సాక్షి, న్యూఢిల్లీ: టూల్‌కిట్ వివాదం ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వాల మధ్య అగ్గి రాజేసింది. ఒక అంశంపై విచారణ కొనసాగుతుండగా ట్విట్టర్ తీర్పులు చెప్పడం సరికాదంటూ కేంద్రం అభిప్రాయపడింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర చేసిన ట్వీట్‌ని మానిప్యులేటెడ్ మీడియాగా ట్విట్టర్ లేబుల్ వేయడాన్ని తప్పుపట్టింది మోదీ సర్కార్. మానిప్యులేటెడ్ మీడియా లేబుల్ తొలగించాలని ట్విట్టర్‌ని కోరింది.
టూల్‌కిట్ వివాదం
కరోనా సంక్షోభాన్ని అడ్డుపెట్టుకుని మోదీ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందంటూ ఆరోపించారు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర. మోదీ ఇమేజ్‌కి భంగం కలిగించేలా విదేశీ మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తూ కాంగ్రెస్ కుట్ర పన్నుతోందంటూ కొన్ని డాక్యుమెంట్స్‌తో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ టూల్‌కిట్ ఎక్స్‌పోస్డ్ అంటూ కామెంట్ చేశారు. బీజేపీ శ్రేణులు ఈ ట్వీట్‌ని విపరీతంగా వైరల్ చేశాయి.
కాంగ్రెస్ ఫైర్
సంబిత్ పాత్ర టూల్‌కిట్ పోస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండి పడింది. అంతటితో ఆగకుండా సంబిత్ పాత్రతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటు మరికొందరు బీజేపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోంది.
ట్విట్టర్ చర్యలు
సంబిత్ పాత్ర టూల్‌కిట్ పోస్ట్‌పై ట్విట్టర్‌కి కూడా ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్‌తో కాంగ్రెస్‌ని ఇబ్బంది పెట్టేందుకే సంబిత్ పాత్ర ఈ పోస్ట్ చేశారంటూ ట్విట్టర్‌కి వివరించింది. కాంగ్రెస్ ఫిర్యాదుపై ట్విట్టర్ స్పందించింది. సంబిత్ పాత్ర ట్వీట్‌కి మానిప్యులేటెడ్ మీడియా అంటూ లేబుల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ లేబుల్ పైనే కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment