Ministry of Tourism
-
పర్యాటకుల ఆకర్షణలో జోష్
దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న టాప్ పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. 2022 సంవత్సరానికి సంబంధించి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంచేశాయి. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా.. రెండో స్థానంలో తమిళనాడు ఉంది. అలాగే, కర్ణాటక నాలుగో స్థానంలో.. గుజరాత్ ఐదో స్థానంలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం వరుసగా 2021, 2022లో మూడో స్థానంలో ఉంది. అయితే, 2021 సంవత్సరంతో పోలిస్తే 2022లో ఏపీలో భారీ వృద్ధి నమోదైనట్లు ఆ గణాంకాలు పేర్కొన్నాయి. 2021లో ఆంధ్రప్రదేశ్ 9.32 కోట్ల మంది దేశీయ పర్యాటకులను ఆకర్షించగా 2022లో ఏకంగా 19.27 కోట్ల మందిని ఆకర్షించింది. అంటే 2021తో పోలిస్తే 2022లో దేశీయ పర్యాటకుల సంఖ్య 107 శాతం పెరిగింది. – సాక్షి, అమరావతి 84.76 శాతం పర్యాటకులు ఆ రాష్ట్రాలకే.. ఇక 2022లో దేశీయ పర్యాటకులను ఆకర్షించిన టాప్–10 రాష్ట్రాల్లోనే 84.76 శాతం మంది ఉన్నారని, మిగతా రాష్ట్రాల్లో కేవలం 15.24 శాతం ఉన్నట్లు కేంద్ర పర్యాటక శాఖ తెలిపింది. నిజానికి.. కోవిడ్ కారణంగా 2021లో దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల సంఖ్య తగ్గింది. ఆ ఏడాది దేశం మొత్తం మీద పర్యాటకుల సంఖ్య 67.76 కోట్లు మాత్రమే ఉంది. అదే 2022లో భారీగా పెరిగింది. ఈ ఏడాది ఆ సంఖ్య మొత్తం 173.10 కోట్లు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. అలాగే, 2021తో పోలిస్తే 2022లో దేశీయ పర్యాటకుల సంఖ్య 155.45 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్ పూర్వ స్థితితో పోలిస్తే దేశీయ పర్యాటకుల వృద్ధి 2022లో 25.45 శాతం క్షీణించిందని.. అయినప్పటికీ 2020, 2021లో కన్నా 2022లో దేశీయ పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు.. 2022లో దేశీయ పర్యాటకులను ఆకర్షించిన టాప్–10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్ కూడా ఉన్నాయి. -
కాసేపు నీటిలో.. అంతలోనే గాల్లోకి..
ఏప్రిల్ రెండో వారంలోనే హుస్సేన్‌సాగర్‌లో సీప్లేన్ 10 సీట్ల తేలికపాటి విమానాలు నడిపేందుకు సిద్ధమైన సంస్థలు ఒక్కొక్కరికి రూ. 3వేలు చార్జీ పొరుగు పట్టణాలనూ చుట్టిరావచ్చు ‘డక్ బస్’ నడిపే యోచనలో పర్యాటక శాఖ హైదరాబాద్: కొంచెం సేపు హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుడి విగ్రహం చెంత విహరించి... అంతలోనే గాల్లోకి లేచి హైదరాబాద్ పైన చక్కర్లు కొట్టి.. అవసరమైతే ఏ వరంగల్‌లో, కరీంనగర్నో చుట్టేసి.. మళ్లీ వచ్చి హుస్సేన్‌సాగర్‌లో నీటిపై పడవలా తేలియాడుతూ ఉంటే... భలేగా ఉంటుంది కదూ. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఏప్రిల్ రెండో వారం నుంచి ఈ అనుభూతిని స్వయంగా అనుభవించొచ్చు. అదే ‘సీప్లేన్’... నీటి మీద పడవలా విహరిస్తూ రివ్వున ఆకాశంలోకి దూసుకుపోయే తేలికపాటి చిన్న విమానం. ఇప్పటివరకు అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమైన ‘సీప్లేన్’ హైదరాబాద్‌లో కొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తోంది. హెలీటూరిజంలో భాగంగా గగనతలం నుంచి హైదరాబాద్ అందాలను హెలికాప్టర్ ద్వారా వీక్షించే అవకాశాన్ని కల్పించిన పర్యాటక శాఖ... అదే ఊపులో ‘సీప్లేన్’నూ రంగంలోకి దింపుతోంది. పౌర విమానయాన శాఖ అనుమతి వస్తే ఏప్రిల్ 15 నుంచి దాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హెలికాప్టర్ రైడ్ కంటే తక్కువే పర్యాటకులను ఆకట్టుకొనేందుకు అండమాన్‌లో స్థానిక యంత్రాంగం ‘సీప్లేన్’ను నడుపుతోంది. ఇది త్వరలోనే ముంబై, కొచ్చిన్, గోవాల్లో కూడా అందుబాటులోకి వస్తోంది. తాజాగా హైదరాబాద్‌కూ రానుంది. హైదరాబాద్‌లో పది సీట్లుండే ‘సీప్లేన్’ను నడిపేందుకు కొచ్చిన్, ఢిల్లీ కేంద్రాలుగా ఉన్న రెండు సంస్థలు ముందుకొచ్చాయి. 800 మీటర్ల వెడల్పు, కిలోమీటరు రన్‌వేకు తగ్గ నీటి వైశాల్యం, 2 మీటర్ల లోతుంటే సీప్లేన్ నడిపేందుకు అవకాశం ఉంటుంది. ఇటీవల ఆ రెండు సంస్థల సిబ్బంది వచ్చి హుస్సేన్‌సాగర్‌ను పరిశీలించి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అందులో విహరిస్తూ హైదరాబాద్ అందాలను ఆకాశం నుంచి వీక్షించాలంటే ఒక్కొక్కరు రూ.3 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇటీవల మొదలుపెట్టిన హెలికాప్టర్ రైడ్ కంటే తక్కువ కావడం విశేషం. హైవేలపై ‘మిడ్వే’లు: చందూలాల్ దూర ప్రయాణాల మధ్యలో పర్యాటకులు సేదతీరేందుకు జాతీయ, రాష్ట్ర హైవేల పక్కన ‘మిడ్ వే (హైవేలపై పలు సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లు)’లను ఏర్పాటు చేయనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ప్రకటించారు. గురువారం ఆయన పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘మిడ్ వే’లలో విశ్రాంతి గదులు, రెస్టారెంట్లు, నిత్యావసర వస్తువుల దుకాణాలు, పెట్రోలు బంకులను ఏర్పాటు చేస్తామని... తొలి విడతగా సిద్దిపేట, జడ్చర్లలో వీటిని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఇక పర్యాటక ప్రదేశాల్లో ఆయా ప్రాంతాల చారిత్రక వైభవాన్ని చాటిచెప్పేలా ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పా రు. వరంగల్‌లో కాకతీయ ఉత్సవాలు, వేములవాడలో చాళుక్యుల ఉత్సవాలు, కరీంనగర్లో శాతవాహన ఉత్సవాలు, హైదరాబాద్‌లో గోల్కొండ ఉత్సవాల వంటివి ఉంటాయన్నారు. త్వరలోనే నూతన భాషా, సాంస్కృతిక, పర్యాటక విధానాన్ని ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఆయా విభాగాల వార్షిక క్యాలెం డర్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా పర్యాటకుల కోసం హైదరాబాద్‌లో ‘షీక్యాబ్’లను సిద్ధం చేయాలని సూ చించారు. ఆసక్తి ఉన్నవారికి పేరిణి నృత్యంలో శిక్షణ ఇవ్వాలని, రవీంద్రభారతి మరమ్మతులను ఈనెల 24 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలో డక్ బస్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా నీటిలోకి దూసుకుపోతే..? సాధారణ బస్సు అయితే ప్రమాదమేగానీ... ‘డక్ బస్’ అయితే మాత్రం హాయిగా కేరింతలు కొట్టొచ్చు. ఈ బస్సులో రోడ్డుపై ప్రయాణించడమే కాదు నీటిలో పడవలా కూడా విహరిస్తుంది. ఇప్పటివరకు మన దేశంలో ఇలాంటి బస్సు లేదు. త్వరలో హుస్సేన్‌సాగర్‌లో ‘డక్ బస్సు’లో విహరించే అవకాశాన్ని పర్యాటక శాఖ కల్పించనుంది. -
ఫారిన్ టూరిస్టులకు ఫ్రీ సిమ్ కార్డులు
భారతదేశంలో పర్యటించేందుకు వచ్చే విదేశీయులకు ప్రభుత్వం ఫ్రీ సిమ్ కార్డులను అందజేయనుంది. ఈ మేరకు పర్యాటక మంత్రిత్వశాఖ త్వరలో చర్యలు తీసుకోనుంది. విదేశీ టూరిస్టులను ఆకర్షించడమే కాకుండా వారికి సెక్యూరిటీని కల్పించడం కూడా ఈ ఆలోచన యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని ప్రభుత్వ అధికారులు వెల్లడిస్తున్నారు. పర్యాటక, హోమ్ , టెలికం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ప్రస్తుతం దీనిపై కసరత్తు మొదలుపెట్టాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులను విదేశీ పర్యాటకులకు ఉచితంగా మంజూరు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం కాగా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై ఓ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. అంతర్జాతీయ పర్యాటకులకు ఇక్కడ లోకల్ సిమ్ కార్డులు దొరకడం కాస్త కష్టమైన విషయమే, వారి సౌకర్యార్థమే కాకుండా భద్రతా కారణాల రీత్యా కూడా ప్రభుత్వం సిమ్ కార్డులను ఉచితంగా మంజూరు చేయాలనుకోవడం ఓ మంచి ఆలోచన అని అన్నారు. ఈ సిమ్ కార్డును ప్రభుత్వం అందజేసే టూరిస్ట్ కిట్‌తో పాటే పర్యాటకులకు అందించనున్నారు. సాధారణంగా టూరిస్ట్ కిట్లలో మ్యాప్‌లు, టూరిజం బుక్ లెట్లు, ఎమర్జెన్సీ నెంబర్లు, గమ్యానికి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది. వీటితోపాటే లోకల్ సిమ్ కార్డును కూడా అందించడం ద్వారా విదేశీయులు మరింత సౌకర్యవంతంగా,నిరంతరాయంగా తమ హాలిడేను కొనసాగించవచ్చని అధికారులు వెల్లడించారు. కాగా విదేశీ పర్యాటకులకు భారత ప్రభుత్వం సులువైన పద్ధతిలో వీసాలను మంజూరును మొదలుపెట్టింది. టూరిస్ట్ వీసా కోసం విదేశీ పర్యాటకులు ఆన్ లైన్లోనే అప్లై చేయవచ్చు. ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండానే దరఖాస్తు అప్రూవ్ అయిన తర్వాత ప్రభుత్వం పంపించే ఈ-మొయిల్ ప్రింట్ అవుట్ మీద భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు వేసే స్టాంపుతో విదేశీయులు ఇండియాలో పర్యటించగలరు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ తరహా 'ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసా' పద్ధతిని 2015 ఏప్రిల్ లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇండియా 113 దేశాల పర్యాటకులకు ఈ సౌకర్యం కల్పిస్తుంది. మార్చి 31, 2016 వరకు 150 దేశాలకు ఈ సేవలు విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత ఇండియాలో పర్యటించే విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. లెక్కల ప్రకారం యూకే పౌరులు అధికంగా భారతదేశాన్ని సందర్శిస్తుండగా ఆ తరువాతి స్థానాల్లో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. -
ఐటీడీసీ సీఎండీగా ఉమాంగ్ నరులా
ముంబై: ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉమాంగ్ నరులా నియమితులయ్యారు. పర్యాటక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి గిరీశ్ శంకర్ ఇప్పటిదాకా ఐటీడీసీ మేనేజింగ్ డెరైక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. నరులా గతంలో జమ్మూకశ్మీర్ ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేశారు. -
ఏపీ, తెలంగాణలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి: యశోనాయక్
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణల్లో పలు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ తెలిపారు. 2014-15లో అభివృద్ధి చేసే ఈ కేంద్రాల వివరాలను బుధవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా అందచేశారు. మెగా సర్య్యూట్ కింద కొండపల్లి-ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు, సర్క్యూట్ కింద గుంటూరు జిల్లాలోని గుత్తికొండ బిలం గుహలు-పిడుగురాళ్ల-కొండవీడు ఖిల్లా-కోటప్పకొండ దేవాలయం, శ్రీకాకుళంలోని బుద్ధిస్ట్ సర్క్యూట్‌తో పాటు, పర్యాటక గమ్యస్థానాల కింద నాగార్జునసాగర్ అభివృద్ధి, శ్రీకాళహస్తిలో సౌండ్ అండ్ లైట్ షో, పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలం బీచ్‌ను అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. పర్యాటక మంత్రిత్వశాఖ గుర్తించిన ప్రాజెక్టుల్లో సర్క్యూట్-1లో విశాఖపట్నం-విజయనగరం-శ్రీకాకుళం, సర్క్యూట్-2లో హైదరాబాద్-నల్లగొండ-వరంగల్-కరీంనగర్-ఆదిలాబాద్, సర్క్యూట్-3లో తూర్పుగోదావరి-ఖమ్మం-పశ్చిమ గోదావరి-కృష్ణ-గుంటూరు, సర్క్యూట్-4లో చిత్తూరు-నెల్లూరు-అనంతపురం-కడప జిల్లాలు ఉన్నట్టు తెలిపారు. -
భాగ్యనగరానికి మరో మణిహారం..!
హైదరాబాద్‌లో రూ.150 కోట్లతో భారీ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ ముందుకొచ్చిన చెన్నై సంస్థ... సీఎస్ అనుమతికోసం ఫైల్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరనుంది. నగరంలో అంతర్జాతీయ స్థాయిలో భారీ మల్టీప్లెక్స్ ప్రాజెక్టు రూపొందనుంది. హుస్సేన్‌సాగర తీరాన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో గతంలో రూపొందిన ప్రసాద్ ఐమాక్స్‌ను మించిన హంగులతో దీన్ని నిర్మించేందుకు పర్యాటక శాఖ ప్రణాళిక రూపొందించింది. లోయర్‌ట్యాంక్‌బండ్‌లో ఇందిరాపార్కు పక్కన రెండెకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. చెన్నైకు చెందిన ఓ ప్రముఖ థియేటర్స్ గ్రూపు సంస్థ రూ. 150 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దాదాపు ఏడు అంతస్తుల భవన సముదాయంలో ఓ బిగ్ స్క్రీన్ సహా ఐదు థియేటర్లు ఉంటాయి. వీటితోపాటు ఫుడ్ కోర్టులు, పిల్లల గేమింగ్ జోన్, ఇతర రిక్రియేషన్ సెంటర్లు ఉంటాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం టెండర్లు పిలవగా చెన్నైకు చెందిన సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేసింది. రెండు రోజుల క్రితమే టెక్నికల్ బిడ్ తె రిచిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ.. ఒకే బిడ్ దాఖలు కావటంతో దానిని ఆమోదించే విషయంలో అధికారులు తటపటాయిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు బిడ్ దాఖలు చేసిన సంస్థ చెన్నైలో దాదాపు 50 వరకు థియేటర్లను అద్భుతంగా నిర్వహిన్నందున దానిని పీపీపీలో కలుపుకోవటం వల్ల హైదరాబాద్ ప్రాజెక్టు మెరుగ్గా రూపొందుతుందని అధికారులు పేర్కొం టున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందుంచాలని నిర్ణయించారు. అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాతే ఫైనాన్షియల్ బిడ్ తెరవాలని భావిస్తున్నారు. పర్యాటక శాఖకు భారీ ఆఫర్.. చెన్నై సంస్థకు ఈ ప్రాజెక్టును అప్పగిస్తే ఆర్థికంగా పర్యాటక శాఖకు భారీ ఆఫర్‌నే ప్రకటించినట్టు తెలుస్తోంది. అడిషనల్ డెవలప్మెంట్ ప్రీమియంగా రూ. 1.48 కోట్లు, లీజ్ రెంట్గా రూ. 1.78 కోట్లతోపాటు లాభాలపై 5.4 శాతం వాటా ఇచ్చేందుకు ఆ సంస్థ సిద్ధపడిందని అధికారులు పేర్కొంటున్నారు. కేవలం లాభాలలో వాటా ద్వారానే ప్రతి నెలా రూ. 10 లక్షలు మించి వచ్చిపడే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఇది లాభదాయకమైన ప్రాజెక్టు అయినందున వీలైనంత వరకు సీఎస్‌తో ఆమోదముద్ర వేయించుకోవాలని భావిస్తున్నారు.