
టపాసులతో కాలిన టమాటా క్రేట్లు
దెబ్బతిన్న మరో రైతు భవనం
కురబలకోట: అంతిమ సంస్కారంలో భాగంగా పేల్చిన టపాసులు ఆ మార్గంలో పక్కనే ఉన్న టమాటా క్రేట్లపై పడటంతో అవి అంటుకుని కాలిపోయాయి. క్రేట్లను ఆనుకునే ఉన్న మరో రైతు భవనం ఎగిసిపడిన మంటలకు దెబ్బతింది. ఈ సంఘటనలో రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. స్థానికుల కథనం మేరకు..కురబలకోట మండలం అంగళ్లు గ్రామం మలిపెద్దివారిపల్లెకు చెందిన చిటికి తిప్పారెడ్డి రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు.
ఇతని అంత్యక్రియలు మంగళవారం ఉదయం నిర్వహించారు. ఆఖరి మజిలీ కావడంతో అంతిమ యాత్రను ఘనంగా ముగించాలన్న ఉద్దేశంతో పూలు చల్లుతూ టపాసులు పేలుస్తూ ముందుకు సాగారు. ఆ మార్గంలో పక్కనే ఉన్న టమాటా మండీల వద్ద మదనపల్లెకు చెందిన టమాటాల వ్యాపారి పీఏకె (పి. అహ్మద్ ఖాన్) ముందు రోజు రాత్రి లారీ లోడు టమాటా క్రేట్లు తోలాడు. పేలిన టపాసులు పక్కనే ఉన్న టమాటా క్రేట్లపై నిప్పురవ్వలు పడి అంటుకున్నాయి. ప్లాస్టిక్‌వి కావడంతో మంటలు ఎగిసి పడ్డాయి. మంటలకు అంగళ్లు, పరిసర ప్రాంతాల వారు కలవరపడ్డారు.
అనంతరం మదనపల్లె పైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే క్రేట్లన్నీ కాలిపోయాయి. రూ. 3 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు. క్రేట్లు కాలడంతో వీటిని ఆనుకుని ఉన్న చిటికి హరినాథరెడ్డికి చెందిన భవనం కూడా నల్లగా మారిపోయింది. ప్లాస్టింగ్, కిటీకీలు, గోడలు దెబ్బతిన్నాయి. ఇతని భవనానికి కూడా రూ.2 లక్షలకు పైగా నష్టం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. ఊహించని పరిణామం పట్ల విచారం వ్యక్తమవుతోంది.
∙
Comments
Please login to add a commentAdd a comment