Domestic tourism
-
పర్యాటకుల ఆకర్షణలో జోష్
దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న టాప్ పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. 2022 సంవత్సరానికి సంబంధించి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంచేశాయి. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా.. రెండో స్థానంలో తమిళనాడు ఉంది. అలాగే, కర్ణాటక నాలుగో స్థానంలో.. గుజరాత్ ఐదో స్థానంలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం వరుసగా 2021, 2022లో మూడో స్థానంలో ఉంది. అయితే, 2021 సంవత్సరంతో పోలిస్తే 2022లో ఏపీలో భారీ వృద్ధి నమోదైనట్లు ఆ గణాంకాలు పేర్కొన్నాయి. 2021లో ఆంధ్రప్రదేశ్ 9.32 కోట్ల మంది దేశీయ పర్యాటకులను ఆకర్షించగా 2022లో ఏకంగా 19.27 కోట్ల మందిని ఆకర్షించింది. అంటే 2021తో పోలిస్తే 2022లో దేశీయ పర్యాటకుల సంఖ్య 107 శాతం పెరిగింది. – సాక్షి, అమరావతి 84.76 శాతం పర్యాటకులు ఆ రాష్ట్రాలకే.. ఇక 2022లో దేశీయ పర్యాటకులను ఆకర్షించిన టాప్–10 రాష్ట్రాల్లోనే 84.76 శాతం మంది ఉన్నారని, మిగతా రాష్ట్రాల్లో కేవలం 15.24 శాతం ఉన్నట్లు కేంద్ర పర్యాటక శాఖ తెలిపింది. నిజానికి.. కోవిడ్ కారణంగా 2021లో దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల సంఖ్య తగ్గింది. ఆ ఏడాది దేశం మొత్తం మీద పర్యాటకుల సంఖ్య 67.76 కోట్లు మాత్రమే ఉంది. అదే 2022లో భారీగా పెరిగింది. ఈ ఏడాది ఆ సంఖ్య మొత్తం 173.10 కోట్లు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. అలాగే, 2021తో పోలిస్తే 2022లో దేశీయ పర్యాటకుల సంఖ్య 155.45 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్ పూర్వ స్థితితో పోలిస్తే దేశీయ పర్యాటకుల వృద్ధి 2022లో 25.45 శాతం క్షీణించిందని.. అయినప్పటికీ 2020, 2021లో కన్నా 2022లో దేశీయ పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు.. 2022లో దేశీయ పర్యాటకులను ఆకర్షించిన టాప్–10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్ కూడా ఉన్నాయి. -
స్వదేశీ పర్యాటకానికే మొగ్గు
సాక్షి, అమరావతి: కోవిడ్ తర్వాత దేశీయ పర్యాటకుల ఆలోచనలో గణనీయమైన మార్పు కనిపిస్తున్నది. వేసవి పర్యాటకం అనగానే విదేశాలు ఎగిరిపోయే పర్యాటకులు ఈసారి స్వదేశీ పర్యాటకానికే మొగ్గు చూపారు. మొత్తం పర్యాటకుల్లో 94 శాతం మంది విదేశాల కంటే దేశంలోని చల్లటి ప్రదేశాలకు వెళ్లడానికే మొగ్గు చూపినట్లు ఓయో మిడ్ సమ్మర్ వెకేషన్ ఇండెక్స్ 2022 వెల్లడించింది. గతేడాది డిసెంబర్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమైనప్పటికీ పర్యాటకులు విదేశీ ప్రయాణాలకు అంతగా ఇష్టపడడం లేదన్న విషయం ఆ సర్వేలో వెల్లడయ్యింది. స్విట్జర్లాండ్ వెళ్లాలనుకున్న వారిలో 58 శాతం మంది ఈ సారి జమ్ము అండ్ కాశ్మీర్‌లోని గుల్మార్గ్కు వెళ్లారు. అలాగే స్కాట్లాండ్కు వెళ్లాలనుకునేవారిలో 78 శాతం మంది కర్ణాటకలోని కూర్గ్‌కు పయనమయ్యారు. అదేవిధంగా అమెరికాలోని అలస్కాకు వెళ్లాలనుకునేవారిలో 67.9 శాతం మంది ఉత్తరాఖండ్‌లోని అలిని ఎంచుకున్నారు. వీటితోపాటు కులు, మనాలి, రిషికేష్, ఊటీ, సిక్కిం, అలెప్పీ, జిమ్ కార్బెట్ (ఉత్తరాఖండ్) వెళ్లడానికి అత్యధికంగా మొగ్గు చూపారు. బీచ్ అంటే గోవానే.. వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి బీచ్‌లకు వెళ్లాలనుకునేవారిలో అత్యధికమంది గోవాకే మొగ్గు చూపినట్లు వెల్లడయ్యింది. ఆ తర్వాతి స్థానంలో అండమాన్ నికోబార్, కేరళ బీచ్‌లున్నాయి. వాస్తవంగా వేసవిలో బీచ్ టూరిజం అంటే ముందుగా గుర్తుకొచ్చేది మాల్దీవులు. ఆ తర్వాతి స్థానాల్లో దుబాయ్, థాయ్‌లాండ్, అమెరికా బీచ్‌లున్నాయి. అలాగే కోవిడ్ భయంతో పర్యాటక రోజులను గణనీయంగా తగ్గించుకున్నారు. ఈ వేసవిలో 55 శాతం మంది తమ పర్యాటకాన్ని మూడు రోజుల్లోనే ముగించుకున్నారు. కొంతకాలంగా పర్యాటకుల ఆలోచనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని, వారాంతాల్లో అప్పటికప్పుడు దేశంలోని ప్రకృతి ప్రాంతాలను సందర్శించడానికి ఇష్టపడుతున్నారని ఓయో చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ్ పేర్కొన్నారు. కాగా, మన భారతీయులు సగటు పర్యాటక వ్యయాన్ని రూ.10,000లోపు పూర్తి చేయడానికే మొగ్గు చూపుతున్నారని సర్వేలో తేలింది. -
పర్యాటకానికి సరికొత్త విధానం
సాక్షి, సిటీబ్యూరో: రాజస్థాన్ తరహాలో గృహ పర్యాటకం (హోంస్టే) విధానాన్ని హైదరాబాద్ నగరంలో కూడా ప్రవేశ పెట్టేందుకు జీహెచ్ఎంసీ సిద్దమవుతోంది. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు హైదరాబాద్ నగర జీవన విధానం, సాంస్కృతి, సాంప్రదాయాలు తెలియజేయడం ద్వారా నగర ప్రతిష్టను మరింత పెంపొందించే వీలుగా రాష్ట్ర పర్యాటక శాఖతో కలిసి గ్రేటర్ హైదరాబాద్‌లో హోం స్టేను ప్రవేశపెట్టేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళిక రూపొందించింది. హైదరాబాద్ నగరంలో పర్యాటకుల సౌకర్యార్థం అమలు చేయనున్న హోంస్టే విధానంపై శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో పర్యాటక శాఖ కమిషనర్ సునితా భగవత్, ట్రాఫిక్ అడిషనల్ సీపీ జితేందర్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రామకృష్ణా రావు, యుసీడీ భాస్కరాచారి. జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, రఘుప్రసాద్, గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హోం స్టే ద్వారా పర్యాటకులకు నగర జీవన విధానం సాంస్కృతి, సాంప్రదాయాలు అతి దగ్గరగా పరిశీలించే అవకాశం ఏర్పడుతుందన్నారు. నగరంలో అధునిక సౌకర్యాలు, పరిశుభ్ర వాతావరణం కలిగిన గృహాలను హోంస్టేగా ఎంపిక చేయడానికి జీహెచ్ఎంసీ సహకారం కావాలన్నారు. ఇందుకు గాను ఒక రూమ్ నుంచి ఐదు రూమ్‌లు గరిష్టంగా పది పదకల ఇళ్లను హోంస్టేకు ఎంపిక చేసి వీటిలో సిల్వర్, గోల్డ్ విభాగాలుగా ప్రత్యేకించవచ్చన్నారు. ప్రస్తుత హాస్టళ్లు, గెస్ట్ హౌస్‌లు, క్లబ్‌లు, పేయింగ్ గెస్ట్‌లు నివాసాలు హోంస్టే పరిధిలోకి రావని స్పష్టం చేశారు.