
సాక్షి,న్యూఢిల్లీ: రైతుల ఆందోళనకు మద్దతుగా స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ట్వీట్‌తో రాజుకున్న టూల్ కిట్ వివాదం మరింత ముదురుతోంది. 'టూల్‌కిట్ కేసు'లో దిశా రవిని అరెస్టు చేసిన ఢిలీ పోలీసులు మరో కీలక చర్య చేపట్టారు. ముంబై హైకోర్టు న్యాయవాది, కార్యకర్త నికితా జాకబ్, శాంతనులపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం స్పెషల్ సెల్ బృందం నికితా ఇంటికి వెళ్లినపుడు, ఆమె ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరిశీలించినట్లు తెలిపారు. కానీ ఆ రోజు సమయాభావం వల్ల నికితను ప్రశ్నించలేదు. మళ్లీ వస్తామని చెప్పామనీ, అప్పటినుంచి నికిత పరారీలో ఉందని ఆరోపిస్తూ వారెంట్ ఇష్యూ చేశారు. నికితా జాకబ్, దిశా రవి ఇతరులు పాల్గొన్న ఒక జూమ్ సమావేశంలో రైతు ఆందోళనకు సంబంధించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసేందుకు, నిరసన కారుల్లో ఆందోళనన పెంచేందుకు కుట్ర పన్నారని పోలీసులు ఆరోపించారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిశా రవి అరెస్ట్‌ను ఖండించారు. ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడి అని వ్యాఖ్యానించారు. రైతులకు మద్దతు ఇవ్వడం నేరం కాదని ఆయన ట్వీట్ చేశారు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే థన్‌బర్గ్‌పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు పర్యావరణ, సామాజిక కార్యకర్త దిశా రవిని ఆదివారం అరెస్ట్ చేశారు. దేశద్రోహ కుట్ర కేసు నమోదు చేసి ఐదు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. బెంగళూరు ఐటీ సిటీకి చెందిన దిశా రవి రైతు ఆందోళనకు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు సపోర్ట్ చేస్తూ గ్రెటా థన్‌బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్ కిట్‌ను దిశా రవి అప్‌లోడ్ చేశారు. దీని వెనుక ఖలిస్థాన్ అనుకూల సంస్థ ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే టూల్‌కిట్ డాక్యుమెంట్‌లోని రెండు లైన్లను మాత్రమే తాను ఎడిట్ చేశానని దిశా పోలీసు విచారణలో వెల్లడించారు.
డాక్యుమెంట్‌లోని అంశాలు అభ్యంతకరంగా ఉన్నందున దానిని తొలగించాలంటూ థన్‌బర్గ్‌ను కోరారని వివరణ ఇచ్చారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’అనే పర్యావరణ పరిరక్షణ సంస్థలో కీలక వ్యక్తిగా దిశ ఉన్నారు. దిశా రవి అరెస్టుపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా కేంద్రం తీసుకొచ్చి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సుదీర్ఘంగా సాగుతోంది. ఈ క్రమంలో రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసకు దారితీసింది. ఎర్రకోటపై జెండా ఎగురవేయడం వివాదాన్ని రేపింది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా గ్రెటా ట్వీట్ చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖలిస్థాన్ వేర్పాటువాదులు టూల్ కిట్‌ని రూపొందించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. (రైతు ఉద్యమం : దీప్ సిద్దూ అరెస్టు)
చదవండి : రైతు ఉద్యమం : వారికి భారీ ఊరట
Arrest of 21 yr old Disha Ravi is an unprecedented attack on Democracy. Supporting our farmers is not a crime.
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 15, 2021