సాక్షి, అమరావతి: దేశంలో టమాటా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 2022–23లో 23.37 లక్షల మెట్రిక్ టన్నుల టమాటాలు ఉత్పత్తి అయ్యాయి. దీంతో దేశం మొత్తం టమాటా ఉత్పత్తిలో రాష్ట్రం వాటా 11.30 శాతంగా నమోదైంది. ఈ మేరకు ఇటీవల టమాటా ధరల పెరుగుదలకు కారణాలు, సమస్యలపై నాబార్డు మంగళవారం నివేదికను విడుదల చేసింది.
ప్రధానంగా దేశంలో టమాటాలు ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో 2022–23లో ఉత్పత్తి భారీగా తగ్గిందని నివేదిక తెలిపింది. అయితే ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోలి్చతే 2022–23లో 1.50 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది.
ఈ రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గడమే కారణం..
ప్రధానంగా టమాల ధరల పెరుగుదలకు గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గడమేనని నాబార్డు తెలిపింది. దీంతో పాటు మేలో అకాల వర్షాలు, జూన్‌లో వర్షాలు, వడగండ్ల వానలకు పంట దెబ్బతిందని వివరించింది. కర్ణాటకలో పంట ప్రధాన ప్రాంతాల్లో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వడగళ్ల వానలకు, జూన్‌లో భారీ వర్షాలకు.. వేసిన పంటలో 70 శాతం నాశనమైందని పేర్కొంది.
అలాగే మహారాష్ట్రలో ఈ ఏడాది వాతావరణ అననుకూల పరిస్థితులు ఉండటంతో పెద్ద ఎత్తున పంట దెబ్బతిందని వెల్లడించింది. దేశంలో టమాటా ఉత్పత్తి 2021–22లో 206.9 లక్షల టన్నులు ఉండగా ఇది 2022–23లో 206.2 లక్షల టన్నులకు తగ్గిందని తెలిపింది. దీంతో ఈ ఏడాది జూలైలో దేశంలో టమాటా ధరలు మూడు రెట్లు పెరిగాయని వివరించింది.
ఈ ఏడాది జూన్‌లో కిలో టమాటా దాదాపు రూ.30 ఉండగా జూలై చివరి నాటికి రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.130కి పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు 10న హోల్‌సేల్‌లో కిలో రూ.106.91 ఉండగా రిటైల్ మార్కెట్‌లో రూ.131.69 ఉందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment