శిథిల భవనంలో ఉపాధి శాఖ
* విద్యార్థులు, నిరుద్యోగులకు అవస్థలు
* కనీస వసతులు కరువు
* బిక్కుబిక్కుమంటూ ఉద్యోగుల విధి నిర్వహణ
జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాలయం శిథిల భవనంలో కునారిల్లుతోంది. ఆఫీసు ప్రాంగణంలోకి అడుగు సైతం పెట్టలేని విధంగా ఉంటుంది. ఎంప్లాయిమెంట్ చేసుకునేందుకు నిత్యం వచ్చే వేలాది మంది అభ్యర్థులు వసతుల లేమితో అవస్థలు ఎదుర్కొంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ఎంప్లాయిమెంట్ ఆఫీసు గురించి ఆలోచించిన దాఖలాల్లేవు. ఎంతో మందికి ఉపయోగకరంగా ఉండే ప్రభుత్వ శాఖకు శాశ్వత భవనం ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు.
గుంటూరు (లక్ష్మీపురం): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఎంప్లాయిమెంట్ కోసం వచ్చే వారికి కనీస వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరం నడిబొడ్డున కలెక్టర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయ భవనం శిథిలమై ఉంది. భవనం లోపలి భాగం గోడలు నెర్రలుగా పగిలి పెచ్చులూడిపోతున్నాయి. నలు వైపులా మర్రి చెట్టు వేళ్ళు పెరిగి పోయి గోడల్లోనుంచి వస్తున్నాయి. వర్షం కురిసిందంటే చాలు భవనంలో సగ భాగం అంతా నీటి చెమ్మ వస్తుంది. కీలకమైన రికార్డులు సైతం తడిచి పోయే పరిస్థితి నెలకొంది. ఉద్యోగులు సైతం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
కార్యాలయంలో వసతులు నిల్.....
జిల్లా నలుమూలల నుంచి వచ్చే విద్యార్థులు, నిరుద్యోగులు కార్యాలయంలో కనీస వసతులు లేకపోవడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. కూర్చునేందుకు కుర్చీలు గానీ, బల్లలు, గానీ లేక పోవడంతో కార్యాలయ వరండాలో నేలపైనే కూర్చొని దరఖాస్తులు పూర్తి చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుక్క మంచినీరు సైతం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం ఎంతో మంది వచ్చే కార్యాలయంలో ఈ విధమైన పరిస్థితి ఉండటం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఉపాధి శాఖకు శాశ్వత భవనం కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం..
జిల్లా ఉపాధి కార్యాలయానికి వచ్చే విద్యార్థులు, నిరుద్యోగులు, సిబ్బందికి వసతులు లేవు. భవనం పాతది కావడంతో నెర్రలు వచ్చి వర్షపు నీటితో చెమ్మ వస్తుంది. ఈ విషయం∙జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. కార్యాలయం మార్చాలని విన్నవించాం.
డాక్టర్ రజనీ ప్రియా, జిల్లా ఉపాధి అధికారి