DKW college
-
డీకేడబ్ల్యూకు మహర్దశ
నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాల.. దీనికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ చదివి ఉన్నత స్థాయిలో ఉన్న వారు ఎందరో ఉన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు ఈ కళాశాలలో విద్యనభ్యసిస్తూ వసతి గృహంలో ఉంటున్నారు. నాడు – నేడు కింద డీకేడబ్ల్యూ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు(టౌన్): నెల్లూరులోని దొడ్ల కౌసల్యమ్మ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ (డీకేడబ్ల్యూ) కొత్త కళ సంతరించుకోనుంది. ఈ కాలేజీ 25 ఎకరాల్లో 1,400 మందికి పైగా ఇంటర్మీడియట్, 1,200 మందికి పైగా డిగ్రీ విద్యార్థినులతో కళకళలాడుతూ ఉంటుంది. వారికి ఇక్కడే వసతి సౌకర్యాన్ని కూడా కల్పించారు. నాడు – నేడు కింద డిగ్రీ కళాశాలను ఎంపిక చేశారు. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రూ.6.23 కోట్లతో ప్రతిపాదనలను కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనరేట్‌కు పంపించారు. దీంతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) కింద రూ.1.87 కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఏ పనులంటే.. కళాశాలలో నాడు – నేడు కింద వివిధ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపారు. ఇందులో భాగంగా మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్‌కు రూ.55 లక్షలు, మేజర్, మైనర్ మరమ్మతులకు రూ.1.53 కోట్లు, కాంపౌండ్ వాల్‌కు రూ.29 లక్షలు, ఫర్నీచర్‌కు రూ.44 లక్షలు, ఫ్యాన్లు, లైట్లు, ఎలక్ట్రికల్ వర్క్స్‌కు రూ.92 లక్షలు, ఆర్వో ప్లాంట్, తాగునీటికి రూ.17 లక్షలు, పెయింటింగ్‌కు రూ.80 లక్షలు, గ్రీన్ చాక్‌బోర్డుకు రూ.1.50 లక్షలు, ఇంగ్లిష్ ల్యాబ్, కంప్యూటర్లకు రూ.11 లక్షల వ్యయం కానుందని ఇంజినీరింగ్ విభాగం అధికారులు అంచనా వేశారు. ఎన్ఐఆర్ఎఫ్ నిధులతో.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) నిధులతో కాలేజీలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే నిధులు కూడా విడుదలయ్యాయి. కళాశాలలోని 65 అంకణాల్లో కొత్త భవనం, ఉమెన్స్ వెయిటింగ్ హాల్, ఇన్‌సైడ్‌లో ఓపెన్ జిమ్ తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. త్వరలో వీటి నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. త్వరలో పనులు ప్రారంభం నాడు – నేడు పనులకు సంబంధించిన ప్రతిపాదనలను కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనరేట్‌కు పంపించాం. ఎన్ఐఆర్ఎఫ్ నిధులతో కూడా కొత్త భవనం నిర్మించనున్నాం. విద్యార్థినులకు అన్ని వసతులను కల్పించనున్నాం. ప్రధానంగా ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి కళాశాలలోని అన్ని ప్రాంతాలకు తాగునీటిని అందిస్తాం. – గిరి, ప్రిన్సిపల్, డీకేడబ్ల్యూ కళాశాల ఇంకా ఏం చేస్తారంటే.. కళాశాలలో రూ.32 లక్షలతో డిజిటల్ ఎక్విప్మెంట్స్ను ఏర్పాటు చేయనున్నారు. సోషల్ రెస్పాన్స్‌బులిటీలో భాగంగా సెంబ్‌కార్ప్æ ద్వారా రూ.15 లక్షలతో పనులు చేపట్టనున్నారు. కళాశాలలో క్లీనింగ్‌తోపాటు మూడు వేల మొక్కలు నాటనున్నారు. ఇప్పటికే కొన్ని మొక్కలు నాటారు. వాటికి నీరందించేందుకు డ్రిప్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ మొక్కల మెయింటినెన్స్‌ను రెండేళ్లపాటు సెంబ్‌కార్ప్ నిర్వాహకులు చూసుకోనున్నారు. కొన్ని మొక్కల పెంపకం బాధ్యతను విద్యార్థినులకు అప్పగించారు. -
డీకేడబ్ల్యూ విద్యార్థినుల ప్రతిభ
నెల్లూరు (టౌన్): గూడూరులోని డీఆర్డబ్ల్యూ కళాశాలలో ఈ నెల 26,27 తేదీల్లో జరిగిన అంతర్ కళాశాల మహిళా క్రీడాపోటీల్లో నెల్లూరు డీకేడబ్ల్యూ మహిళా కళాశాల విద్యార్థినులు సత్తాచాటి పలు పతకాలు సాధించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ పీ శైలజ తెలిపారు. నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థినులను బుధవారం ఆమె అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థినులు కోకో, బాస్కెట్‌బాల్, వాలీబాల్ విభాగాల్లో విన్నర్‌గా, కబడ్డీ, బాల్బాడ్మింటిన్, షటిల్ బాడ్మింటిన్ విభాగాల్లో రన్నర్‌గా నిలిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ప్రిన్సిపల్ ఉదయ్‌భాస్కర్, ఫిజికల్ డైరెక్టర్ రవీంద్రమ్మ, గేమ్స్కమిటీ సభ్యులు ఉమమహేశ్వరి, అధ్యాపకులు పద్మప్రియ, అపర్ణదేవి పాల్గొన్నారు. -
‘డీకేడబ్ల్యూ’లో ఫ్రెషర్స్ డే
నెల్లూరు(టౌన్): డీకేడబ్ల్యూ కళాశాల వసతి గృహంలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలను నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. ప్రిన్సిపల్ శైలజ, డిప్యూటీ వార్డెన్ రవీంద్రమ్మ, వైస్ ప్రిన్సిపల్ ఉదయ్‌భాస్కర్, కమిటీ సభ్యులు ఆల్మాస్బేగం, పద్మప్రియ, పీఆర్ఓ జోజీ, మేనేజర్ రాఘవేంద్రరావు పాల్గొన్నారు. -
‘పుర’ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
నెల్లూరు(అర్బన్), న్యూస్‌లైన్: నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాల ప్రాంగణంలో సోమవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ మేరకు శనివారం నుంచే కళాశాల ప్రాంగణంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. నెల్లూరు నగర పాలక సంస్థకు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆరు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా కావలి, ఆత్మకూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు ఒక్కో కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లను శనివారం సాయంత్రం కమిషనర్ శ్యాంసన్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అన్ని మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపునకు 278 మంది సిబ్బందిని నియమించామన్నారు. నెల్లూరు కార్పొరేషన్‌కు 171 మంది , మిగిలిన వారిని ఆరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు వినియోగిస్తున్నట్టు ఆయన వివరించారు. నెల్లూరు, కావలి మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు డీకేడబ్ల్యూ కళాశాలలోని మొదటి అంతస్తులో నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. మిగిలిన మున్సిపాలిటీల లెక్కింపును కళాశాల గ్రౌండ్ ఫ్లోర్‌లోనే నిర్వహిస్తామన్నారు. ఉదయం ఎనిమిది గంటలకే లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. అదే విధంగా ఒక్కో పార్టీ నుంచి ఒక వార్డుకు ఒక ఏజెంటును మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా నగర డీఎస్పీ వెంకటనాథరెడ్డితో డీకేడబ్ల్యు కళాశాల ప్రాంగణంలో కమిషనర్ శ్యాంసన్ కౌంటింగ్ ప్రక్రియపై చర్చించారు. నెల్లూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇలా.. నెల్లూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో 54 వార్డులుండగా 4,41,860 మంది ఓటర్లున్నారు. ఇందులో 2,51,801 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ఆరు హాళ్లలో నిర్వహిస్తారు. 54 టేబుళ్లు వేశారు. అన్ని వార్డులకు ఒకేసారి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుం ది. ఒక్కో టేబుల్‌పై ఒక్కోవార్డు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. 5,7,22,44,49 వార్డుల ఓట్ల లెక్కింపు ఐదు రౌండ్లలోనే పూర్తవుతుంది. ఆ వార్డుల ఫలితం ఉదయం 11 గంటలకే వచ్చే అవకాశం ఉంది. 26వ వార్డులో అత్యధికంగా పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. వెంకటగిరి, ఆత్మకూరు మున్సిపాలిటీల ఫలితాలు ఉదయం 12 గంటలకే వెల్లడయ్యే అవకాశం ఉంది.