గజ్వేల్ నియోజకవర్గం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2018 ఎన్నికలలో కూడా గజ్వేల్ నుంచి పోటీచేసి ఘనవిజయం సాధించారు. ఆయన అంతకుముందు సిద్దిపేటలో ఆరుసార్లు గెలిచారు. 2014, 2018లలో గజ్వేల్ నుంచి గెలిచి ఎనిమిదిసార్లు గెలిచిన ఏకైక తెలంగాణ నేతగా రికార్డు సృష్టించారు. తెలంగాణ ఉద్యమ నేతగా 2002 నుంచి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ చరిత్రనే కెసిఆర్ మలుపు తిప్పారు. తెలంగాణ సాదించిన నేతగా, టిఆర్‌ఎస్ ను విజయ పదంలో నడిపించిన నాయకుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు.
గజ్వేల్ లో 2018లో తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి వంటేరు ప్రతాపరెడ్డిపై 56922 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వంటేరు గతసారి టిడిపి నుంచి పోటీచేసి, ఆ తర్వాత పరిణామాలలో కాంగ్రెస్ ఐలో చేరి పోటీచేసి ఓటమి చెందారు. తదుపరి ఆయన కూడా టిఆర్‌ఎస్‌లో చేరిపోవడం విశేషం. కెసిఆర్‌కు 120608 ఓట్లు రాగా, ప్రతాపరెడ్డికి 63686 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి పోటీచేసిన బిజెపి అభ్యర్ధి ఆకుల విజయకు 15 వేలకు పైగా ఓట్లు రావడం విశేషం. కెసిఆర్ వెలమ సామాజికవర్గానికి చెందినవారు.
కెసిఆర్ 2014లో కూడా శాసనసభకు, పార్లమెంటుకు పోటీచేసి రెండు చోట్ల విజయం సాధించారు. రెండువేల నాలుగులో సిద్దిపేట శాసనసభకు, కరీంనగర్ లోక్ సభకు పోటీచేసి రెండుచోట్ల విజయం సాదించిన కెసిఆర్ 2014లో గజ్వేల్ నుంచి శాసనసభకు, మెదక్ నుంచి లోక్ సభకు పోటీచేసి మళ్లీ గెలుపొందారు.ఇది ఒక రికార్డు. అంతేకాక 2004లో ఎమ్.పిగా ఎన్నికయ్యాక, ఒకేటరమ్ లో రెండుసార్లు రాజీనామా చేసిన చరిత్ర కూడా ఈయన సొంతం. ఆ రకంగా కరీంనగర్ ఎమ్.పిగా ఒకే టరమ్‌లో మూడుసార్లు గెలిచిన నేతగా కూడా నమోదయ్యారు. కెసిఆర్ 1983 ఎన్నికలలో ఓడిపోయినా, ఆ తర్వాత ఆయన ఎదురులేని నేతగా మారారు.
1985 లో తొలిసారి సిద్దిపేట నుంచి తెలుగుదేశం పక్షాన గెలుపొందారు. ఆ తర్వాత 1989,1994,1999లలో కూడా విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. 1999లో గెలిచిన తర్వాత మంత్రి పదవి కాకుండా ఉప సభాపతి పదవి ఇచ్చారు. దాంతో అసంతృప్తికి గురి అయ్యారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నడుం కట్టాలని సన్నద్దమై, ఉప సభాపతి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో తాను ఏర్పాటు చేసుకున్న టిఆర్‌ఎస్ తరపున సిద్దిపేటలో పోటీచేసి గెలుపొందారు. అలా ఒక్కడితో ఆరంభమైన ఆయన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధించడమే కాకుండా , తెలంగాణలో తన పార్టీని విజయపధాన నడిపించి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.
మొత్తం ఎనిమిదిసార్లు శాసనసభకు ఎన్నికై చరిత్ర సృష్టించారు. కెసిఆర్ 8 సార్లు శాసనసభతోపాటు ఐదుసార్లు లోక్ సభకు ఎన్నికైన రికార్డును సొంతం చేసుకున్నారు. గజ్వేల్ ఎక్కువ కాలం రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉండేది. అప్పట్లో పదకుండు మంది ఎస్.సి.నేతలు గెలుపొందారు. 1962లో నుంచి రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉన్న గజ్వేల్ 2009లో జనరల్‌గా మారింది. ఫలితంగా 1989లోను, 2004లోను ఇక్కడ గెలిచిన మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి ఇక్కడ కాక జహీరాబాద్ రిజర్వుడ్ నియోజకవర్గంలో పోటీచేసి వరసగా అక్కడ రెండుసార్లు గెలిచారు.
గజ్వేల్ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నికతో సహా 16సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి తొమ్మిది సార్లు, టిడిపి నాలుగుసార్లు, పిడిఎఫ్ ఒకసారి, టిఆర్‌ఎస్ రెండుసార్లు గెలిచాయి. 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు జనరల్ స్థానంలో గెలిచిన ఆర్.నరసింహారెడ్డి ఎన్నిక చెల్లదని చెప్పడంతో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో కూడా ఆయనే గెలిచారు. జి.సైదయ్య ఇక్కడ నాలుగుసార్లు గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన జె.బి.ముత్యాలరావు మరోసారి సికింద్రాబాద్‌లో గెలుపొందారు. ఈయన 1962లో మహాబూబ్‌నగర్ నుంచి 1967 నాగర్‌కర్నూలు నుంచి లోక్‌సభకు గెలుపొంది కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక్కడ ఒకసారి గెలిచిన డాక్టర్ విజయరామారావు2004లో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి గెలిచారు.
ఒకసారి సిద్ధిపేట నుంచి లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. ఈయన డాక్టర్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కొంతకాలం సభ్యునిగా ఉన్నారు. టిఆర్‌ఎస్ శాసనసభా పక్షనేతగా వ్యవహరించారు. 2008లో టిఆర్‌ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. కాని ఉప ఎన్నికలో ఓడిపోయారు. 2009లో వరంగల్‌జిల్లా వర్ధన్నపేట నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడ రెండుసార్లు, జహీరాబాద్‌లో రెండుసార్లు గెలిచిన గీతారెడ్డి ప్రముఖ రిపబ్లికన్ నాయకురాలు జె.ఈశ్వరీబాయి కుమార్తె, ఈమె చెన్నారెడ్డి, కోట్ల 2004 నుంచి డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో సభ్యురాలిగా ఉన్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment