హైదరాబాద్ డీఎల్ఎఫ్ టవర్‌కు లీడ్ సర్టిఫికెట్
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్కు చెందిన మూడు ఆఫీస్ భవనాలకు అమెరికా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ లీడ్ గోల్డ్ సర్టిఫికెట్లను ఇచ్చింది. కోల్‌కతాలోని రెండు ఐటీ పార్క్ టవర్స్‌కు, హైదరాబాద్‌లోని ఒక ఐటీ పార్క్ టవర్‌కు ఈ గోల్డ్ సర్టిఫికెట్లు వచ్చాయి. వీటితో మొత్తం 17 డీఎల్ఎఫ్ ఆఫీస్ భవనాలకు (గుర్గావ్ లోని 12 ఆఫీస్ భవనాలతో కలిపి) లీడ్ సర్టిఫికెట్లు వచ్చినట్లు అవుతుంది. నిర్మాణం, నాణ్యత, నిర్వహణలో ఉత్తమ పద్ధతులను అవలంబించే భవనాలకు మాత్రమే గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ లీడ్ సర్టిఫికెట్లను ఇస్తుంది. ఈ లీడ్ సర్టిఫికేషన్ వల్ల తమ డిమాండ్ మరింత పెరుగుతుందని డీఎల్ఎఫ్ డెరైక్టర్ రాజీవ్ తల్వార్ పేర్కొన్నారు.
డీఎల్ఎఫ్కు భవనాలను అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే వార్షిక ఆదాయం రూ.2 వేల కోట్లకు పైగా ఉంది. చెన్నైలోని ఐటీ పార్క్ ప్రాజెక్టుకు కూడా లీడ్ సర్టిఫికెట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తామని డీఎల్ఎఫ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ డాయ్ తెలిపారు.