doctor laxman
-
‘మోదీ పర్యటనపై కేసీఆర్‌కు కడుపు మంట ఎందుకు?’
న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను అడ్డుకుంటామనే హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ, డాక్టర్ లక్ష్మణ్. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ప్రధాని పర్యటన అడ్డుకుంటామని కేసీఆర్ అంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఆశలను కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈనెల 11, 12వ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని హాజరవుతున్నారని స్పష్టం చేశారు. తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించనున్నారని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో తెలిపారు. ‘కేంద్ర నిధుల సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు ప్రధాని. బీజేపీని, మోదీని రాజకీయంగా ఎదుర్కోలేక తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ప్రధాని పర్యటన అడ్డుకుంటామని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణలో కుటుంబ, అవినీతి పనులను ఎదుర్కొనే సామర్థ్యం బీజేపీకి ఉన్నది.. అందుకే మునుగోడులో 40శాతం ఓట్లు బీజేపీకి వేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రూ. 6,000 కోట్ల పైచిలుకు నిధులతో పునరుద్ధరించారు. దాన్ని జాతికి అంకితం చేసేందుకు ప్రధాని వస్తుంటే అడ్డుకుంటామని అంటున్నారు. లెఫ్ట్ పార్టీలో నేతలు కేసీఆర్ కనుసనల్లో ఉన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఎరువుల కర్మాగారం ఓపెన్ చేస్తుంటే కేసీఆర్‌కి వచ్చిన కడుపు మంట ఏంటి? తెలంగాణను విత్తన భాండాగారంగా మారుస్తామని కేసీఆర్ చెప్పారు ఏమైంది? హింసను పేరేపించే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. అందులో కమ్యూనిస్టులు చలి కాల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రొటోకాల్ రగడ!.. కేసీఆర్‌ను పిలవరా? -
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తాం
సాక్షి, వరంగల్ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీచేస్తామని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. అవినీతి రహిత పాలనే అజెండాగా వచ్చే ఎన్నికలకు వెళుతామని చెప్పారు. తెలంగాణలో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీచేస్తామని వెల్లడించారు. వరంగల్‌లో జనచైతన్యయాత్ర సాగుతున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి టీవీ’తో మాట్లాడారు. రాష్ట్రంలో మార్పు కోసం చేపట్టిన జన చైతన్యయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన మండిపడ్డారు. సొంత సర్వేలతో బలంగా ఉన్నామని కేసీఆర్ భావిస్తే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉపఎన్నికలకు వెళ్ళాలని లక్ష్మణ్ సవాల్ విసిరారు. బీజేపీలో గ్రూప్ రాజకీయాలు, కుటుంబపాలనకు తావు లేదని, కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని అన్నారు. -
తండ్రీకొడుకులు సమస్యలు పరిష్కరించరా?
హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మెపై వెంటనే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తండ్రి ఓ శాఖ, కొడుకు ఓ శాఖ చేతిలో పెట్టుకుని సమస్యలు పరిష్కరించకపోవడం దారుణం అన్నారు. ఓటుకు కోట్లు కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. కాగా, వేతనాల పెంపుతో సహా 16 డిమాండ్ల పరిష్కారం కోసం మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు సోమవారం ఉదయం నుంచి సమ్మె చేపట్టారు. దీంతో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయింది. పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు స్తంభించిపోయాయి. మరోవైపు కార్మికులతో సమ్మె విరమింపజేయడానికి తొలిరోజు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. -
'ఏకగ్రీవంకు ప్రభుత్వం చొరవ చూపాలి'
హైదరాబాద్: తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ చూపాలని బీజేపీ నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఆయా పార్టీలకు ఉన్న బలాల మేరకు ఏకగ్రీవం అయ్యే అవకాశముందని చెప్పారు. అయితే తమకున్న సంఖ్య మేరకు తమ పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించడం ఖాయమని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరావు దీమా వ్యక్తం చేశారు. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు ప్రకటించింది. తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ నుంచి ఐదుగురు... కాంగ్రెస్, టీడీపీ నుంచి ఒక్కొక్కరూ నామినేషన్ వేశారు. -
'ఎస్సీ, ఎస్టీలపై ప్రభుత్వం వివక్ష'
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు నిధులు భారీగా కేటాయించినట్టుగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం.. వాటిని ఖర్చుచేయడంలో మాత్రం వివక్ష చూపిస్తోందని బీజేపీ తెలంగాణ శాసనసభాపక్ష నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, సమన్వయకర్త దాసరి మల్లేశం తో కలసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.7,579 కోట్లు కేటాయిస్తే.. కేవలం 1,179 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కోసం రూ. 4,404 కోట్లు కేటాయిస్తే 499.6 కోట్లు మాత్రమే ఖర్చుచేశారన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌కు కేటాయింపుల్లో 15 శాతం, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు 11 శాతం ఖర్చుచేసి వివక్షను ప్రదర్శించిందని లక్ష్మణ్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ఖర్చుకోసం ప్రత్యేక ఆర్థిక కార్యదర్శిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం జరుగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి వెల్లడించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై ఈ సమావేశంలో సమీక్షించనున్నట్టు తెలిపారు. ఇదిలాఉండగా, అమర్ పవార్ అధ్యక్షుడిగా రాష్ట్ర గిరిజన మోర్చాను, కె.రాములు అధ్యక్షునిగా ఎస్సీ మోర్చాను గురువారం ప్రకటించారు.