వైద్యుల కాల్పులు: డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య
హిమాయత్‌నగర్‌లో సంచలనం రేపిన వైద్యుల కాల్పుల ఘటనలో డాక్టర్ ఉదయ్ కుమార్‌పై కాల్పులు జరిపిన మరో వైద్యుడు డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నక్కలపల్లి గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. డాక్టర్ శశికుమార్ (40) సోమవారం సాయంత్రం కాల్పుల ఘటన అనంతరం తన స్నేహితురాలు చంద్రకళకు ఫోన్ చేసి మీ ఫామ్‌హౌస్‌కు వెళ్లాలని ఉందనడంతో.. ఆమె అతన్ని తీసుకెళ్లి ఫామ్‌హౌస్ దగ్గర వదిలేసి తిరిగి ఇంటికి వచ్చారు. అనంతరం టీవీలో వార్తలు చూసి కాల్పులకు పాల్పడింది శశికుమార్ అని నిర్ధరించుకొని పంజాగుట్ట పోలీసులను కలిసి శశికుమార్ తన ఫామ్‌హౌస్‌లో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ఆమెను వెంట తీసుకొని రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఫామ్ హౌస్‌కు వెళ్లగా అప్పటికే శశికుమార్ తన వద్ద ఉన్న రివాల్వర్‌తో పేల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలో లంభించిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. శశికుమార్ స్వస్థలం వరంగల్‌లోని నక్కలగుట్ట ప్రాంతం. ఆయనే చైతన్యపురిలో సాయి నిఖిత ఆస్పత్రిని కూడా నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన డాక్టర్ ఉదయ్‌కుమార్, చైతన్యపురి వాసి డాక్టర్ శశికుమార్, మాదాపూర్‌కు చెందిన డాక్టర్ సాయికుమార్ ముగ్గురూ స్నేహితులు. వీరు ఇటీవల దాదాపు రూ.15 కోట్లతో మాదాపూర్‌లో లారెల్ హాస్పిటల్స్ ప్రారంభించారు. సర్జన్‌గా తాను ఉన్నా కూడా వేరే సర్జన్‌ను పిలిపించి ఆపరేషన్లు చేయిస్తుండటంతో ఆగ్రహానికి గురైన శశికుమార్.. పెట్టుబడిలో తనవాటా రూ.75 లక్షలు తిరిగి ఇచ్చేయాలని కోరాడు. ఈ చర్చలలో వివాదం రేగడంతో.. తర్వాత తిరిగి కారులో వెళ్తుండగా డాక్టర్ ఉదయ్‌పై డాక్టర్ శశికుమార్ కాల్పులు జరిపారు. ఈ విషయం మీడియా ద్వారా మొత్తం ప్రపంచానికి తెలియడంతో.. శశికుమార్ కూడా తన రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయారు.