కావాలనే నాపై ఆరోపణలు: డా.సాయికుమార్
హైదరాబాద్ : సంచలనం రేపిన వైద్యుల కాల్పుల ఘటనలో డాక్టర్ శశికుమార్ కావాలనే తనపై ఆరోపణలు చేశారని ప్రత్యక్ష సాక్షి డాక్టర్ సాయికుమార్ అన్నారు. శశికుమార్ సూసైడ్ నోట్లో తనపై ఆరోపణలు చేశారని, నిజానిజాలు విచారణలో వెల్లడి అవుతాయన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ ఉదయ్ కుమార్పై కాల్పులు జరిపింది శశికుమారే అని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదని, వారం క్రితం గుండెపోటు వచ్చినట్లు సాయికుమార్ పేర్కొన్నారు.
కాగా ఈ కేసుకు సంబంధించి సాయికుమార్ను సుమారు ఏడు గంటల పాటు పోలీసులు విచారణ జరిపారు. ఈ మేరకు సాయికుమార్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. పోలీసుల విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. త్వరలోనే మీడియాకు అన్ని వివరాలు అందిస్తానని ఆయన తెలిపారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ ఐ విట్నెస్ సాయికుమార్ స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలిపారు. కాల్పుల ఘటనలో గాయపడ్డ డాక్టర్ ఉదయ్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
కాగా హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన డాక్టర్ ఉదయ్‌కుమార్, చైతన్యపురి వాసి డాక్టర్ శశికుమార్, మాదాపూర్‌కు చెందిన డాక్టర్ సాయికుమార్ ముగ్గురూ స్నేహితులు. వీరు ఇటీవల దాదాపు రూ.15 కోట్లతో మాదాపూర్‌లో లారెల్ హాస్పిటల్స్ ప్రారంభించారు. సర్జన్‌గా తాను ఉన్నా కూడా వేరే సర్జన్‌ను పిలిపించి ఆపరేషన్లు చేయిస్తుండటంతో ఆగ్రహానికి గురైన శశికుమార్.. పెట్టుబడిలో తనవాటా రూ.75 లక్షలు తిరిగి ఇచ్చేయాలని కోరాడు. ఈ చర్చలలో వివాదం రేగడంతో.. తర్వాత తిరిగి కారులో వెళ్తుండగా డాక్టర్ ఉదయ్‌పై డాక్టర్ శశికుమార్ కాల్పులు జరిపారు. ఈ విషయం మీడియా ద్వారా మొత్తం ప్రపంచానికి తెలియడంతో.. శశికుమార్ కూడా తన రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.