
ఆందోల్ (ఎస్సి) నియోజకవర్గం
ఆందోల్ రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన జర్నలిస్టు క్రాంతి కిరణ్ తొలిసారి విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర రాజ నరసింహపై 16851 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. క్రాంతికిరణ్‌కు 104229 ఓట్లు రాగా, దామోదర రాజనరసింహకు 87378 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ గతంలో టిఆర్‌ఎస్ తరపున గెలిచిన ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ 2018లో బిజెపి పక్షాన పోటీచేసి ఓటమి చెందారు. కేవలం 2350 ఓట్లు మాత్రమే తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు.
2014లో దామోదర రాజనరసింహ ఓటమి చెందారు. ఆయనపై టిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బాబూ మోహన్ 3291 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. బాబూ మోహన్ 2014లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందే టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరారు. బాబూమోహన్ 2014లో గెలవడంతో మూడోసారి గెలిచినట్లయింది. ఈ నియోజకవర్గానికి మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి తొమ్మిది సార్లు, టిడిపి నాలుగుసార్లు టిఆర్‌ఎస్ రెండుసార్లు గెలిచాయి. ఒకసారి ఇండిపెండెంటు నెగ్గారు. దామోదర రాజనరసింహ గతంలో డాక్టర్ వై.ఎస్.
రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో సభ్యుడిగా ఉన్నారు. కిరణ్ ముఖ్యమంత్రి అయిన కొంతకాలానికి దామోదర రాజనరసింహ ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ పొందారు. ఈయన తండ్రి రాజనరసింహ కాసు, పి.వి. అంజయ్యల మంత్రివర్గాలలో పనిచేసారు. తండ్రి, కొడుకులు ఇద్దరూ మంత్రులైన ఘనత వీరికి దక్కింది. వీరిద్దరూ కలిసి ఏడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. దామోదర అందోల్‌లో మూడుసార్లు, ఈయన తండ్రి రాజనరసింహ ఇక్కడ మూడుసార్లు, సదాశివపేటలో ఒకసారి మొత్తం నాలుగుసార్లు గెలిచారు.
ఇక్కడ నుంచి గెలుపొందిన మరో ఇద్దరు కూడా మంత్రులయ్యారు. టిడిపి తరుఫున గెలిచిన రాజయ్య గతంలో ఎన్.టి.ఆర్, చంద్రబాబుల క్యాబినెట్‌లలో పనిచేసారు. 1998, 1999లలో సిద్దిపేట నుంచి లోక్‌సభకు కూడా రాజయ్య ఎన్నికయ్యారు. 1998లో లోక్‌సభకు ఎన్నికైన కారణంగా ఆందోల్ సీటుకు రాజీనామా చేయగా, జరిగిన ఉప ఎన్నికలో సినీనటుడు బాబూమోహన్ గెలుపొందారు. ఆయన తిరిగి 1999లో కూడా గెలిచి చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. 2014లో టిఆర్‌ఎస్ పక్షాన గెలిచి, 2018లో బిజెపి నుంచి పోటీచేసి ఓడిపోయారు.
ఆందోల్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment