అది ఆత్మహత్య కాదు.. హత్యే: శశికుమార్ భార్య
హిమాయత్‌నగర్ కాల్పుల ఘటన రకరకాల మలుపులు తిరుగుతోంది. డాక్టర్ శశికుమార్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన భర్తది ఆత్మహత్య కాదు.. హత్యేనని ఆయన భార్య క్రాంతి ఆరోపించారు. సాయికుమార్, ఉదయ్ కలిసి తన భర్తను హత్య చేయించారని ఆమె అన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఏకైక సాక్షి డాక్టర్ సాయికుమార్ ప్రస్తుతం నారాయణగూడ పోలీసుల అదుపులో ఉన్నారు. డాక్టర్ ఉదయ్ మీద ఎవరు కాల్పులు జరిపారన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాల్పులు తాను జరపలేదని, సాయికుమారే కాల్చాడని తన సూసైడ్ నోట్‌లో శశికుమార్ పేర్కొన్నారు. కానీ శశికుమారే తమ ఇద్దరిపై కాల్పులు జరిపాడని సాయికుమార్ అంటున్నారు. శశికుమార్‌ను తన ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లిన చంద్రకళను విచారించాలనే యోచనలో పోలీసులు కనిపిస్తున్నారు. కానీ కాల్పుల ఘటనతో తనకు సంబంధం లేదని ఆమె చెబుతున్నారు.
ఇక శశికుమార్ ఫామ్‌హౌస్‌కు వెళ్లినప్పుడు అక్కడకు ఒక రంపం, కొడవలి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకోడానికి రకరకాల మార్గాలు చూసుకుని, చివరకు తన రివాల్వర్‌తో కాల్చుకున్నారా.. లేక మరేదైనా అవసరం కోసం వాటిని తీసుకెళ్లారా అన్నది తెలియడం లేదు. తన భర్తను నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి పిలిపించారని, తర్వాత కిరాయి హంతకులతో ఆయనను చంపించారని శశికుమార్ భార్య క్రాంతి చెబుతున్నారు. తన భర్తది ఆత్మహత్య కానే కాదని ఆమె గట్టిగా అంటున్నారు.