doctor sasi kumar
-
ఆ వార్తల వెనుక నిజాలు వేరే ఉన్నాయి: క్రాంతి
హైదరాబాద్ : తన భర్త రాసిన సూసైడ్‌నోట్‌లో ఉన్న అంశాలపై విచారణ జరపాలని హిమాయత్‌నగర్ కాల్పులు కేసుకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శశికుమార్ భార్య క్రాంతి డిమాండ్ చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్టు రాకుండానే కేసును మూసేస్తామంటున్నారని ఆమె బుధవారమిక్కడ అన్నారు. బయట వినిపిస్తున్న వార్తల వెనుక నిజాలు వేరే ఉన్నాయని క్రాంతి వ్యాఖ్యానించారు. లారెల్ ఆస్పత్రి లావాదేవీల్లో సమస్యలున్నాయని శశికుమార్ తనకు చెప్పారని ఆమె అన్నారు. ఉదయ్, సాయికుమార్, ఫోన్ చేస్తేనే శశి ఇంట్లో నుంచి వెళ్లారని క్రాంతి తెలిపారు. చంద్రకళ తన భర్తకు ఫ్రెండ్‌గానే తెలుసునని ఆమె చెప్పారు. ఇప్పటివరకూ చంద్రకళ తనతో మాట్లాడింది లేదన్నారు. శశికుమార్ బ్రీఫ్ కేసుతో పాటు కారు కూడా ట్రేస్ అవుట్ అవలేదని, అవి రెండూ తనకు కావాలని క్రాంతి డిమాండ్ చేశారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ శశికుమార్ సూసైడ్ కేసును మొయినాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. శశికుమార్ స్నేహితురాలు చంద్రకళను నారాయణగూడ పోలీసులు విచారణ జరుపుతారని కమలాసన్ రెడ్డి తెలిపారు. కాల్పుల ఘటనపై విచారణ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఉదయ్‌పై కాల్పులు జరిపింది శశికుమారేనని అన్నారు. ఇక బుల్లెట్ గాయమైన ఉదయ్ ప్రస్తుతం కోలుకుంటున్నారని చెప్పారు. -
కావాలనే నాపై ఆరోపణలు: డా.సాయికుమార్
హైదరాబాద్ : సంచలనం రేపిన వైద్యుల కాల్పుల ఘటనలో డాక్టర్ శశికుమార్ కావాలనే తనపై ఆరోపణలు చేశారని ప్రత్యక్ష సాక్షి డాక్టర్ సాయికుమార్ అన్నారు. శశికుమార్ సూసైడ్ నోట్లో తనపై ఆరోపణలు చేశారని, నిజానిజాలు విచారణలో వెల్లడి అవుతాయన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ ఉదయ్ కుమార్‌పై కాల్పులు జరిపింది శశికుమారే అని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదని, వారం క్రితం గుండెపోటు వచ్చినట్లు సాయికుమార్ పేర్కొన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సాయికుమార్‌ను సుమారు ఏడు గంటల పాటు పోలీసులు విచారణ జరిపారు. ఈ మేరకు సాయికుమార్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. పోలీసుల విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. త్వరలోనే మీడియాకు అన్ని వివరాలు అందిస్తానని ఆయన తెలిపారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ ఐ విట్నెస్ సాయికుమార్ స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలిపారు. కాల్పుల ఘటనలో గాయపడ్డ డాక్టర్ ఉదయ్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కాగా హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన డాక్టర్ ఉదయ్‌కుమార్, చైతన్యపురి వాసి డాక్టర్ శశికుమార్, మాదాపూర్‌కు చెందిన డాక్టర్ సాయికుమార్ ముగ్గురూ స్నేహితులు. వీరు ఇటీవల దాదాపు రూ.15 కోట్లతో మాదాపూర్‌లో లారెల్ హాస్పిటల్స్ ప్రారంభించారు. సర్జన్‌గా తాను ఉన్నా కూడా వేరే సర్జన్‌ను పిలిపించి ఆపరేషన్లు చేయిస్తుండటంతో ఆగ్రహానికి గురైన శశికుమార్.. పెట్టుబడిలో తనవాటా రూ.75 లక్షలు తిరిగి ఇచ్చేయాలని కోరాడు. ఈ చర్చలలో వివాదం రేగడంతో.. తర్వాత తిరిగి కారులో వెళ్తుండగా డాక్టర్ ఉదయ్‌పై డాక్టర్ శశికుమార్ కాల్పులు జరిపారు. ఈ విషయం మీడియా ద్వారా మొత్తం ప్రపంచానికి తెలియడంతో.. శశికుమార్ కూడా తన రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
అది ఆత్మహత్య కాదు.. హత్యే: శశికుమార్ భార్య
హిమాయత్‌నగర్ కాల్పుల ఘటన రకరకాల మలుపులు తిరుగుతోంది. డాక్టర్ శశికుమార్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన భర్తది ఆత్మహత్య కాదు.. హత్యేనని ఆయన భార్య క్రాంతి ఆరోపించారు. సాయికుమార్, ఉదయ్ కలిసి తన భర్తను హత్య చేయించారని ఆమె అన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఏకైక సాక్షి డాక్టర్ సాయికుమార్ ప్రస్తుతం నారాయణగూడ పోలీసుల అదుపులో ఉన్నారు. డాక్టర్ ఉదయ్ మీద ఎవరు కాల్పులు జరిపారన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాల్పులు తాను జరపలేదని, సాయికుమారే కాల్చాడని తన సూసైడ్ నోట్లో శశికుమార్ పేర్కొన్నారు. కానీ శశికుమారే తమ ఇద్దరిపై కాల్పులు జరిపాడని సాయికుమార్ అంటున్నారు. శశికుమార్‌ను తన ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లిన చంద్రకళను విచారించాలనే యోచనలో పోలీసులు కనిపిస్తున్నారు. కానీ కాల్పుల ఘటనతో తనకు సంబంధం లేదని ఆమె చెబుతున్నారు. ఇక శశికుమార్ ఫామ్‌హౌస్‌కు వెళ్లినప్పుడు అక్కడకు ఒక రంపం, కొడవలి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకోడానికి రకరకాల మార్గాలు చూసుకుని, చివరకు తన రివాల్వర్‌తో కాల్చుకున్నారా.. లేక మరేదైనా అవసరం కోసం వాటిని తీసుకెళ్లారా అన్నది తెలియడం లేదు. తన భర్తను నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి పిలిపించారని, తర్వాత కిరాయి హంతకులతో ఆయనను చంపించారని శశికుమార్ భార్య క్రాంతి చెబుతున్నారు. తన భర్తది ఆత్మహత్య కానే కాదని ఆమె గట్టిగా అంటున్నారు. -
కాల్చింది నేను కాదు.. సాయికుమార్!
హిమాయత్‌నగర్ ప్రాంతంలో వైద్యుల మధ్య కాల్పుల ఘటన క్రైం థ్రిల్లర్ సినిమా ట్విస్టులను తలపిస్తోంది. ఈ ఘటనలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు డాక్టర్ ఉదయ్ మీద కాల్పులు జరిపింది తాను కాదని, సాయికుమార్ కాల్చడంతో తాను భయపడి అక్కడి నుంచి పారిపోయానని ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శశికుమార్ తన సూసైడ్ నోట్లో రాశారు. భార్యా పిల్లలు తనను క్షమించాలని, గ్లోరియల్ ఆస్పత్రి వివాదంలో కావాలనే తనను ఇరికించారని అన్నారు. తన ఆత్మహత్యకు మరో ఇద్దరు వైద్యులు కారణమని ఆయన రాశారు. కాగా, నక్కలపల్లిలోని ఫామ్‌హౌస్‌లో రివాల్వర్‌తో పాటు నాలుగు రౌండ్ల బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
వైద్యుల కాల్పులు: డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య
హిమాయత్‌నగర్‌లో సంచలనం రేపిన వైద్యుల కాల్పుల ఘటనలో డాక్టర్ ఉదయ్ కుమార్‌పై కాల్పులు జరిపిన మరో వైద్యుడు డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నక్కలపల్లి గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. డాక్టర్ శశికుమార్ (40) సోమవారం సాయంత్రం కాల్పుల ఘటన అనంతరం తన స్నేహితురాలు చంద్రకళకు ఫోన్ చేసి మీ ఫామ్‌హౌస్‌కు వెళ్లాలని ఉందనడంతో.. ఆమె అతన్ని తీసుకెళ్లి ఫామ్‌హౌస్ దగ్గర వదిలేసి తిరిగి ఇంటికి వచ్చారు. అనంతరం టీవీలో వార్తలు చూసి కాల్పులకు పాల్పడింది శశికుమార్ అని నిర్ధరించుకొని పంజాగుట్ట పోలీసులను కలిసి శశికుమార్ తన ఫామ్‌హౌస్‌లో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ఆమెను వెంట తీసుకొని రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఫామ్ హౌస్‌కు వెళ్లగా అప్పటికే శశికుమార్ తన వద్ద ఉన్న రివాల్వర్‌తో పేల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలో లంభించిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. శశికుమార్ స్వస్థలం వరంగల్‌లోని నక్కలగుట్ట ప్రాంతం. ఆయనే చైతన్యపురిలో సాయి నిఖిత ఆస్పత్రిని కూడా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన డాక్టర్ ఉదయ్‌కుమార్, చైతన్యపురి వాసి డాక్టర్ శశికుమార్, మాదాపూర్‌కు చెందిన డాక్టర్ సాయికుమార్ ముగ్గురూ స్నేహితులు. వీరు ఇటీవల దాదాపు రూ.15 కోట్లతో మాదాపూర్‌లో లారెల్ హాస్పిటల్స్ ప్రారంభించారు. సర్జన్‌గా తాను ఉన్నా కూడా వేరే సర్జన్‌ను పిలిపించి ఆపరేషన్లు చేయిస్తుండటంతో ఆగ్రహానికి గురైన శశికుమార్.. పెట్టుబడిలో తనవాటా రూ.75 లక్షలు తిరిగి ఇచ్చేయాలని కోరాడు. ఈ చర్చలలో వివాదం రేగడంతో.. తర్వాత తిరిగి కారులో వెళ్తుండగా డాక్టర్ ఉదయ్‌పై డాక్టర్ శశికుమార్ కాల్పులు జరిపారు. ఈ విషయం మీడియా ద్వారా మొత్తం ప్రపంచానికి తెలియడంతో.. శశికుమార్ కూడా తన రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయారు.