Divas
-
గిరిజనులు లేకుండానే వేడుకలా?
అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆవేదన ∙ తూతూ మంత్రంగా ఆదివాసీ దినోత్సవ ఏర్పాట్లు రంపచోడవరం : గిరిజన తెగలను ఆహ్వానించకుండానే అధికారులు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపడంపై రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ దినోత్సవ వేడుకలకు రావాల్సిన గిరిజనులు గ్రామాల్లో ఉండిపోయారని, పాఠశాల విద్యార్థులు మాత్రం వేదిక ఎదుట ఉన్నారన్నారు. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో గిరిజనులకు స్థానం లేకుండా పోయిందని ఆమె పేర్కొన్నారు. ఐటీడీఏ కార్యాలయం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే రాజేశ్వరి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ టి.రత్నాబాయి, మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెకంటేశ్వరరావు, చిన్నం బాబు రమేష్, కె.కాశీవిశ్వనాథ్ పాల్గొన్నారు. కలెక్టర్ వెళ్లిపోవడం బాధాకరం.. జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఏజెన్సీలో వివిధ గిరిజన తెగలకు చెందిన వారితో ఆదివాసీ ఉత్సవాలను జ్వోతి ప్రజ్వలన చేయించి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఏజెన్సీలో జరుగుతున్న ప్రగతిని వివరించారు. ఆదివాసీ దినోత్సవ ఉద్దేశాన్ని తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వేదికపై గిరిజనులతో మాట్లాడించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కలెక్టర్ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో కొద్దిసేపు ఉండి వెళ్లిపోవడం బాధకరమన్నారు. ఇలా అయితే గిరిజనులు వెల్లడించిన సమస్యలు పట్టించుకునేది ఎవరని ఆమె ప్రశ్నించారు. చట్టాలు అమలు కావడం లేదు.. చట్టాలు అమలు కావడం లేదని నిజమైన గిరిజనులు కులధ్రువీకరణ పత్రాలు పొందాలంటే అనేక ఇబ్బందులు గురవుతున్నారన్నారు. నకిలీ కులధ్రువీకరణ పత్రాలతో గిరిజన హక్కులను, రాయితీలు, ఉద్యోగాలను నకిలీ గిరిజనులు అనుభవిస్తున్నారన్నారు. ఇలాంటి వాటిని ఆరికట్టలన్నారు. ఏజెన్సీ కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఐటీడీఏ నుంచి తీర్మానం చేయాలని కోరారు. గంగవరం మండలంలో బీసీ కులస్తుడు, అతడి కుమారులకు ఎస్టీ కులధ్రువీకరణ పత్రం పొందడం ఏజెన్సీలో రెవెన్యూ వ్యవస్థలో అవినీతికి పరాకాష్ట అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పత్తిగుళ్ల భారతి, ఐటీడీఏ పీఓ రవి పట్టాన్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు. స్టాళ్లలో కనిపించని ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఎక్కడా గిరిజన సంస్కృతీసంప్రదాయాలను ప్రతిబింబించే ఏర్పాట్లు చేయలేదు. కేవలం హార్టికల్చర్, జీసీసీ, ఉచిత వైద్యం శిబిరం, వంటి వాటితో మమ అనిపించారు. ఎమ్మెల్యేను సన్మానించిన సంస్కృతి సంఘం స్దానిక గిరిజన సంక్షేమ సంస్కృతిక సం«ఘం ఆ««దl్వర్యంలో జరిగిన ఆదివాసీ దినోత్సవంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పాల్గొన్నారు. గిరిజన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. ఏజెన్సీలోని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాజేశ్వరి, ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డిలను సంఘం నాయకులు కడబాల రాంబాబు, కంగల శ్రీనువాస్,కుసం ఫకీరుదొర తదితరులు ఘనంగా సన్మానించారు. కోనసీమ అందాలపై శతకం అంకితం అంతర్వేది(సఖినేటిపల్లి) : అంతర్వేది పుణ్యక్షేత్రంలో మంగళవారం సాగరసంగమం వద్ద ప్రముఖ తెలుగు వేదకవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు స్వీయ రచన చేసిన కోనసీమ శతకాన్ని వాయుదేవునికి అంకితం చేశారు. గాలిపటంపై కోనసీమ గొప్పతనాన్ని వర్ణిస్తూ పటానికి ఒక వైపు 60, రెండోవైపు 48 పద్యాలు రాసి వశిష్టగోదావరి, సముద్రం సంగమం ప్రదేశంలో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వశాంతిని కలిగించు వేదఘోషను ప్రతిధ్వనించే సాగరసంగమం, పుణ్యతీర్థాల క్షేత్రాల ముక్తి సీమ–కోనసీమ, వేదాన్ని– వ్యవసాయాన్ని ప్రతిబింబించే కోనసీమ, గలగల పారే గోదావరి, పక్షుల కిలకిలరావాలతో పులకరించే కోనసీమ, సంప్రదాయం–సంపద కలిగియుండే కోనసీమ, సుఖశాంతులతో ధాన్యాగారంగా తులతూగే కోనసీమ లోగిళ్లు, రేయింబవళ్లు కష్టించి పనిచేసే రైతుల మధుర సీమ కోనసీమ, కదలి గౌతమీపై గాలి, కడలి గాలి, చెరువులోని కలువతామరుల కమ్మనిగాలి, పైరుగాలి–తోట గాలిల సమ్మేళనం మానససరోవరం కోనసీమ అంటూ తదితర వాటిపై ఆయన 108 పద్యాలను రాశారు. తొలుత శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆయన స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామలింగేశ్వరరావు కుటుంబ సభ్యులకు అర్చకులు ఆశీర్వచనాలు చెప్పి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా నిత్యాన్నదాన పథకంలో ఆయన భోజనం చేశారు. వెంట శతావధానులు పాలపర్తి శ్యామలానంద్ప్రసాద్, గురు సహస్రావధాని కడిమెళ్ల వరప్రసాద్, సాహతీవేత్త ధవేజీ పాల్గొన్నారు. బుర్రిలంకలో సినీ సందడి నర్సరీల్లో ‘మిక్చర్ పొట్లం’ చిత్ర సన్నివేషాలు చిత్రీకరణ కడియం : మండలంలోని బుర్రిలంకలోని పలు నర్సరీల్లో మంగళవారం సినిమా షూటింగ్ సందడి చేసింది. శ్వేతాబసుప్రసాద్ ప్రధాన పాత్రలో గోదావరి సినీటోన్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘మిక్చర్ పొట్లం’ సినిమా షూటింగ్ జరిగింది. బుర్రిలంకలోని శ్రీ వెంకటరమణ నర్సరీ గార్డెన్లో ఒక పాటలోని పలుసన్నివేశాలను చిత్రీకరించారు. ఎంఎల్ సతీష్‌కుమార్ దర్శకత్వంలో భానుచందర్ కుమారుడు జయంత్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారని చిత్రబృందం తెలిపింది. అలాగే సుమన్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారన్నారు. చిత్ర బృందంలో కృష్ణభగవాన్, చిట్టిబాబు, జూనియర్ రేలంగి తదితర నటులు నర్సరీ వద్దకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. స్థానిక యువకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వారితో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఆద్యంతం హాస్యభరితం ‘మిక్చర్‌పొట్లం’ కంబాలచెరువు : గోదావరి సినీటోన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘మిక్చర్ పొట్లం’ ఆద్యంతం హాస్యభరితంగా సాగుతుందని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన డాక్టర్ కంటే వీరన్న చౌదరి అన్నారు. ఆ సినిమా విశేషాలపై రాజమహేంద్రవరం రివర్‌బేలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రముఖ హీరో భానుచందర్ కుమారుడు జయంత్ హీరోగా, గీతాంజలి హీరోయిన్గా నటిస్తున్నారన్నారు. మాధవపెద్ది సురేష్ సంగీతానందిస్తుండగా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం సతీష్‌కుమార్ వహిస్తున్నారన్నారు. -
వెలుగు రేఖ భారత్
ప్రవాసీ భారతీయ దివస్‌లో ప్రధాని మోదీ ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపు చూస్తున్నాయి దేశాభివృద్ధిలో భాగస్వాములు కండి ప్రవాస భారతీయులకు పిలుపు గాంధీనగర్: ‘దేశంలో నెలకొని ఉన్న దారుణమైన ప్రతికూల పరిస్థితుల్లో మన పూర్వీకులు మెరుగైన భవిష్యత్తును వెతుక్కుంటూ.. అత్యంత ధైర్య సాహసాలతో దేశాన్ని విడిచి కొత్త తీరాలకు తరలి వెళ్లారు. ఇప్పుడా పరిస్థితి లేదు. భారత్ అభివృద్ధి చెందింది. అద్భుతమైన కొత్త, కొత్త అవకాశాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. మరింత ప్రగతిశీల భారత్‌ను రూపొందించేందుకు మీ సహకారం కావాలి’.. అంటూ దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాల్సిందిగా ప్రవాస భారతీయులను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. గాంధీనగర్‌లో 13వ ప్రవాస భారతీయ దివస్(పీబీడీ)’ను మోదీ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మహాత్మా మందిర్ వేదికపై నుంచి దాదాపు 4 వేల మంది ఆహూతులనుద్దేశించి ప్రసంగించారు. దక్షిణాఫ్రికా నుంచి మహాత్మాగాంధీ భారత్‌కు తిరిగివచ్చి వందేళ్లు పూర్తయిన సందర్భంగా గాంధీజీ భావనలకు అనుగుణంగా పీబీడీ కార్యక్రమాలను రూపొందించారు. మోదీ కూడా తన ప్రసంగంలో గాంధీ దార్శనికతను, సమకాలీనతను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలను గాంధీజీ నమ్మి, ఆచరించిన మానవతావాద విశ్వాసాలు పరిష్కరించగలవన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా, 2003 నుంచి దక్షిణాఫ్రికా నుంచి వందేళ్ల క్రితం గాంధీజీ భారత్ తిరిగొచ్చిన తేదీన ప్రవాస భారతీయ దివస్’ను నిర్వహించడం ప్రారంభించారు. మోదీ ప్రసంగం ముఖ్యాంశాలు.. అంతర్జాతీయంగా చూస్తే ప్రవాస భారతీయులే మన దేశానికి విలువైన పెట్టుబడి. వారి అభివృద్ధికి ఎంత సహకరిస్తే.. అంతర్జాతీయంగా మన విలువ, ప్రాముఖ్యత అంత పెరుగుతుంది. నేను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక 50 దేశాల అధినేతలతో భేటీ అయ్యాను. మేం మనసువిప్పి మాట్లాడుకున్నాం. ప్రపంచంలోని అతిపేద దేశాలు, అత్యంత ధనిక దేశాలు కూడా భారత్ వైపు సానుకూల దృష్టితో చూస్తున్నాయి. అలాంటి పరిస్థితులు చాలా అరుదుగా వస్తాయి. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలన్న తన ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితి ఆమోదించిన తీరు భారత్‌పై వారికున్న ప్రేమను ప్రతిఫలించింది. ఐరాసలోని 193 దేశాల్లో 177 దేశాలు ఆ తీర్మానానికి మద్దతిచ్చాయి. వాటిలో 40 ముస్లిం దేశాలు. సాధారణంగా అలాంటి తీర్మానాలు ఆమోదం పొందేందుకు కనీసం రెండేళ్లు పడుతుంది. కానీ ఈ తీర్మానం కేవలం 100 రోజుల్లో ఆమోదం పొందింది. ప్రపంచ దేశాలు మనపై చూపే ప్రేమకు కారణం.. వారి దేశాల్లోని భారతీయుల సంపద కారణం కాదు. అక్కడి ప్రవాస భారతీయులు పాటిస్తున్న విలువలు, వారు నిలుపుకుంటున్న భారత సాంస్కృతిక వారసత్వం.. ఇవే ఆ ప్రేమకు కారణం. ప్రపంచ దేశాలు మనపై పెట్టుకున్న అంచనాలను నిలుపుకునే బాధ్యత ఇప్పుడు మనపై ఉంది. గంగానది ప్రక్షాళన మతపరంగా, పర్యావరణ పరంగా అత్యంత ముఖ్యమైన లక్ష్యం. అంతేకాదు, దాదాపు 40% జనాభా ఆర్థికాభివృద్ధికి అది కీలకం. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని చాలా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. పర్యావరణమూ మెరుగవుతుంది. ఈ గంగ ప్రక్షాళన కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలన్నది నా ఆకాంక్ష. నేను ప్రవాస భారతీయులను ఎక్కువగా కలుస్తున్నానని కొందరనుకుంటున్నారు. కానీ మనవాళ్లను కలిస్తే మన శక్తి మరింత పెరుగుతుంది. డాలర్లు, పౌండ్లు ఇస్తేనే దేశాభివృద్ధిలో పాలుపంచుకోవడమని కాదు. ఆఫ్రికా దేశంలో పుట్టి, కెనడాలో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన ఒక ముస్లిం బాలిక 2001లో గుజరాత్లో తీవ్ర భూకంపం వచ్చినప్పుడు నెలల తరబడి ఇక్కడే ఉండి సహాయ చర్యల్లో పాలుపంచుకున్న విషయం నాకు గుర్తొస్తోంది. ఇప్పుడు గయానాలో భారతదేశ పండుగలైన హోళీ, దీపావళి జరుపుకుంటున్నారు. మారిషస్‌లో గంగాసాగర్ సరస్సును గంగానది జలంతో నింపారు. ఇవన్నీ ప్రాంతాలకతీతంగా భారతీయులందరినీ ఒక్కటి చేస్తాయి. న్యూయార్క్‌లోని మేడిసన్ స్క్వేర్‌లో నేనిచ్చిన హామీని నెరవేర్చుకున్నాను. భారతీయ సంతతి ప్రజలు(పీఐఓ), విదేశాల్లోని భారతీయ పౌరులు(ఓసీఐ).. ఈ రెండు వర్గాలను విలీనం చేస్తూ ఈ మంగళవారమే ఆర్డినెన్స్‌ను జారీ చేశాం. దీనివల్ల వారికి జీవితకాల వీసా, భారత్‌లో ఉన్నప్పుడు ప్రతీవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం.. లాంటి సౌకర్యాలు లభిస్తాయి. త్వరలో ఢిల్లీలోని ప్రవాసీ భారతీయ కేంద్రం కూడా పనులు ప్రారంభించనుంది. పరస్పర ప్రయోజనకర భాగస్వామ్యం: సుష్మాస్వరాజ్ దేశాభివృద్ధిలో భాగంగా.. పరస్పర ప్రయోజనకర సంబంధాలను ఏర్పర్చుకోవాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. పీబీడీలో గురువారం ఆమె మాట్లాడుతూ.. దృఢమైన, స్వయంసమృద్ధ భారతదేశం మీకెంత స్ఫూర్తిదాయకమో.. విజయవంతమైన, సుసంపన్నమైన, రాజకీయంగా ప్రభావశీలురైన మీరు భారతదేశానికి అంతే స్ఫూర్తిదాయకం’ అన్నారు. ‘భారతదేశ సుసంపన్న గతచరిత్ర పునరావృతమయ్యేలా.. భారతదేశం అభివృద్ధి చెందాలి. ఆ యజ్ఞంలో మీరంతా పాలుపంచుకోవాలి’ అని ఆమె అభ్యర్థించారు. శతాబ్దాలుగా మతమార్పిళ్లు: వెంకయ్య విదేశీ నిధులతో గత రెండొందల ఏళ్లుగా భారత్‌లో మతమార్పిళ్లు, పునఃమత మార్పిళ్లు జరుగుతున్నాయని, అది బహిరంగ రహస్యమేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. హిందూత్వ సంస్థలు చేపట్టిన ఘర్‌వాపసీ కార్యక్రమంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న సమయంలో ప్రవాస భారతీయ దివస్ వేదికపై పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మతమార్పిళ్లతో ప్రభుత్వానికి సంబంధం లేదని, అభివృద్ధి మాత్రమే తమ ప్రభుత్వ ఎజెండా అని స్పష్టం చేశారు. ‘భారత్‌లో అవకాశాలు’ అంశంపై మాట్లాడుతూ ఆధునిక పట్టణ భారత్‌ను రూపొందించేందుకు సహకరించాలని వెంకయ్య ప్రవాస భారతీయులను కోరారు. తెలంగాణలోని వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి సహా ఘన సాంస్కృతిక వారసత్వం ఉన్న 12 పట్టణాలను సాంస్కృతిక, పర్యాటక కేంద్రాలుగా తీర్చి దిద్దేందుకు ‘హృదయ్’(హెరిటేజ్ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్యోజన) పథకాన్ని రూపొందిం చామన్నారు. సత్య నాదెళ్లకు ప్రవాసీ అవార్డు మైక్రోసాఫ్ట్ కంపెనీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి, తెలుగు తేజం సత్య నాదెళ్ల ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’ అవార్డు అందుకోనున్నారు. ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా శుక్రవారం ఆయనతోపాటు మరో 14 మందికి ఈ అవార్డును ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. వివిధ రంగాల్లో సేవలందించిన ఎన్నారైలకు ఈ అవార్డును అందిస్తున్నారు. గాంధీనగర్‌లోని మహాత్మ మందిర్‌లో ఉపరాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. దండి కుటీర్ 13వ ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ జీవిత విశేషాలతో రూపొందించిన మ్యూజియం ‘దండి కుటీర్’ను మోదీ ప్రారంభించారు. మహాత్ముడిపై రూపొందించిన 3-డీ షార్ట్ ఫిల్మ్‌ను కూడా మోదీ వీక్షించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి యువత ప్రేరణ పొందేలా గాంధీ జీవితాన్ని మలచాలనే కల సాకారం కావడం హృద్యంగా ఉందన్నారు. ఉప్పుపై బ్రిటిష్ పాలకులు పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీ చేపట్టిన దండి మార్చ్‌కు గుర్తుగా 41 మీటర్ల ఎత్తయిన ఉప్పు గుట్టను మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా గాంధీ బాల్యం, స్వాతంత్య్ర సమరంలో ఆయన పోషించిన పాత్ర, భారత్‌కు తిరిగి రావడం వంటి ఘటనలను శిల్పాలుగా రూపొందించారు. స్టాంపులు, నాణేలు! ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో మహాత్మాగాంధీ ముఖచిత్రం ఉన్న నాణేలు, స్టాంపులను ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ భారత్‌కు తిరిగివచ్చి వందేళ్లు పూర్తయినందుకు గుర్తుగా వీటిని రూపొందించారు. యువకుడిగా ఉన్నప్పటి మోహన్‌దాస్ కరంచంద్ గాంధీని.. మహాత్ముడిగా మరిన తరువాత గాంధీని ఒకే ఫ్రేములో చూపిస్తూ వాటిని రూపొందించారు. రూ. 100, రూ. 10 నాణేలను, రూ. 25, రూ. 5 విలువైన స్టాంపులను తయారు చేశారు.