హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు నిధులు భారీగా కేటాయించినట్టుగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం.. వాటిని ఖర్చుచేయడంలో మాత్రం వివక్ష చూపిస్తోందని బీజేపీ తెలంగాణ శాసనసభాపక్ష నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, సమన్వయకర్త దాసరి మల్లేశం తో కలసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్‌సీ సబ్‌ప్లాన్‌కు రూ.7,579 కోట్లు కేటాయిస్తే.. కేవలం 1,179 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కోసం రూ. 4,404 కోట్లు కేటాయిస్తే 499.6 కోట్లు మాత్రమే ఖర్చుచేశారన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌కు కేటాయింపుల్లో 15 శాతం, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు 11 శాతం ఖర్చుచేసి వివక్షను ప్రదర్శించిందని లక్ష్మణ్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ఖర్చుకోసం ప్రత్యేక ఆర్థిక కార్యదర్శిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
నేడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం జరుగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి వెల్లడించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై ఈ సమావేశంలో సమీక్షించనున్నట్టు తెలిపారు. ఇదిలాఉండగా, అమర్ పవార్ అధ్యక్షుడిగా రాష్ట్ర గిరిజన మోర్చాను, కె.రాములు అధ్యక్షునిగా ఎస్సీ మోర్చాను గురువారం ప్రకటించారు.