సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ టూల్‌కిట్ కేసుకు సంబంధించి మే 31న భారత ట్విటర్ ఎండీ మనీశ్ మహేశ్వరీని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. భారత ట్విటర్ ఎండీని విచారించడానికి మే 31న ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్ పోలీస్ బృందం కర్ణాటకలోని బెంగళూరుకు వెళ్లినట్లు వినికిడి. ఇక నటి స్వరా భాస్కర్, భారత ట్విటర్ ఎండీ మనీష్ మహేశ్వరి, ఇతరులపై ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వృద్ధ ముస్లిం వ్యక్తిపై దాడికి సంబంధించిన కేసుపై ఢిల్లీలోని తిలక్ మార్గ్ స్టేషన్‌లో ఫిర్యాదు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.
కాగా, ఫేక్ న్యూస్, వినియోగదారుల రక్షణ అంశంలో కేంద్రం, ట్విటర్ మధ్య వివాదం నేపథ్యంలో ఇండియాలో ఉన్న చట్టపరమైన రక్షణను తాజాగా కేంద్రం ఎత్తివేసింది. కొత్త ఐటీ నిబంధనల అమలుపై పదే పదే హెచ్చరిస్తున్నా ట్విటర్ పట్టించుకోని కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ‘కాంగ్రెస్ టూల్‌కిట్’పై బీజేపీ నేతల పోస్ట్‌లకు ట్విటర్ ‘‘మానిప్యులేటెడ్ మీడియా’’ అని ట్యాగ్ చేసింది. ఈ ట్యాగ్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరింది. దీనిపై నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని ట్విటర్ ఇండియా కార్యాలయాలకు మే 24న సాయంత్రం వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే ట్విటర్, ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment