రైతుల కష్టాన్ని నిలువునా దోచేస్తున్న అధికార పార్టీ నేత
ప్రతి లోడుకూ అన్నదాతలు కప్పం కట్టాల్సిందే
పెద్ద లారీకి రూ.2,500, మినీ లారీకి రూ.500 ఫిక్స్
రోజూ 230కు పైగా లారీల దాకా లోడింగ్
నిత్యం రూ.4 లక్షల దాకా అక్రమ వసూళ్లు
ఈ మొత్తం సాయంత్రానికి ముఖ్య ప్రజాప్రతినిధి ఇంటికి
ఇప్పటికే రూ.1.15 కోట్ల దాకా వసూళ్లు
సాక్షి టాస్క్‌ఫోర్స్/రాఫ్తాడు రూరల్: ఓవైపు ఆరుగాలం ఎండనక.. వాననక కష్టపడి పండించుకున్న పంటకు కనీస మద్దతు ధర కూడా లభించక అన్నదాతలు ఆవేదన చెందుతుంటే.. మరోవైపు వారి కష్టాన్ని అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడు నిలువుదోపిడీ చేస్తున్నారు. అధికారంలో ఉండి రైతులను ఆదుకోవాల్సిన ఆయనే రైతుల నుంచి భారీ ఎత్తున పిండుకుంటున్నారు. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి సమీపంలోని టమాట మండీలో అక్రమ వసూళ్లకు తెర తీశారు.
గతంలో టమాట మండీకి వచ్చే వాహనాల నుంచి పంచాయతీ అధికారులు సుంకం వసూలు చేసేవారు. దీనిపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఈ వసూళ్లు నిలిపేశారు. అయితే ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడు రంగంలోకి దిగారు. టమాట మండీకి వచ్చే వాహనాలు కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేశారు.
లోడు చేసుకునే పెద్ద వాహనం నుంచి రూ.2,500, చిన్న వాహనం నుంచి రూ. 500 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మండీ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో వసూళ్లకు దిగారు. మండీ ఓనర్స్ అసోసియేషన్, లారీ ఓనర్స్ అసోసియేషన్, బయ్యర్లు.. ఈ ముగ్గురూ కలిసి చేస్తున్న వివిధ రకాల వసూళ్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
నెల రోజులుగా దందా..
కక్కలపల్లి టమాట మండీలో అధికార పార్టీ నేత సాగిస్తున్న అక్రమ వసూళ్ల దందా నెల రోజులుగా సాగుతోంది. రోజూ రమారమి 230 వాహనాలు లోడింగ్ అవుతున్నాయి. ఇందులో 140 దాకా పెద్దవి, 90 దాకా చిన్న వాహనాలు ఉంటున్నాయి. రోజుకు రూ.3,95,000 చొప్పున ఇప్పటిదాకా రూ.1.15 కోట్లకు పైగా వసూలు చేశారు.
రోజూ వసూలవుతున్న మొత్తం సాయంత్రానికి అధికార పార్టీ ముఖ్య నేత ఇంటికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. కూటమి నేతలు అడిగిన కప్పం కట్టడానికి నిరాకరించినవారికి బెదిరింపులు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. మహారాష్ట్రకు చెందిన ఓ బయ్యర్ కప్పం కట్టేందుకు నిరాకరించడంతో ఆయన్ను బెదిరించి కప్పం కట్టించారు.
నోటీసులను లెక్క చేయని అసోసియేషన్
“టమాట మండీ ఓనర్స్ అసోసియేషన్ చేస్తున్న వసూళ్లు పూర్తిగా చట్ట విరుద్ధం. ప్రభుత్వ అనుమతి లేకుండా పంచాయతీ పరిధిలో ఎలాంటి వసూళ్లు చేయరాదు. అలా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు’ అంటూ కక్కలపల్లి పంచాయతీ కార్యదర్శి గత నెల 22న టమాట మండీ ఓనర్స్ అసోసియేషన్‌కు నోటీసు ఇచ్చారు.
వసూళ్ల నిర్వాకంపై స్వయంగా ఈవోఆర్డీ, డీఎల్‌పీవో, డీపీవోతో పాటు పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. అయినా ఏమాత్రమూ లెక్క చేయకుండా వసూళ్లు చేస్తూనే ఉన్నారు. పైగా ఎవరికి డబ్బులు ఇవ్వొద్దని అధికారులు ఏర్పాటు చేసిన బ్యానర్‌ను కూడా తొలగించేశారు.
రెండో రోజూ రోడ్డెక్కిన టమాట రైతులు
టమాటాలు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అనంతపురంలో రైతులు రెండో రోజు మంగళవారం కూడా రోడ్డెక్కారు. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి టమాట మండీల్లో అసోసియేషన్ నాయకులు నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ వసూళ్లను నిరసిస్తూ బయ్యర్లు రెండురోజులుగా కొనుగోలు ఆపేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు జాతీయ రహదారి–44పై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో అనంతపురం డీఎస్పీ ప్రతాప్ ఆధ్వర్యంలో పోలీసులు రైతులతో మాట్లాడారు.
ఏదైనా ఉంటే మండీ అసోసియేషన్, బయ్యర్లతో కూర్చుని మాట్లాడదామని, వెంటనే ఆందోళన విరమించాలని సూచించారు. దీంతో రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండు రోజులుగా రైతులు రోడ్డెక్కుతున్నా ఏమి న్యాయం చేశారంటూ నిలదీశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకొస్తే బయ్యర్లు కొనేందుకు ముందుకు రావడం లేదన్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ టమాట మండీ వద్దకు చేరుకున్నారు.
మండీ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో ప్రతి లోడుకూ రూ.2,500 అదనంగా వసూలు చేస్తున్న విషయాన్ని కొందరు బయ్యర్లు శ్రీరామ్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ వసూళ్లపై ఎందుకు స్పందించలేదని ఆయనను నిలదీశారు. కాగా బయ్యర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో మంగళవారం వేలం పాట నిలిచిపోయింది. దీంతో ప్రతి రైతుకూ వేలాది రూపాయలు నష్టం వాటిల్లింది.
నెత్తిన గుండేసుకుని చావాలా?
బయ్యర్ల నుంచి ప్రతి లోడుకు డబ్బులు వసూలు చేస్తున్నారు. అది పరిష్కారం అయ్యేదాకా తాము కొనుగోలు చేయబోమని బయ్యర్లు అంటున్నారు. సరుకు తెచ్చిన రైతులు నెత్తిన గుండేసుకుని చావాలా? – తిమ్మప్ప, రాంపురం, ఉరవకొండ మండలంమా గోడు ఎవరికి చెప్పుకోవాలి?
నేను 100 బాక్సుల టమాట తీసుకొచ్చా. రేయంతా కాసుకుని కూర్చున్నా. ఉదయమైతే బయ్యర్లు కొనేందుకు ముందుకు రాలేదు. పంట సాగు చేసినప్పటి నుంచి మండీకి తెచ్చేదాకా రైతులు ఎన్నో అగచాట్లు పడుతున్నారు. మా గోడు ఎవరికి చెప్పుకోవాలి? – మంజునాథ్, కళ్యాణదుర్గం
Comments
Please login to add a commentAdd a comment