మాట్లాడుతున్న కమిషనర్ జనార్దన్ రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: రాజస్థాన్ తరహాలో గృహ పర్యాటకం (హోంస్టే) విధానాన్ని హైదరాబాద్ నగరంలో కూడా ప్రవేశ పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ సిద్దమవుతోంది. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు హైదరాబాద్ నగర జీవన విధానం, సాంస్కృతి, సాంప్రదాయాలు తెలియజేయడం ద్వారా నగర ప్రతిష్టను మరింత పెంపొందించే వీలుగా రాష్ట్ర పర్యాటక శాఖతో కలిసి గ్రేటర్ హైదరాబాద్‌లో హోం స్టేను ప్రవేశపెట్టేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళిక రూపొందించింది. హైదరాబాద్ నగరంలో పర్యాటకుల సౌకర్యార్థం అమలు చేయనున్న హోంస్టే విధానంపై శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో పర్యాటక శాఖ కమిషనర్ సునితా భగవత్, ట్రాఫిక్ అడిషనల్ సీపీ జితేందర్, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ రామకృష్ణా రావు, యుసీడీ భాస్కరాచారి. జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, రఘుప్రసాద్, గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హోం స్టే ద్వారా పర్యాటకులకు నగర జీవన విధానం సాంస్కృతి, సాంప్రదాయాలు అతి దగ్గరగా పరిశీలించే అవకాశం ఏర్పడుతుందన్నారు. నగరంలో అధునిక సౌకర్యాలు, పరిశుభ్ర వాతావరణం కలిగిన గృహాలను హోంస్టేగా ఎంపిక చేయడానికి జీహెచ్‌ఎంసీ సహకారం కావాలన్నారు. ఇందుకు గాను ఒక రూమ్ నుంచి ఐదు రూమ్‌లు గరిష్టంగా పది పదకల ఇళ్లను హోంస్టేకు ఎంపిక చేసి వీటిలో సిల్వర్, గోల్డ్ విభాగాలుగా ప్రత్యేకించవచ్చన్నారు. ప్రస్తుత హాస్టళ్లు, గెస్ట్ హౌస్‌లు, క్లబ్‌లు, పేయింగ్ గెస్ట్‌లు నివాసాలు హోంస్టే పరిధిలోకి రావని స్పష్టం చేశారు.