దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న టాప్ పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. 2022 సంవత్సరానికి సంబంధించి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంచేశాయి. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా.. రెండో స్థానంలో తమిళనాడు ఉంది. అలాగే, కర్ణాటక నాలుగో స్థానంలో.. గుజరాత్ ఐదో స్థానంలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ మాత్రం వరుసగా 2021, 2022లో మూడో స్థానంలో ఉంది. అయితే, 2021 సంవత్సరంతో పోలిస్తే 2022లో ఏపీలో భారీ వృద్ధి నమోదైనట్లు ఆ గణాంకాలు పేర్కొన్నాయి. 2021లో ఆంధ్రప్రదేశ్ 9.32 కోట్ల మంది దేశీయ పర్యాటకులను ఆకర్షించగా 2022లో ఏకంగా 19.27 కోట్ల మందిని ఆకర్షించింది. అంటే 2021తో పోలిస్తే 2022లో దేశీయ పర్యాటకుల సంఖ్య 107 శాతం పెరిగింది. – సాక్షి, అమరావతి
84.76 శాతం పర్యాటకులు ఆ రాష్ట్రాలకే..
ఇక 2022లో దేశీయ పర్యాటకులను ఆకర్షించిన టాప్–10 రాష్ట్రాల్లోనే 84.76 శాతం మంది ఉన్నారని, మిగతా రాష్ట్రాల్లో కేవలం 15.24 శాతం ఉన్నట్లు కేంద్ర పర్యాటక శాఖ తెలిపింది. నిజానికి.. కోవిడ్ కారణంగా 2021లో దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల సంఖ్య తగ్గింది. ఆ ఏడాది దేశం మొత్తం మీద పర్యాటకుల సంఖ్య 67.76 కోట్లు మాత్రమే ఉంది. అదే 2022లో భారీగా పెరిగింది.
ఈ ఏడాది ఆ సంఖ్య మొత్తం 173.10 కోట్లు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. అలాగే, 2021తో పోలిస్తే 2022లో దేశీయ పర్యాటకుల సంఖ్య 155.45 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్ పూర్వ స్థితితో పోలిస్తే దేశీయ పర్యాటకుల వృద్ధి 2022లో 25.45 శాతం క్షీణించిందని.. అయినప్పటికీ 2020, 2021లో కన్నా 2022లో దేశీయ పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు.. 2022లో దేశీయ పర్యాటకులను ఆకర్షించిన టాప్–10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్ కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment