది. భవిష్యత్ వాతావరణ సంక్షోభంపై దిశ కాలేజీ స్టూడెంట్స్‌ని చైతన్యవంతులను చేస్తుంటారు. పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు. గత ఆదివారం ఆమె బెంగళూరులోని తన ఇంట్లో ఉండగా ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరపరిచారు. టూల్‌కిట్‌తో ఆమెకు ఉన్నాయని అనుకుంటున్న సంబంధాలపై దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం దిశ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమెను విడుదల చేయాలని బెంగళూరు, ఇతర నగరాలలో విద్యార్థులు ప్రదర్శనలు జరుపుతున్నారు. సఫూరా జర్గార్ (28) సఫూరా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో ఎం.ఫిల్. విద్యార్థిని. 2019 పౌరసత్వం సవరణ చట్టం ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు గత ఏడాది ఏప్రిల్‌లో అరెస్ట్ అయ్యారు. అప్పటికి ఆమె గర్భిణి. 2020 ఢిల్లీ అల్లర్లకు కుట్ర పన్నారన్నది ఆమెపై ప్రధాన అభియోగం. ఆరో నెల గర్భిణిగా ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో గత జూన్‌లో ఆమెను జైలు నుంచి విడుదల చేశారు. సఫూరా కశ్మీర్ అమ్మాయి. మానవ హక్కులు, మత సామరస్యం, శాంతియుత సహజీవనం వంటి వాటి మీద ప్రసంగాలు ఇస్తుంటారు. ప్రియాంకా పాల్ (19) ప్రియాంకకు ‘ఆర్ట్వోరింగ్’ అనే వెబ్సైట్ ఉంది. ఆమె చిత్రకారిణి, కవయిత్రి, రచయిత్రి, కథావ్యాఖ్యాత. ఎల్.జి.బి.టి. సభ్యురాలిగా తనని తాను ప్రకటించుకున్నారు. కులం, లైంగిక వివక్ష, మానసిక ఆరోగ్యం, బాడీ పాజిటివిటీ (తమ దేహాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆత్మ విశ్వాసంతో అంగీకరించడం) వంటి సామాజిక అంశాలపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్లో స్పష్టమైన, పదునైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. గత నవంబర్‌లో ప్రియాంక, కంగనా రనౌత్ ట్విట్టర్ వేదికగా మాటా మాటా అనుకున్నారు. మొదట కంగనానే ప్రియాంకను బాడీ షేమింగ్ చేయడంతో ఘర్షణ మొదలైంది. నవ్‌దీప్ కౌర్ (23) నవదీప్ కౌర్ ‘మజ్దూర్ అధికార్ సంఘటన్’ (మాస్) కార్యకర్త. ఢిల్లీ సరిహద్దులోని సింఘులో ఆమె పని చేస్తున్న ఫ్యాక్టరీ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడటంపై ఆమె నోరు విప్పారు. ఫలితంగా ఫ్యాక్టరీ యాజమాన్యం ఆమెపై కేసులు పెట్టింది. జనవరి 12 నుంచి కౌర్ పంజాబ్‌లోని కర్నాల్ జైల్లో ఉన్నారు. ఈ దళిత యువతిపై జైల్లో లైంగిక అకృత్యాలు జరిగాయని, ఆమె లేవలేని పరిస్థితిలో ఉన్నారని సహ ఖైదీల నుంచి సమాచారం బయటికి పొక్కడంతో దేశవ్యాప్తంగా నవ్‌దీప్ కౌర్ విడుదల కోసం ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇప్పటికి మూడుసార్లు ఆమె బెయిల్ నిరాకరణకు గురైంది. ఢిల్లీలో పీహెచ్.డీ చేస్తున్న ఆమె చెల్లెలు రజ్వీర్ కౌర్ అక్కను విడిపించుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నారు. సోమవారం ఒక కేసులో మాత్రం ఆమెకు బెయిలు లభించింది. 50 వేల రూపాయలు కట్టి, అవసరమైన పత్రాలు అందజేస్తే ఆ కేసులో బెయిలు లభించినప్పటికీ, రెండో కేసులో కూడా బెయిల్ వచ్చేంతవరకు నవ్‌దీప్ విడుదల అయ్యే అవకాశం లేదు. నిఖితా జాకబ్ (29) టూల్‌కిట్ కేసులో ఏ క్షణాన్నయినా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్న మరో యువతి నిఖితా జాకబ్. ముంబైలో ఆమె లాయర్. దిశా రవితో కలిసి పుణెకు చెందిన శంతను, నిఖిత టూల్ కిట్ తయారు చేశారని.. వీళ్లంతా ఖలిస్తాన్ సాను భూతి సంస్థ ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ నిర్వహించిన జూమ్ సమావేశానికి హాజరయ్యారని పోలీసుల ప్రధాన ఆరోపణ. ముందస్తు బెయిలు కోసం నిఖిత బాంబే కోర్టును ఆశయ్రించారు. -
దిశ రవికి మద్దతుగా యువత వినూత్న నిరసన
ముంబై: ప్రస్తుతం దేశంలో టూల్‌కిట్ వివాదం నడుస్తోంది. రైతుల ఉద్యమానికి సంబంధించిన ఈ టూల్‌కిట్‌ని గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేశారు. అయితే దీన్ని బెంగళూరుకు చెందిన పర్యావరణ కార్యకర్త దిశ రవి ఎడిట్ చేశారని.. ఫలితంగా జనవరి 26న ఎర్రకోట వద్ద హింస చెలరేగిందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో దిశ రవితో పాటు శాంతను ములుక్, నికితా జాకోబ్ అనే మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిపై నాన్ బెయిల్‌బెల్ వారెంట్ జారీ చేశారు. అయితే ప్రభుత్వ చర్యలపై దేశ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం డిజిటల్ మీడియా వేదికగా యువత ‘‘ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేశంలో ఆందోళనను అణచివేస్తోంది’’ అనే నినాదాన్ని ప్రచారం చేస్తోంది యువత. ఈ మేరకు ‘‘ఫింగర్ఆన్యువర్లిప్స్’’, ‘‘ఫ్రీదిశారవి’’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నోటిపై వేలు ఉంచిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తోన్నారు నెటిజనులు. ఫోటోలతో పాటు మరికొందరు ‘‘మీకిది తెలుసా.. సామాన్యులను ఇబ్బందులకు గురి చేసే ప్రభుత్వ చర్యల గురించి అస్సలు మాట్లాడొద్దు’’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఫోటోలు, కామెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా పర్యావరణ కార్యకార్త ఒకరు మాట్లాడుతూ.. ‘‘పెదవులపై వేలు ఉంచుకోవడం అనేది ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించడానికే కాక దిశ రవితో పాటు అరెస్ట్ అయిన మిగతా వారికి సంఘీభావం తెలపడానికి ప్రతీక. వీరిని ప్రభుత్వం కఠినమైన యూఏపీఏ ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసింది. వారికి సంఘీభావంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెదవుల మీద వేలు ఉంచుకుని నిరసన తెలపుతున్నాం. మన దేశంలో ఎవరైనా నిరసన తెలిపితే.. ఉద్యమం చేస్తే.. వారిని సంఘ విద్రోహక శక్తులుగా ముద్రిస్తున్నారు. కానీ వాస్తవం అది కాదు. నిరసన తెలుపుతున్న వారంతా ప్రజల స్థితిగతులు మార్చాలని.. అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్న వారు’’ అన్నారు. ‘‘దేశంలో మిడతల దాడి, గత పదేళ్లుగా రైతుల ఆత్మహత్యలు, ఒక్క రోజులోనే ఉల్లి ధర మూడు సార్లు పెరగడం వంటి విషయాల గురించి మీకు తెలిసినప్పుడు.. మీరు దానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. జస్ట్ మీ పెదవుల మీద వేలు ఉంచుకోండి.. కామ్‌గా ఉండండి. నియమ్‌గిరి పర్వతాల్లో, గోవాలో అక్రమ మైనింగ్ గురించి తెలిసినా.. మొలెం అడవుల్లో కార్చిచ్చు రగిలిందని తెలిసినా.. వచ్చే ఆరేళ్లలో మన భవిష్యత్తు ఒకేలా ఉండదని తెలిసినా మీరు కామ్‌గా ఉండండి.. ఏం మాట్లడకుండా.. మీ పెదవుల మీద వేలు పెట్టుకుని నిశ్శబ్దంగా ఉండండి. ఎందుకంటే దేశంలోని ఏ అంశం మీదనైనా మీరు స్పందిస్తే.. మీ మాటల్ని వక్రీకరించి.. మిమ్మల్ని చట్ట ప్రకారం దోషులుగా ప్రకటించి కోర్టులో నిలబెడతారు. కనుక ఏం జరిగినా కామ్‌గా ఉండండి.. ప్రశ్నించొద్దు’’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు నెటజనులు. ‘‘ఫింగర్స్ఆన్యువర్లిప్స్’’ అనేది శాంతియుతమైన డిజిటల్ నిరసన ప్రదర్శన. ‘‘సామాన్యులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా యువత తమ స్వరాన్ని వినిపిస్తుంది. మౌనంగా ఉండమని వారిని భయపెట్టలేం. అలా చేసిన కొద్ది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతుకలు పెరుగుతాయి’’ అని తెలియజేయడమే ఈ నిరసన ప్రధాన ఉద్దేశం. చదవండి: దిశ రవికి గోవధ ఇష్టం ఉండదు.. అందుకే టూల్‌కిట్ వివాదం: పాక్ కీలక వ్యాఖ్యలు -
‘టూల్‌కిట్’ అంటే ఏంటో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా కొందరు ప్రముఖులు రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు. అందులో స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ కూడా ఉన్నారు. రైతు ఉద్యమానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో గ్రెటా థన్‌బర్గ్ ఒక టూల్‌కిట్‌ని షేర్ చేశారు. ఇది రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు థన్‌బర్గ్‌పై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. ఇక జనవరి 26వ తేదీన ఢిల్లీలో రైతుల ఆందోళన సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలకు టూల్‌కిట్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ వివాదం కారణంగా బెంగుళూరుకు చెందిన 22 ఏళ్ల దిశ రవి అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై కూడా పై సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలన్నిటింకి మూల కారణం టూల్‌కిట్. అసలు ఏంటీ టూల్‌కిట్.. దీనిపై అంతర్జాతీయంగా వివాదం తలెత్తడానికి గల కారణాలేమిటి.. అందులో దిశ రవి పాత్ర ఏమిటి.. అనే విషయాలు తెలుసుకుందాం.. టూల్‌కిట్.. ‘టూల్‌కిట్’ అంటే ఓ డాక్యుమెంట్. దేని గురించి అయినా వివరించే ఓ పత్రం, బ్లూ ప్రింట్ లాంటిది అని చెప్పవచ్చు. చరిత్రలో ఎన్నో ఉద్యమాలు నడిచాయి. కొన్ని ప్రపంచ గతినే మార్చేశాయి. తాజాగా గతేడాది అమెరికాలో ‘‘బ్లాక్ లైవ్స్ మాటర్’’, పర్యావరణానికి సంబంధించి క్లైమేట్ స్ట్రైక్ క్యాంపెయిన్ లాంటివి ఉన్నాయి. ఒకప్పుడు ఇలాంటి ఉద్యమాలు జరిగితే అందుకు సంబందించిన కార్యాచరణ, వ్యూహాలకు సంబంధించిన ప్రణాళికను కాగితాల మీద ముద్రించేవారు. దానిని ఆ ఉద్యమానికి మద్దతు తెలిపే వారికి చేరేలా చూసేవారు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆ స్థానంలోకి టూల్కిట్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏ ఉద్యమం అయినా సరే దానికి సంబందించిన ఒక డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తారు. దీనినే టూల్‌కిట్ అంటారు. ఆ ఉద్యమంలో పాల్గొనాలనుకునే వారు, దానిపై ఆసక్తి ఉన్నా వారు ఎవరైనా సరే ఈ టూల్‌కిట్‌ని చదివితే ఉద్యమానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. అంటే ఉద్యమంలో ఏ రోజున ఎలాంటి కార్యక్రమం ఉంటుంది.. ఎక్కడెక్కడ ర్యాలీలు, దీక్షలు ఉంటాయి.. ఉద్యమం ఎలా ముందుకు వెళ్తోంది అనే సమాచారం టూల్‌కిట్ ద్వారా తెలుస్తుంది. ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి.. ఉద్యమానికి మద్దతు పెంచడానికి ఈ టూల్‌కిట్‌ని సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేస్తుంటారు. ప్రపంచం నలుమూలలా ఉన్న మద్దతుదారులను ఏకం చేయడంలో ఈ టూల్‌కిట్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. గ్రేటా థన్‌బర్గ్ పాత్ర ఇలాంటి టూల్కిట్నే గ్రేటా థన్‌బర్గ్ ట్విట్టర్లో షేర్ చేశారు. దీనిలో దేశరాజధానిలో జరుగుతున్న ఉద్యమం ఏంటి.. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలు ఏంటి అనే వివరాలు ఉన్నాయి. ఈ టూల్కిట్లో ‘‘రైతులు సంపన్నలుగా, స్వాలంభన సాధించడానికి ఉద్దేశించిన ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈ చట్టాలు అమల్లోకి వస్తే.. వ్యవసాయం కార్పొరేట్, అంతర్జాతీయ సంస్థల గుప్పిట్లోకి వెళ్తుంది. వాటి ప్రధాన లక్ష్యం లాభాలు. దాని కోసం ప్రకృతిని దోచుకుంటారు’’ అని దీనిలో ఉంది. దిశ పాత్ర ఏంటి అయితే రైతులకు మద్దతుగా గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌ని దిశ రవి ఎడిట్ చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని దిశ రవి అంగీకరించినట్టుగా చెప్తున్నారు. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు. టూల్‌కిట్‌లోని రెండు మూడు లైన్లను ఎడిట్ చేసిన దిశ రవి ఆ తర్వాత అందులో అభ్యంతరకర విషయాలు ఉన్నాయంటూ తిరిగి గ్రేటాకు ట్వీట్ చేసింది. రైతులకు మద్దతివ్వడం కోసం ఇలా చేసానని ఆమె విచారణలో వెల్లడించారు. అంతేకాకుండా జనవరి 11న దిశ రవి, శాంతాను, నికితా అంతా జూమ్ యాప్‌ద్వారా వీడియో కాల్లో మాట్లాడుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను త్వరలోనే కోర్టులో ప్రవేశపెడతామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాగా గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌ను ఖలికిస్తాన్ ఉగ్రవాదులు తయారుచేసినట్లుగా ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ టూల్‌కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ముగ్గురు యువతుల అరెస్ట్‌పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రపూరింతగానే వీరిని అరెస్ట్ చేసిందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. చదవండి: టూల్‌కిట్ వివాదం: కీలక విషయాలు వెల్లడి -
దిశ రవికి గోవధ ఇష్టం ఉండదు.. అందుకే
న్యూఢిల్లీ/బెంగళూరు: ‘‘దిశ వాళ్లకు సాఫ్ట్ టార్గెట్. తను ఒక పోస్టర్ గర్ల్ లాంటిది. కాబట్టి తనను అరెస్టు చేస్తే మిగతా వాళ్లు గొంతెత్తాలంటే కాస్త వెనకడుగు వేస్తారు కదా. అందుకే ఇలా చేశారు’’ అని బెంగళూరుకు చెందిన యువ పర్యావరణవేత్త దిశ రవి స్నేహితుడు వినీత్ విన్సెంట్ అన్నారు. మ్యుజీషియన్‌గా పనిచేస్తున్న ఆయన, తన ఫ్రెండ్‌ను అరెస్టు చేయడం తనకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని పేర్కొన్నారు. కాగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలో భాగంగా, ఢిల్లీలో జనవరి 26న జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వీడిష్ యువకెరటం గ్రెటా థంబర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ టూల్‌కిట్ వివాదానికి దారి తీసింది. ఈ అంశంపై దృష్టి సారించిన ఢిల్లీ పోలీసులు దిశ రవి, శాంతను ములుక్, నికితా జాకబ్ అనే ముగ్గురు యువతులపై అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రెటా షేర్ చేసిన టూల్‌ను ఎడిట్ చేసి హింసకు ప్రేరేపించారన్న ఆరోపణలతో దిశ రవి, నికితను అరెస్టు చేశారు. శాంతను కోసం గాలిస్తున్నారు. వీరి అరెస్టు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన దిశ రవి ఫ్రెండ్ విన్సెంట్.. ‘‘దిశ అరెస్టు విషయం నన్ను షాక్‌కు గురిచేసింది. అదే సమయంలో జరిగేది ఇదే కదా అని కూడా అనిపించింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలను అంతతేలికగా తీసుకోలేం. సోషల్ మీడియాలో ఓ పోస్టు పెడితే మీరు అరెస్టు అవుతారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని జైళ్లో పెడతారు. అంతే కదా. దిశకు ఇలా జరిగిందంటే.. మనం కూడా ఏదో ఒకరోజు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోక తప్పదని అర్థమవుతోంది. ఏదేమైనా, అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పిన దిశకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నా. దిశకు జీవ హింస ఇష్టం ఉండదు. గోవులను వధిస్తే తను తట్టుకోలేదు. అంతేకాదు, వాటి నుంచి పాలు సేకరిస్తూ, ఓ వస్తువులా భావించడం వంటి అంశాలకు తను వ్యతిరేకం. అందుకే మొక్కల ఉత్పత్తుల ద్వారానే ఇలాంటి అవసరాలు తీరే ఉద్దేశంతో నెలకొల్పిన కంపెనీలో తను పనిచేస్తోంది. దయచేసి యువత ఉద్దేశం ఏమిటో మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఇదొక్కటే. దిశ లాంటి వాళ్లను అరెస్టు చేయాల్సిన అవసరం లేదు. తనతో ఒక్కసారి మాట్లాడి చూడండి. తనేమీ ఎక్కడికి పారిపోవడం లేదు కదా. తను అలాంటి పిరికి మనస్తత్వం కలది కాదు. ఆలోచించండి’’ అని విన్సెంట్ ఉద్వేగపూరితంగా మాట్లాడారు. దిశ అరెస్టును ఆయన ఈ సందర్భంగా ఖండించారు. చదవండి: టూల్‌కిట్ కేసు : కీలక విషయాలు వెల్లడి -
టూల్‌కిట్ వివాదం: కీలక విషయాలు వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ : టూల్‌కిట్ వ్యవహారంలో ముగ్గురు యువతుల అరెస్ట్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. అరెస్ట్‌ల ప్రక్రియను షూరు చేశారు. తొలుత ఓ యువతిని అరెస్ట్ చేయగా.. అనంతరం మరో ఇద్దరిని అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యవరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్‌కిట్‌తో ఈ ముగ్గురు యువతులు (దిశరవి, శాంతాను, నికితా జాకబ్) ఎడిట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం బెంగళూరుకు చెందిన యువ యాక్టివిస్ట్ దిశరవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయగా.. 24 గంటలు గడవకముందే శాంతాను, నికితాలపై ఢిల్లీ హైకోర్టు నాన్‌బెయిల్‌వారెట్ జారీచేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు నికితను అరెస్ట్ చేయగా.. శాంతాను పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అరెస్ట్ నుంచి నాలుగు వారాల పాటు తనకు విముక్తి కల్పించాలని కోరుతూ నికితా బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా.. రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో చోటుచేసుకున్న హింసకు సంబంధించిన ఘటనలో ఈ ముగ్గురు యువతుల పాత్రపై ఢిల్లీ పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశం ద్వారా వివరాలు తెలిపారు. ‘జనవరి 26న జరిగిన హింసాత్మక ఘటనతో దిశరవి, శాంతాను, నికితా జాకబ్‌కు ప్రత్యక్షంగా సంబంధముందని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం. స్వీడన్ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ తయారుచేసిన టూల్‌కిట్‌ను తొలుత దిశరవి ఎడిట్ చేశారు. అనంతరం శాంతాను, నికితా దీనిలో భాగస్వామ్యం అయ్యారు. కెనడాకు చెందిన చెందిన ఓ యువతి అందించిన సలహాలు, సూచనల ఆధారంగా సోషల్ మీడియాలో ఆ టూల్‌కిట్‌ను షేర్ చేశారు. టూల్‌కిట్‌ను టెలిగ్రామ్ ద్వారా గ్రెటా వీరికి షేర్ చేశారు. టూల్‌కిట్ గూగుల్ డాక్యుమెంట్‌ను ఎడిట్ చేసిన వారిలో దిశ ఒకరు. ఆ డాక్యుమెంట్లో మార్పులు చేర్పులతోపాటు వ్యాప్తి చేయడంలో దిశ కీలక కుట్రదారు. అంతేకాకుండా జనవరి 11న వీరంతా జూమ్ యాప్‌ద్వారా వీడియో కాల్లో మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను త్వరలోనే కోర్టులో ప్రవేశపెడతాం. మరికొన్న విషయాల కోసం విచారణ జరుపుతున్నాం’ అని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాగా గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌ను ఖలికిస్తాన్ ఉగ్రవాదులు తయారుచేసినట్లుగా ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ టూల్‌కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ముగ్గురు యువతుల అరెస్ట్‌పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రపూరింతగానే వీరిని అరెస్ట్ చేసిందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. టూల్‌కిట్ వివాదం: పాక్ కీలక వ్యాఖ్యలు -
టూల్‌కిట్ వివాదం: నికితాపై నాన్‌బెయిలబుల్ వారెంట్
సాక్షి,న్యూఢిల్లీ: రైతుల ఆందోళనకు మద్దతుగా స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ట్వీట్‌తో రాజుకున్న టూల్ కిట్ వివాదం మరింత ముదురుతోంది. 'టూల్‌కిట్ కేసు'లో దిశా రవిని అరెస్టు చేసిన ఢిలీ పోలీసులు మరో కీలక చర్య చేపట్టారు. ముంబై హైకోర్టు న్యాయవాది, కార్యకర్త నికితా జాకబ్, శాంతనులపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం స్పెషల్ సెల్ బృందం నికితా ఇంటికి వెళ్లినపుడు, ఆమె ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరిశీలించినట్లు తెలిపారు. కానీ ఆ రోజు సమయాభావం వల్ల నికితను ప్రశ్నించలేదు. మళ్లీ వస్తామని చెప్పామనీ, అప్పటినుంచి నికిత పరారీలో ఉందని ఆరోపిస్తూ వారెంట్ ఇష్యూ చేశారు. నికితా జాకబ్, దిశా రవి ఇతరులు పాల్గొన్న ఒక జూమ్ సమావేశంలో రైతు ఆందోళనకు సంబంధించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసేందుకు, నిరసన కారుల్లో ఆందోళనన పెంచేందుకు కుట్ర పన్నారని పోలీసులు ఆరోపించారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిశా రవి అరెస్ట్‌ను ఖండించారు. ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడి అని వ్యాఖ్యానించారు. రైతులకు మద్దతు ఇవ్వడం నేరం కాదని ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే థన్‌బర్గ్‌పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు పర్యావరణ, సామాజిక కార్యకర్త దిశా రవిని ఆదివారం అరెస్ట్ చేశారు. దేశద్రోహ కుట్ర కేసు నమోదు చేసి ఐదు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. బెంగళూరు ఐటీ సిటీకి చెందిన దిశా రవి రైతు ఆందోళనకు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు సపోర్ట్ చేస్తూ గ్రెటా థన్‌బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్ కిట్‌ను దిశా రవి అప్లోడ్ చేశారు. దీని వెనుక ఖలిస్థాన్ అనుకూల సంస్థ ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే టూల్‌కిట్ డాక్యుమెంట్‌లోని రెండు లైన్లను మాత్రమే తాను ఎడిట్ చేశానని దిశా పోలీసు విచారణలో వెల్లడించారు. డాక్యుమెంట్‌లోని అంశాలు అభ్యంతకరంగా ఉన్నందున దానిని తొలగించాలంటూ థన్‌బర్గ్‌ను కోరారని వివరణ ఇచ్చారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’అనే పర్యావరణ పరిరక్షణ సంస్థలో కీలక వ్యక్తిగా దిశ ఉన్నారు. దిశా రవి అరెస్టుపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా కేంద్రం తీసుకొచ్చి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సుదీర్ఘంగా సాగుతోంది. ఈ క్రమంలో రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసకు దారితీసింది. ఎర్రకోటపై జెండా ఎగురవేయడం వివాదాన్ని రేపింది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా గ్రెటా ట్వీట్ చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖలిస్థాన్ వేర్పాటువాదులు టూల్ కిట్‌ని రూపొందించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. (రైతు ఉద్యమం : దీప్ సిద్దూ అరెస్టు) చదవండి : రైతు ఉద్యమం : వారికి భారీ ఊరట Arrest of 21 yr old Disha Ravi is an unprecedented attack on Democracy. Supporting our farmers is not a crime. — Arvind Kejriwal (@ArvindKejriwal) February 15, 2021 -
ఢిల్లీ పోలీసుల అదుపులో దిశ
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: బెంగళూరు ఐటీ సిటీకి చెందిన పర్యావరణ, సామాజిక కార్యకర్త దిశా రవి (22)ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్ కిట్‌ను దిశా రవి అప్లోడ్ చేశారు. ఈ టూల్‌కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. ‘టూల్‌కిట్ గూగుల్ డాక్యుమెంట్‌ను ఎడిట్ చేసిన వారిలో దిశ ఒకరు. ఆ డాక్యుమెంట్లో మార్పులు చేర్పులతోపాటు వ్యాప్తి చేయడంలో దిశ కీలక కుట్రదారు’అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ డాక్యుమెంట్లో ట్విట్టర్లో తీవ్ర ప్రచారోద్యమం సహా రైతు సంఘాలకు మద్దతుగా చేపట్టాల్సిన వివిధ చర్యలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత దౌత్యకార్యాలయాల వద్ద నిరసనలు వంటివి ఉన్నాయి. దేశంలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చేందుకు ఆమె కుట్ర పన్నిందనే ఆరోపణలకు అసలైన సాక్ష్యం ఆ టూల్‌కిట్‌నేనని అంటున్నారు. ఆమె ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, విచారణ చేపట్టారు. దిశను ఢిల్లీ పోలీసులు బెంగళూరులోని నివాసంలో ఉండగా శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ కోర్టులో హాజరు పరిచారు. టూల్‌కిట్‌ను ఈ నెల 3వ తేదీన దిశ ఎడిట్ చేశారనీ, ఈ వ్యవహారంలో మరికొందరి పాత్ర కూడా ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. విచారణ సమయంలో దిశ కన్నీరు పెట్టుకున్నారు. రైతు ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు టూల్‌కిట్ డాక్యుమెంట్‌లోని రెండు లైన్లను మాత్రమే ఎడిట్ చేశానని ఆమె తెలిపారు. డాక్యుమెంట్‌లోని అంశాలు అభ్యంతకరంగా ఉన్నందున దానిని తొలగించాలంటూ థన్‌బర్గ్‌ను కోరినట్లు కూడా వెల్లడించారు. మేజిస్ట్రేట్ దేవ్ సరోహా ఆమెను ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 26వ తేదీన ఢిల్లీలో రైతుల ఆందోళన సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలకు టూల్‌కిట్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీంతో టూల్‌కిట్ రూపకర్తల సమాచారం అందించాలంటూ గూగుల్, ట్విట్టర్లను కోరారు. ఆ రెండు సంస్థలు ఇచ్చిన వివరాల మేరకు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థికపరమైన అలజడులను సృష్టించేందుకు కుట్ర పన్నారంటూ ఈనెల 4వ తేదీన ఖలిస్తాన్ అనుకూల పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, దిశా రవి ‘ఫ్రైడే ఫర్ ఫ్యూచర్’అనే క్యాంపెయిన్‌కు సహ వ్యవస్థాపకురాలు. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చేసి ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజర్ పనిచేస్తున్నారు. బెంగళూరులోని సోలదేవనహళ్లిలో దిశా నివాసం ఉంటున్నారు. కాగా, దిశ అరెస్టును సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తీవ్రంగా ఖండించింది. ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.