‘రాడార్’కు స్థలం దొరికిందోచ్..
సాక్షి, ముంబై: వర్షాకాలంలో వాతావరణ వివరాలు పూర్తిగా రాబట్టేందుకు మరో ‘వెదర్ డాప్లార్ రాడార్’ యంత్రాన్ని బిగించేందుకు స్థలం కోసం అన్వేషణ ప్రారంభించారు. అందుకు గోరేగావ్‌లోని ఆరే కాలనీ అటవీ ప్రాంతం లేదా పవయి జలాశయం పరిసరాల్లోని అటవీ ప్రాంతం తెరమీదకు వచ్చాయి. ఇందులో ఓ ప్రాంతాన్ని ఎంపికచేసి అక్కడ డాప్లార్ రాడార్‌ను ఏర్పాటు చేయాలని వాతావరణ శాఖ యోచిస్తోంది. 2005 జూలై 26న కురిసిన భారీ వర్షాలు నగరం, శివారు ప్రాంతాలను ముంచెత్తిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో వాతావరణ శాఖకు వివరాలు తెలియజేసే డాప్లార్ రాడార్ అందుబాటులో లేకపోవడంవల్ల స్థానికులకు సరైన సమాచారం అందించలేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. దాంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన వె దర్ డాప్లార్ రాడార్ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత శాంతాకృజ్ విమానాశ్రయం పరిసరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు భారీ టవర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దాంతో విమానాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతాయనే భయంతో మరోచోట ఏర్పాటు చేయాలని సంకల్పించారు. చివరకు నేవీ నగర్ పరిసరాల్లోని 17 అంతస్తుల అర్చన భ వనం టెరెస్‌పై డాప్లార్‌ను ఏర్పాటు చేశారు. అయితే దీనివల్ల భవనంలో ఉంటున్నవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అంతేగాకా సదరు భవనం చుట్టూ ఉన్న ఎతైన భవనాలవల్ల రాడార్‌కు వాతావరణానికి సంబంధించిన పూర్తి సమాచారం లభించడంలేదు. దీంతో పవయి లేదా ఆరే కాలనీ అటవీ ప్రాంతంలో మరో రాడార్ డాప్లార్‌ను ఏర్పాటు చేయాలనే అంశం రాష్ట్ర ప్రభుత్వం, వాతావరణ శాఖ తెరమీదకు తీసుకువచ్చాయి. అందుకు ఏడు ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో పవయి, ఆరే కాలనీ ప్రాంతాలకు వాతావరణ శాఖ ప్రాధాన్యతనిచ్చింది. ఈ నెల 17వ తేదీ(గురువారం) నుంచి ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న కొండలపై సాంకేతిక సిబ్బంది అధ్యయనం చేస్తారు. ఇందులో సౌకర్యాలను బట్టి ఓ ప్రాంతాన్ని ఎంపికచేసి అనంతరం అక్కడ యంత్రాన్ని ఏర్పాటు చేస్తామని ముంబై వాతావరణ శాఖ డిప్యూటీ డెరైక్టర్ కృష్ణానంద్ హోసాలికర్ చెప్పారు.