ఇరవై ఏళ్ల క్రితం యూనివర్సిటీలో డీన్ ఆర్డర్ కాపీని డీన్ ఎదుటే ముక్కలు ముక్కలుగా చింపి డీన్ ముఖాన విసిరికొట్టిన విద్యార్థి ఈరోజు.. జీవితం ఏరోజుకా రోజు పాస్ చేస్తుండే ఆర్డర్స్‌ని విధేయుడై ఒబే చేస్తుండవచ్చు.
****
ఇరవై ఏళ్ల క్రితం నాన్న పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే అమ్మ సపోర్టుతో ఇంట్లోంచి జంప్ అయిపోయి ఢిల్లీ చేరుకుని హాస్టల్ లో ఉండి, చిన్న ఉద్యోగం చేసుకుంటూ సివిల్స్‌కి ప్రిపేర్ అయిన అమ్మాయి ఈరోజు.. మహిళా సంక్షేమ శాఖలో పెద్ద ఆఫీసర్ గా పని చేస్తూ ఉండొచ్చు.
****
మరీ ఇంత గంభీరమైనవే కాకున్నా.. ఆ వయసులో.. 21, 22 ఏళ్ల వయసులో.. తామెలా ఉన్నదీ ట్విట్టర్‌లో కొందరు షేర్ చేసుకుంటున్నారు! అందుకు వాళ్లకు ప్రేరణ నిచ్చింది.. ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఐదుగురు యువతులు.. దిశ, సఫూరా, ప్రియాంక, నవదీప్, నిఖిత.
బయటి ప్రపంచంలో, ఇంటర్నెట్‌లో రెండు చోట్లా ఇప్పుడు యువ ప్రభంజనమే విప్లవిస్తోంది! బయటి ప్రపంచానికి ఒక ప్రతిఫలనంగా, ఒక ప్రతిధ్వనిగా సోషల్ మీడియా పల్లవిస్తోంది. రైతు ఉద్యమాన్నే చూడండి. ఇప్పుడిది మెల్లిగా ఒక యువ మహోద్యమంగా మలుపు తీసుకుంటున్నట్లే ఉంది. దిశ రవి, నవదీప్ కౌర్, నిఖితా జాకబ్, సఫూరా జర్గార్, ప్రియాంక పాల్.. అంతా తమ ఇరవైలలో ఉన్న గళాలు, స్వరాలు, శంఖారావాలు. వీళ్లలో కొందరు జైళ్లలో ఉన్నారు. మరికొందరు జైళ్ల బయట అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు. అకస్మాత్తుగా ఇండియా కు జవసత్వాలు వచ్చినట్లయింది.
నేటి యువతరం మధ్యలోకి నాటి ఇరవైల యువతీయువకులు కూడా వచ్చేసి ఆనాటి తమ పిడికిళ్లను ఉత్సాహంగా విప్పి చూపిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం తామెలా ఉద్యమించిందీ, తమనెలా పెద్దవాళ్లు నిరుత్సాహపరిచిందీ, తామెలా గెలిచిందీ, తామెలా నిలిచిందీ.. ట్విట్టర్‌లో ‘ఎట్ 21’ హ్యాండిల్‌తో.. ‘ఆ వయసులో నేను’ అంటూ అనుభవాలు షేర్ చేసుకుంటున్నారు. అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇప్పటి యూత్‌ని ప్రశంసిస్తున్నారు. అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. వాళ్లను ఇంతగా ప్రభావితం చేసి, వాళ్ల పాత జ్ఞాపకాలు గుర్తు చేసిన ఈతరం యంగ్ లీడర్స్ ఈ ఐదుగురు గురించైతే తప్పకుండా తెలుసుకోవలసిందే.
దిశా రవి (21)
ప్రస్తుతం ఈమెపై ఢిల్లీలో విచారణ జరుగుతోంది. స్వీడన్ టీనేజ్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు భారత్‌లోని రైతు ఉద్యమ ‘వ్యూహ రచన’లో సహాయం చేసిందన్న ఆరోపణ పై బెంగుళూరు నుంచి దిశను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆమెపై ‘టూల్‌కిట్’ కేసు పెట్టారు. రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు కుట్రపూరితంగా ఒక ప్రణాళిక తయారైందని అనుమానిస్తూ ఆ ప్రణాళికకే పోలీసులు ‘టూల్‌కిట్’ అని పేరుపెట్టారు. దిశ ‘ఫ్రైడేస్ ఫర్ ఫార్యూన్ ఇండియా’ (ఎఫ్.ఎఫ్.ఎఫ్.) సంస్థ వ్యవస్థాపకురాలు. పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తుంటారు. 2018లో ఎఫ్.ఎఫ్.ఎఫ్. ప్రారంభం అయింది. భవిష్యత్ వాతావరణ సంక్షోభంపై దిశ కాలేజీ స్టూడెంట్స్‌ని చైతన్యవంతులను చేస్తుంటారు. పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు. గత ఆదివారం ఆమె బెంగళూరులోని తన ఇంట్లో ఉండగా ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరపరిచారు. టూల్‌కిట్‌తో ఆమెకు ఉన్నాయని అనుకుంటున్న సంబంధాలపై దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం దిశ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమెను విడుదల చేయాలని బెంగళూరు, ఇతర నగరాలలో విద్యార్థులు ప్రదర్శనలు జరుపుతున్నారు.
సఫూరా జర్గార్ (28)
సఫూరా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో ఎం.ఫిల్. విద్యార్థిని. 2019 పౌరసత్వం సవరణ చట్టం ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు గత ఏడాది ఏప్రిల్‌లో అరెస్ట్ అయ్యారు. అప్పటికి ఆమె గర్భిణి. 2020 ఢిల్లీ అల్లర్లకు కుట్ర పన్నారన్నది ఆమెపై ప్రధాన అభియోగం. ఆరో నెల గర్భిణిగా ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో గత జూన్‌లో ఆమెను జైలు నుంచి విడుదల చేశారు. సఫూరా కశ్మీర్ అమ్మాయి. మానవ హక్కులు, మత సామరస్యం, శాంతియుత సహజీవనం వంటి వాటి మీద ప్రసంగాలు ఇస్తుంటారు.
ప్రియాంకా పాల్ (19)
ప్రియాంకకు ‘ఆర్ట్‌వోరింగ్’ అనే వెబ్‌సైట్ ఉంది. ఆమె చిత్రకారిణి, కవయిత్రి, రచయిత్రి, కథావ్యాఖ్యాత. ఎల్.జి.బి.టి. సభ్యురాలిగా తనని తాను ప్రకటించుకున్నారు. కులం, లైంగిక వివక్ష, మానసిక ఆరోగ్యం, బాడీ పాజిటివిటీ (తమ దేహాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆత్మ విశ్వాసంతో అంగీకరించడం) వంటి సామాజిక అంశాలపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో స్పష్టమైన, పదునైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. గత నవంబర్‌లో ప్రియాంక, కంగనా రనౌత్ ట్విట్టర్ వేదికగా మాటా మాటా అనుకున్నారు. మొదట కంగనానే ప్రియాంకను బాడీ షేమింగ్ చేయడంతో ఘర్షణ మొదలైంది.
నవ్‌దీప్ కౌర్ (23)
నవదీప్ కౌర్ ‘మజ్దూర్ అధికార్ సంఘటన్’ (మాస్) కార్యకర్త. ఢిల్లీ సరిహద్దులోని సింఘులో ఆమె పని చేస్తున్న ఫ్యాక్టరీ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడటంపై ఆమె నోరు విప్పారు. ఫలితంగా ఫ్యాక్టరీ యాజమాన్యం ఆమెపై కేసులు పెట్టింది. జనవరి 12 నుంచి కౌర్ పంజాబ్‌లోని కర్నాల్ జైల్లో ఉన్నారు. ఈ దళిత యువతిపై జైల్లో లైంగిక అకృత్యాలు జరిగాయని, ఆమె లేవలేని పరిస్థితిలో ఉన్నారని సహ ఖైదీల నుంచి సమాచారం బయటికి పొక్కడంతో దేశవ్యాప్తంగా నవ్‌దీప్ కౌర్ విడుదల కోసం ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇప్పటికి మూడుసార్లు ఆమె బెయిల్ నిరాకరణకు గురైంది. ఢిల్లీలో పీహెచ్.డీ చేస్తున్న ఆమె చెల్లెలు రజ్వీర్ కౌర్ అక్కను విడిపించుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నారు. సోమవారం ఒక కేసులో మాత్రం ఆమెకు బెయిలు లభించింది. 50 వేల రూపాయలు కట్టి, అవసరమైన పత్రాలు అందజేస్తే ఆ కేసులో బెయిలు లభించినప్పటికీ, రెండో కేసులో కూడా బెయిల్ వచ్చేంతవరకు నవ్‌దీప్ విడుదల అయ్యే అవకాశం లేదు.
నిఖితా జాకబ్ (29)
టూల్‌కిట్ కేసులో ఏ క్షణాన్నయినా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్న మరో యువతి నిఖితా జాకబ్. ముంబైలో ఆమె లాయర్. దిశా రవితో కలిసి పుణెకు చెందిన శంతను, నిఖిత టూల్ కిట్ తయారు చేశారని.. వీళ్లంతా ఖలిస్తాన్ సాను భూతి సంస్థ ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ నిర్వహించిన జూమ్ సమావేశానికి హాజరయ్యారని పోలీసుల ప్రధాన ఆరోపణ. ముందస్తు బెయిలు కోసం నిఖిత బాంబే కోర్టును ఆశయ్రించారు.
Comments
Please login to add a commentAdd a comment