నెల్లూరు(అర్బన్), న్యూస్‌లైన్: నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాల ప్రాంగణంలో సోమవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ మేరకు శనివారం నుంచే కళాశాల ప్రాంగణంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. నెల్లూరు నగర పాలక సంస్థకు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆరు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా కావలి, ఆత్మకూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు ఒక్కో కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లను శనివారం సాయంత్రం కమిషనర్ శ్యాంసన్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అన్ని మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపునకు 278 మంది సిబ్బందిని నియమించామన్నారు.
నెల్లూరు కార్పొరేషన్‌కు 171 మంది , మిగిలిన వారిని ఆరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు వినియోగిస్తున్నట్టు ఆయన వివరించారు. నెల్లూరు, కావలి మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు డీకేడబ్ల్యూ కళాశాలలోని మొదటి అంతస్తులో నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. మిగిలిన మున్సిపాలిటీల లెక్కింపును కళాశాల గ్రౌండ్ ఫ్లోర్‌లోనే నిర్వహిస్తామన్నారు. ఉదయం ఎనిమిది గంటలకే లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. అదే విధంగా ఒక్కో పార్టీ నుంచి ఒక వార్డుకు ఒక ఏజెంటును మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా నగర డీఎస్పీ వెంకటనాథరెడ్డితో డీకేడబ్ల్యు కళాశాల ప్రాంగణంలో కమిషనర్ శ్యాంసన్ కౌంటింగ్ ప్రక్రియపై చర్చించారు.
నెల్లూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇలా..
నెల్లూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో 54 వార్డులుండగా 4,41,860 మంది ఓటర్లున్నారు. ఇందులో 2,51,801 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ఆరు హాళ్లలో నిర్వహిస్తారు. 54 టేబుళ్లు వేశారు. అన్ని వార్డులకు ఒకేసారి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుం ది. ఒక్కో టేబుల్‌పై ఒక్కోవార్డు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. 5,7,22,44,49 వార్డుల ఓట్ల లెక్కింపు ఐదు రౌండ్లలోనే పూర్తవుతుంది. ఆ వార్డుల ఫలితం ఉదయం 11 గంటలకే వచ్చే అవకాశం ఉంది. 26వ వార్డులో అత్యధికంగా పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. వెంకటగిరి, ఆత్మకూరు మున్సిపాలిటీల ఫలితాలు ఉదయం 12 గంటలకే వెల్లడయ్యే అవకాశం ఉంది.
‘పుర’ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
Published Sun, May 11 2014 3:37 AM | Last Updated on Sat, Oct 20 2018 6:29 PM
Advertisement