ప్రగతిలో విశాఖ ప్రథమం
విశాఖ రూరల్ : అభివృద్ధిలో విశాఖ ఇతర జిల్లాల కంటే ముందంజలో ఉంది. పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో విశాఖ జిల్లా వాటా 18 శాతం కావడమే దీనికి నిదర్శనం. జిల్లా స్థూల ఉత్పత్తి రెట్టింపునకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఆదాయ వనరుల పెంపుతో జిల్లా ప్రగతికి కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో ‘జిల్లా విజన్ డాక్యుమెంట్’ రూపకల్పన మొదలైంది. నెల రోజుల్లో దీన్ని పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
విశాఖదే అగ్రభాగం: 2012-2013 వార్షిక నివేదిక ప్రకారం విశాఖ జిల్లా స్థూల ఉత్పత్తి రూ.56,668 కోట్లు. ఇందులో అధికంగా సర్వీసు రంగం రూ.31,372 కోట్లతో డీడీపీలో 55.36 శాతం వాటాతో అగ్రభాగంగా ఉంది. ఆ తర్వాత పారిశ్రామిక రంగం రూ.19,811 కోట్లతో 34.96 శాతం వాటాతో రెండో స్థానంలో ఉండగా, వ్యవసాయ రంగం వాటా రూ.5485 కోట్లతో 9.6 శాతంగా ఉంది. వ్యవసాయ రంగంలో కూడా అధిక శాతం ఉద్యాన పంటల ద్వారా ఎక్కువగా వస్తోంది. రూ.1152 కోట్లు హార్టీకల్చర్ ద్వారా పురోగతి కనిపిస్తోంది. పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో డీడీపీలో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో ఉండటం విశేషం. ఇందులో ప్రధానంగా సర్వీసు, పారిశ్రామిక రంగాలు కీలకంగా ఉన్నాయి.
రూ.లక్ష కోట్లు లక్ష్యం
జిల్లా స్థూల ఉత్పత్తిని రూ.56,668 కోట్ల నుంచి 2019 నాటికి రూ.లక్ష కోట్లకు పెంచేందుకు అధికారులు జిల్లా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నారు. ఇది రాష్ట్ర బడ్జెట్‌కు సమానం. ముందుగా నియోజకవర్గంలో ఒక మండలం, మండలంలో గ్రామాన్ని తీసుకొని ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమయ్యారు. పదిహేను నియోజకవర్గాల్లో 15 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద డాక్యుమెంట్‌ను తయారు చేస్తున్నారు.
ఆయా మండలాల్లో కీలక రంగాన్ని ఆధారంగా చేసుకొని స్థూల ఉత్పత్తి రెట్టింపునకు అనుసరించాల్సిన విధానాలతో దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం ఆంధ్ర, గీతం విశ్వవిద్యాలయాల నుంచి ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిపుణుల బృందాన్ని జిల్లాకు పంపించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు.