tapasulu
-
అంతిమ యాత్రలో అపశ్రుతి.. రూ.5 లక్షలు నష్టం
కురబలకోట: అంతిమ సంస్కారంలో భాగంగా పేల్చిన టపాసులు ఆ మార్గంలో పక్కనే ఉన్న టమాటా క్రేట్లపై పడటంతో అవి అంటుకుని కాలిపోయాయి. క్రేట్లను ఆనుకునే ఉన్న మరో రైతు భవనం ఎగిసిపడిన మంటలకు దెబ్బతింది. ఈ సంఘటనలో రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. స్థానికుల కథనం మేరకు..కురబలకోట మండలం అంగళ్లు గ్రామం మలిపెద్దివారిపల్లెకు చెందిన చిటికి తిప్పారెడ్డి రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఇతని అంత్యక్రియలు మంగళవారం ఉదయం నిర్వహించారు. ఆఖరి మజిలీ కావడంతో అంతిమ యాత్రను ఘనంగా ముగించాలన్న ఉద్దేశంతో పూలు చల్లుతూ టపాసులు పేలుస్తూ ముందుకు సాగారు. ఆ మార్గంలో పక్కనే ఉన్న టమాటా మండీల వద్ద మదనపల్లెకు చెందిన టమాటాల వ్యాపారి పీఏకె (పి. అహ్మద్ ఖాన్) ముందు రోజు రాత్రి లారీ లోడు టమాటా క్రేట్లు తోలాడు. పేలిన టపాసులు పక్కనే ఉన్న టమాటా క్రేట్లపై నిప్పురవ్వలు పడి అంటుకున్నాయి. ప్లాస్టిక్‌వి కావడంతో మంటలు ఎగిసి పడ్డాయి. మంటలకు అంగళ్లు, పరిసర ప్రాంతాల వారు కలవరపడ్డారు. అనంతరం మదనపల్లె పైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే క్రేట్లన్నీ కాలిపోయాయి. రూ. 3 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు. క్రేట్లు కాలడంతో వీటిని ఆనుకుని ఉన్న చిటికి హరినాథరెడ్డికి చెందిన భవనం కూడా నల్లగా మారిపోయింది. ప్లాస్టింగ్, కిటీకీలు, గోడలు దెబ్బతిన్నాయి. ఇతని భవనానికి కూడా రూ.2 లక్షలకు పైగా నష్టం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. ఊహించని పరిణామం పట్ల విచారం వ్యక్తమవుతోంది. ∙ -
టపాసులు తయారు చేస్తుండగా పేలుళ్లు
నేరేడుచర్ల : నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా పేలుళ్లు సంభవంచి ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాంపురం రోడ్డులో గల ఓ గదిలో కొవ్వూరు సాయిరెడ్డి(22), వల్లంకొండ రాములు (35) కొంత కాలంగా దసరా, దీపావళి పండగలకు అనుమతి లేకుండా బాణా సంచాలు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం బాణా సంచాలు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుళ్లు జరిగాయి. ఈ సంఘటనలో కొవ్వూరు సాయిరెడ్డి, వల్లంకొండ రాములతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బొంతునాల సత్తిబాబు(36)కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద వివరాలు సేకరించారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాయిరెడ్డి, రాములు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ గోపి తెలిపారు.