ఆ వార్తల వెనుక నిజాలు వేరే ఉన్నాయి: క్రాంతి
హైదరాబాద్ : తన భర్త రాసిన సూసైడ్నోట్లో ఉన్న అంశాలపై విచారణ జరపాలని హిమాయత్నగర్ కాల్పులు కేసుకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శశికుమార్ భార్య క్రాంతి డిమాండ్ చేశారు. పోస్ట్మార్టం రిపోర్టు రాకుండానే కేసును మూసేస్తామంటున్నారని ఆమె బుధవారమిక్కడ అన్నారు. బయట వినిపిస్తున్న వార్తల వెనుక నిజాలు వేరే ఉన్నాయని క్రాంతి వ్యాఖ్యానించారు.
లారెల్ ఆస్పత్రి లావాదేవీల్లో సమస్యలున్నాయని శశికుమార్ తనకు చెప్పారని ఆమె అన్నారు. ఉదయ్, సాయికుమార్, ఫోన్ చేస్తేనే శశి ఇంట్లో నుంచి వెళ్లారని క్రాంతి తెలిపారు. చంద్రకళ తన భర్తకు ఫ్రెండ్గానే తెలుసునని ఆమె చెప్పారు. ఇప్పటివరకూ చంద్రకళ తనతో మాట్లాడింది లేదన్నారు. శశికుమార్ బ్రీఫ్ కేసుతో పాటు కారు కూడా ట్రేస్ అవుట్ అవలేదని, అవి రెండూ తనకు కావాలని క్రాంతి డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ కేసుకు సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ శశికుమార్ సూసైడ్ కేసును మొయినాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. శశికుమార్ స్నేహితురాలు చంద్రకళను నారాయణగూడ పోలీసులు విచారణ జరుపుతారని కమలాసన్ రెడ్డి తెలిపారు. కాల్పుల ఘటనపై విచారణ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఉదయ్పై కాల్పులు జరిపింది శశికుమారేనని అన్నారు. ఇక బుల్లెట్ గాయమైన ఉదయ్ ప్రస్తుతం కోలుకుంటున్నారని చెప్పారు.