
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా చర్యలు చేపట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవికి బెయిల్ లభించింది. రూ.లక్ష పూచీకత్తుగా చెల్లించి బెయిల్ పొందాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. టూల్ కిట్ కేసులో దిశ రవి అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు కోర్టుకు హాజరయ్యే సమయంలో కుటుంబసభ్యులను చూసి దిశా రవి భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి దిశా రవి సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు తెలిపిందని.. గణతంత్ర దినోత్సవం రోజు రెచ్చగొట్టేలా ప్రయత్నాలు చేసినట్లు దిశ రవిపై అభియోగాలు నమోదయ్యాయి. టూల్ కిట్ పేరుతో పక్కా ప్రణాళికతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుందని దిశ రవిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని నివాసంలో 22 ఏళ్ల దిశా రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు మంగళవారం ఢిల్లీ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
విచారణ సందర్భంగా ధర్మాసనం ‘అసలు టూల్‌కిట్ ఏమిటి’ అని ప్రశ్నించింది. ఆధారాలు అస్పష్టంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేస్తూ దిశా రవికి కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే రూ.లక్ష పూచీకత్తు చెల్లించడం దిశా రవికి కష్టతరమని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ఇదే కేసులో నిఖితా జాకబ్, శంతను ములుక్‌లను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి గతంలోనే బెయిల్ మంజూరైంది.
Comments
Please login to add a commentAdd a comment