గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించేందుకు కుట్రలు చేశారు: హరీష్‌ రావు | Harish Rao Sensational Comments Over KCR Win In Gajwel In Telangana Assembly Elections 2023 - Sakshi
Sakshi News home page

ప్లాన్‌ ప్రకారం కేసీఆర్‌ను ఓడించేందుకు కుట్రలు జరిగాయి: హరీష్‌ రావు సంచలన కామెంట్స్‌

Published Thu, Jan 18 2024 4:54 PM | Last Updated on Thu, Jan 18 2024 5:25 PM

Harish Rao Sensations Comments Over KCR Win In Gajwel - Sakshi

సాక్షి, గజ్వేల్‌: అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించేందుకు అనేక కుట్రలు జరిగాయన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్‌ భారీ మెజార్టీతో గెలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులే అయినా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కేసులు పెడున్నారు అని తీవ్ర విమర్శలు చేశారు. 

కాగా, హరీష్‌ రావు గజ్వేల్ కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు పనిచేశాయి. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. అయినా కూడా కేసీఆర్‌ విజయం సాధించారు. మా బీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఇది మీ విజయం. మీ అందరి కష్టం. మీకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ ప్రత్యేక సమావేశం. 

కుట్రలు భగ్నం..
గజ్వేల్‌లో కేసీఆర్‌పై 154 నామినేషన్లు వేశారు. అనేక కుట్రలు. విత్ డ్రా తర్వాత 47 మిగిలాయి. నాలుగు మిషన్ల ఏర్పాటు వల్ల కొందరు కన్ఫ్యూజ్ అయ్యారు. 18,750 ఓట్లు చితికిపోయాయి. మరో 2200 ఓట్లు కారును పోలిన రోడ్డు రోలర్ గుర్తుకు పడ్డాయి. ఇన్ని కుట్రలు జరిగినా కేసీఆర్‌ 45 వేల మెజారిటీతో గెలిపించారు. మూడోసారి గెలుపు అందించారు. గజ్వేల్ ప్రజలందరికీ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ తరుపున ధన్యవాదాలు. గజ్వేల్ అభివృద్ధి ఎంతో జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీలో గజ్వేల్‌పై కాంగ్రెస్‌ అక్కసు వెళ్లగక్కింది. గత చరిత్రను బీఆర్‌ఎస్‌ తిరగరాసింది. 

ఒక్కనాడు కూడా కాంగ్రెస్ నాయకులపై కేసుకు పెట్టలేదు. గజ్వేల్ ఎలా బాగు చేయాలి అని నిరంతరం ఆలోచించారు. కానీ, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నెల రోజులు కూడా కాలేదు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. కేసులు పెడుతున్నారు. కేసీఆర్‌ గజ్వేల్‌ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తే, కాంగ్రెస్ వాళ్లు కేసులు, కుట్రలతో ముందుకు తీసుకెళుతున్నారు.

ప్రగతి భవన్‌ గురించి భట్టి చెప్పాలి..
డిసెంబర్ 9న రుణమాఫీ.. నాలుగు వేలకు పింఛన్లు పెంచుతాం.. కరెంట్ బిల్లు కట్టొద్దు.. రైతుబంధు పెంచుతాం అన్నారు. వడ్లకు రూ.500 బోనస్, నిరుద్యోగ భృతి అన్నారు.. ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారు. ప్రగతి భవన్‌లో 250 బెడ్ రూమ్స్‌ ఉన్నాయన్నారు. బంగారు బాత్ రూములు ఉన్నాయన్నారు. అక్కడ ఉంటున్న భట్టి గారు వాస్తవాలు చెప్పాలి. కేటీఆర్ దావోస్ వెళ్లి పెట్టుబడులు తెస్తే దండుగ అన్నారు. ఉత్తకుమార్ రెడ్డి అక్కడికి వెళ్ళడం వేస్ట్ అన్నారు. మీ ముఖ్యమంత్రి వెళ్ళారు ఏం సమాధానం చెబుతారు.

బీజేపీతో కోట్లాడతం అని దోస్తీ చేస్తున్నది ఎవరు? బండి సంజయ్, అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్‌ను బీఆర్‌ఎస్‌ ఓడించింది. ఈ దేశం అదానీ, అంబానీ చేతుల్లో ఉందని, అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడని, ఈ ఇద్దరి చేతుల్లో 500 కంపెనీలు ఉన్నయని రాహుల్ గాంధీ అంటాడు. సాయంత్రం రేవంత్ రెడ్డి, అదానీ కలిసి హగ్ ఇచ్చుకుంటారు. షేక్ హ్యాండ్ చేసుకుంటారు. రాహుల్ కరెక్టా? రేవంత్ కరెక్టా?. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది. 

గజ్వేల్‌ ప్రజలకు అండగా ఉంటా..
గజ్వేల్ ప్రజల కోసం నా తలుపులు 24 గంటల పాటు తెరిచే ఉంటాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకుంటాను. ఎక్కడ అన్యాయం జరిగినా ఫోన్ చేయండి, నేనే మీ వద్దకు వస్తాను భుజం కలిపి పోరాటం చేస్తాను. పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. ఉద్యమ సమయంలో అరెస్ట్‌ అయ్యి మెదక్ జైల్లో నాలుగు రోజుల పాటు ఉన్నాను. ధైర్యంగా ఉండండి, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది.

కలిసి పనిచేద్దాం..
మన కేసీఆర్‌ కోలుకుంటున్నారు. త్వరలోనే గజ్వేల్ క్యాంప్ ఆఫీస్‌కి వస్తారు. మీ అందరితో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో మీకు పూర్తిస్థాయిలో సహకారం ఉంటుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు మనకు అద్భుతమైన విజయమందిస్తారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో మూడు వంతుల ఎంపీ సీట్లు అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందని వార్తలు వస్తున్నాయి. ఎంపీ ఎన్నికల్లో కలిసి పని చేద్దాం. ఏడు ఎమ్మెల్యేలలో ఆరు ఎమ్మెల్యేలు మన పార్టీ వాళ్ళు ఉన్నారు. అద్భుత విజయం సాధిస్తాం. మీకు స్థానిక నాయకులతో పాటు, కేసీఆర్, నేనూ అందుబాటులో ఉంటాము. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. కలిసి ముందుకు వెళ్దాం అని వ్యాఖ్యలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement