యథేచ్ఛగా అక్రమ రవాణా
తిరువూరు, న్యూస్‌లైన్ : జిల్లా సరిహద్దు ప్రాంతమైన తిరువూరు మీదుగా ఎలాంటి అనుమతులు లేకుండా నిత్యం వేరుశనగ విత్తనాల లారీలు మహారాష్ట్రకు తరలిపోతున్నా రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయశాఖ పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 5న అగిరిపల్లి నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు రూ.18లక్షల విలువైన వేరుశనగ విత్తనాల సంచులు లారీలో తరలిస్తుండగా తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తమకు రూ.18వేల మార్కెట్‌సెస్ చెల్లిస్తే లారీని వదిలేస్తామని ఏఎంసీ అధికారులు చెప్పగా, ఈ చెల్లింపులో జాప్యం జరగడంతో వ్యవసాయశాఖ ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు 6ఏ కేసు నమోదు చేశారు. నిజామాబాద్‌లోని సూపర్‌సీడ్స్ పేరుతో వారం తిరగకుండానే గురువారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో మళ్లీ ఆగిరిపల్లి నుంచి నాందేడ్‌కు మరో రూ.18.70 లక్షల విలువైన వేరుశనగ విత్తనాలు రవాణా చేస్తుండగా తిరువూరు రాజుపేటలోని ఏఎంసీ చెక్‌పోస్టు వద్ద నిలిపివేశారు.
ఈ విత్తనాల తరలింపునకు ప్రభుత్వపరంగా ఎలాంటి అనుమతులు లేకపోయినా ఏఎంసీ అధికారులు రూ.18వేల మార్కెట్ సెస్ మాత్రమే వసూలు చేసి లక్షలాది రూపాయల విలువైన అక్రమ విత్తనాల రవాణాకు అనుమతించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాము మార్కెట్ సెస్ వసూలు చేసి వేరుశనగ లోడు లారీని వదిలేశామని, అది అక్రమ తరలింపా, సక్రమమా అనే విషయం తమకు సంబంధం లేదని తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇన్చార్జి కార్యదర్శి రంగారావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యం...
తిరువూరు మీదుగా వేరుశనగ విత్తనాలు తరచూ అక్రమంగా మహారాష్ట్రకు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వాధికారులు పట్టించుకోవట్లేదు. గతంలో రెవెన్యూ, వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టులు తిరువూరులోని జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసి అక్రమరవాణాను అరికట్టారు. అయితే పదేళ్ల క్రితం ఈ చెక్‌పోస్టులను తొలగించారు. పౌరసరఫరాలు, రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు విజయవాడ-జగదల్పూర్ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించకపోవడంతో అక్రమరవాణా యథేచ్ఛగా సాగుతోంది.