గృహనిర్మాణ శాఖకు కొత్త రూపు
=అసెంబ్లీ నియోజకవర్గానికో డీఈ
=జిల్లాలో 15 మంది నియామకం
=కొత్తగా సమాచార కేంద్రాలు
=జిల్లా గృహనిర్మాణ శాఖలో సంస్కరణలు
సాక్షి, మచిలీపట్నం : పేదోళ్లకు గూడు కట్టే గృహనిర్మాణ శాఖకు కొత్త రూపు వచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికీ ఒక డిప్యూటీ ఇంజనీర్(డీఈ) పద్ధతి అమలులోకొచ్చింది. దీనికితోడు లబ్ధిదారుల కోసం ప్రతి డీఈ కార్యాలయంలోనూ కొత్తగా సమాచార కేంద్రం ఏర్పాటైంది. ఈ మేరకు 15 రోజుల క్రితమే సర్కారు సూచనలు జిల్లాకు చేరినా సమైక్య ఉద్యమంతో ఉద్యోగులు సమ్మెబాట పట్టడం వల్ల అమలు ఆలస్యమైంది. ఎట్టకేలకు గృహనిర్మాణ శాఖలో శనివారం నుంచి సంస్కరణలు అమలులోకి వచ్చినట్లయింది.
గతేడాదే నిర్ణయం...
దీనిపై గృహనిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గతేడాది మే నెలలో నిర్వహించిన సమీక్షలో అసెంబ్లీ నియోజకవర్గానికో డీఈని నియమించి లబ్ధిదారులకు బిల్లులు ఆలస్యం కాకుండా సత్వర సేవలు అందేలా చూడాలని నిర్ణయించారు. మంత్రి తీసుకున్న నిర్ణయం ఎట్టకేలకు ఏడాది తరువాత అమల్లోకి వచ్చింది. గతంలో జిల్లాకు ఒక ఎస్ఈ, ఇద్దరు డీఈలు, దిగువస్థాయిలో వర్క్ ఇన్స్పెక్టర్లు ఉండేవారు.
1983 తరువాత గృహనిర్మాణ శాఖకు ప్రాధాన్యత పెరగడంతో జిల్లా స్థాయిలో మేనేజర్‌తో పాటు ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒక డీఈని నియమించారు. ఆ తర్వాత పాత సమితి స్థాయిలో ఓ డీఈని నియమించారు. 2009 ఎన్నికలకు ముందు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో ఒక మండలంలోని లబ్ధిదారుడు మరోచోట ఉన్న డీఈ వద్దకు బిల్లు చేసుకోవడానికి వెళ్లడానికి వ్యయప్రయాసలకు గురయ్యేవారు. తాజా సంస్కరణలతో ఆ ఇబ్బందులు తొలగే అవకాశముంది.
15 మందికి బాధ్యతలు...
ఒక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాలను ఒకే డీఈ పరిధిలోకి తెచ్చేలా జిల్లా గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ ప్రతాప్రావు కసరత్తు పూర్తిచేశారు. ఈ మేరకు 15 మంది డీఈలకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు. ఐదు మండలాలు దాటిన అసెంబ్లీ నియోజకవర్గానికి లబ్ధిదారుల సౌకర్యం కోసం ఇద్దరు డీఈలను ఏర్పాటు చేశారు.
ఇలా అవనిగడ్డ నియోజకవర్గానికి ఇద్దరిని నియమించారు. చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మూడు మండలాలకు ఒకరు, కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ మూడు మండలాలకు మరొకరు నియమితులయ్యారు. మచిలీపట్నం, పెడన, కైకలూరు, గుడివాడ, గన్నవరం, నూజివీడు, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాలకు ఒక్కో డీఈని నియమించారు. విజయవాడ అర్బన్లోనూ ఒక డీఈకే బాధ్యతలు అప్పగించారు. వర్క్ ఇన్స్పెక్టర్లు మాత్రం ప్రతి మండలానికీ పాత పద్ధతిలోనే కొనసాగుతారు.
డీఈ కార్యాలయాల్లో సమాచార కేంద్రం...
జిల్లాలోని ప్రతి డీఈ కార్యాలయంలోను ఒక సమాచారం కేంద్రం ఏర్పాటుచేశారు. కార్యాలయంలో ఒక కంప్యూటర్, వెబ్ కెమెరాతో ఒక ఆపరేటర్‌ను నియమించినట్టు జిల్లా గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు అధికారి ప్రతాప్రావు చెప్పారు. దీని ద్వారా కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరినీ వెబ్కామ్తో ఫొటో తీసి వారు ఎందుకు వచ్చింది, సమస్య ఏమిటి తదితర వివరాలను నమోదు చేస్తారు.
గృహ నిర్మాణ శాఖకే గూడు కొరత...
జిల్లాలోని 49 మండలాల్లో హౌసింగ్ కార్యాలయ భవనాల నిర్మాణానికి నిధుల కొరత అవరోధంగా మారింది. నాలుగు నెలలుగా నిర్మిస్తున్న ఈ భవనాల నిర్మాణాలకు ముడి సరకుల ప్రామాణిక ధరలతో సంబంధం లేకుండా అంచనాలు వేశారన్న విమర్శలు వినబడుతున్నాయి. కేవలం ఒక్కో భవనానికి రూ.2 లక్షలు ప్రభుత్వం కేటాయించటంతో పనులు ముందుకు సాగటం లేదు.
ఈ కార్యాలయంలో రెండు గదులు, ఒక హాలు, వరండా ఉంటాయి. 400 చదరపు అడుగుల వైశాల్యంలో ఈ భవనాలను నిర్మిస్తున్నారు. కొన్నిమండలాల్లో ఈ భవనాల నిర్మాణానికి పల్లపు ప్రాంతాల్లోని స్థలాలను కేటాయించారు. దీంతో ఆ స్థలాన్ని మెరక పనులకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో పునాదిలోనే వేలకు వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇచ్చిన నిధులు సరిపడక ఈ భవన నిర్మాణాలు నత్తనడకగా సాగుతుండటం కొసమెరుపు.