కాసేపు నీటిలో.. అంతలోనే గాల్లోకి.. | "Duck Bus' runs in the policy of the Department of Tourism | Sakshi
Sakshi News home page

కాసేపు నీటిలో.. అంతలోనే గాల్లోకి..

Published Fri, Mar 11 2016 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

కాసేపు నీటిలో.. అంతలోనే గాల్లోకి..

కాసేపు నీటిలో.. అంతలోనే గాల్లోకి..

ఏప్రిల్ రెండో వారంలోనే హుస్సేన్‌సాగర్‌లో సీప్లేన్
10 సీట్ల తేలికపాటి విమానాలు నడిపేందుకు సిద్ధమైన సంస్థలు
ఒక్కొక్కరికి రూ. 3వేలు చార్జీ
పొరుగు పట్టణాలనూ చుట్టిరావచ్చు
‘డక్ బస్’ నడిపే యోచనలో పర్యాటక శాఖ

 
హైదరాబాద్: కొంచెం సేపు హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుడి విగ్రహం చెంత విహరించి... అంతలోనే గాల్లోకి లేచి హైదరాబాద్ పైన చక్కర్లు కొట్టి.. అవసరమైతే ఏ వరంగల్లో, కరీంనగర్‌నో చుట్టేసి.. మళ్లీ వచ్చి హుస్సేన్‌సాగర్‌లో నీటిపై పడవలా తేలియాడుతూ ఉంటే... భలేగా ఉంటుంది కదూ. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఏప్రిల్ రెండో వారం నుంచి ఈ అనుభూతిని స్వయంగా అనుభవించొచ్చు. అదే ‘సీప్లేన్’... నీటి మీద పడవలా విహరిస్తూ రివ్వున ఆకాశంలోకి దూసుకుపోయే తేలికపాటి చిన్న విమానం. ఇప్పటివరకు అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమైన ‘సీప్లేన్’ హైదరాబాద్‌లో కొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తోంది. హెలీటూరిజంలో భాగంగా గగనతలం నుంచి హైదరాబాద్ అందాలను హెలికాప్టర్ ద్వారా వీక్షించే అవకాశాన్ని కల్పించిన పర్యాటక శాఖ... అదే ఊపులో ‘సీప్లేన్’నూ రంగంలోకి దింపుతోంది. పౌర విమానయాన శాఖ అనుమతి వస్తే ఏప్రిల్ 15 నుంచి దాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
హెలికాప్టర్ రైడ్ కంటే తక్కువే
 పర్యాటకులను ఆకట్టుకొనేందుకు అండమాన్‌లో స్థానిక యంత్రాంగం ‘సీప్లేన్’ను నడుపుతోంది. ఇది త్వరలోనే ముంబై, కొచ్చిన్, గోవాల్లో కూడా అందుబాటులోకి వస్తోంది. తాజాగా హైదరాబాద్‌కూ రానుంది. హైదరాబాద్‌లో పది సీట్లుండే ‘సీప్లేన్’ను నడిపేందుకు కొచ్చిన్, ఢిల్లీ కేంద్రాలుగా ఉన్న రెండు సంస్థలు ముందుకొచ్చాయి. 800 మీటర్ల వెడల్పు, కిలోమీటరు రన్‌వేకు తగ్గ నీటి వైశాల్యం, 2 మీటర్ల లోతుంటే సీప్లేన్ నడిపేందుకు అవకాశం ఉంటుంది. ఇటీవల ఆ రెండు సంస్థల సిబ్బంది వచ్చి హుస్సేన్‌సాగర్‌ను పరిశీలించి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అందులో విహరిస్తూ హైదరాబాద్ అందాలను ఆకాశం నుంచి వీక్షించాలంటే ఒక్కొక్కరు రూ.3 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇటీవల మొదలుపెట్టిన హెలికాప్టర్ రైడ్ కంటే తక్కువ కావడం విశేషం.
 
హైవేలపై ‘మిడ్‌వే’లు: చందూలాల్

 దూర ప్రయాణాల మధ్యలో పర్యాటకులు సేదతీరేందుకు జాతీయ, రాష్ట్ర హైవేల పక్కన ‘మిడ్ వే (హైవేలపై పలు సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లు)’లను ఏర్పాటు చేయనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ప్రకటించారు. గురువారం ఆయన పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘మిడ్ వే’లలో విశ్రాంతి గదులు, రెస్టారెంట్లు, నిత్యావసర వస్తువుల దుకాణాలు, పెట్రోలు బంకులను ఏర్పాటు చేస్తామని... తొలి విడతగా సిద్దిపేట, జడ్చర్లలో వీటిని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఇక పర్యాటక ప్రదేశాల్లో ఆయా ప్రాంతాల చారిత్రక వైభవాన్ని చాటిచెప్పేలా ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పా రు. వరంగల్‌లో కాకతీయ ఉత్సవాలు, వేములవాడలో చాళుక్యుల ఉత్సవాలు, కరీంనగర్‌లో శాతవాహన ఉత్సవాలు, హైదరాబాద్‌లో గోల్కొండ ఉత్సవాల వంటివి ఉంటాయన్నారు. త్వరలోనే నూతన భాషా, సాంస్కృతిక, పర్యాటక విధానాన్ని ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఆయా విభాగాల వార్షిక క్యాలెం డర్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా పర్యాటకుల కోసం హైదరాబాద్‌లో ‘షీక్యాబ్’లను సిద్ధం చేయాలని సూ చించారు. ఆసక్తి ఉన్నవారికి పేరిణి నృత్యంలో శిక్షణ ఇవ్వాలని, రవీంద్రభారతి మరమ్మతులను ఈనెల 24 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
 
త్వరలో డక్ బస్

 రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా నీటిలోకి దూసుకుపోతే..? సాధారణ బస్సు అయితే ప్రమాదమేగానీ... ‘డక్ బస్’ అయితే మాత్రం హాయిగా కేరింతలు కొట్టొచ్చు. ఈ బస్సులో రోడ్డుపై ప్రయాణించడమే కాదు నీటిలో పడవలా కూడా విహరిస్తుంది. ఇప్పటివరకు మన దేశంలో ఇలాంటి బస్సు లేదు. త్వరలో హుస్సేన్‌సాగర్‌లో ‘డక్ బస్సు’లో విహరించే అవకాశాన్ని పర్యాటక శాఖ కల్పించనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement