మొరాయించిన డాప్లర్ రాడార్
నెల రోజులుగా పనిచేయని వైనం
మరమ్మతులు చేపట్టండి:
వాతావరణ శాఖకు బీఎంసీ లేఖ
సాక్షి, ముంబై : వాతావరణ వివరాలు తెలిపేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఏర్పాటుచేసిన ‘వెదర్ డాప్లర్ రాడార్’ నెల రోజులుగా మొరాయిచింది. దీంతో నగరానికి సంబంధించిన వాతావరణ వివరాలు తెలియక బీఎంసీ ఇబ్బందిపడుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముందుస్తు సమాచారం లేకపోవడంతో బీఎంసీ అత్యవసర విభాగం ఉరుకులు పరుగులు తీయాల్సి వచ్చింది. దీంతో వెంటనే రాడార్‌కు మరమ్మతులు చేయాలని వాతావరణ శాఖకు బీఎంసీ లేఖ రాసింది. డాప్లర్ రాడార్ ద్వారా 500 కి.మీ. పరిధిలోని తుఫాను, వర్షాలు, ఇతర వాతావరణ వివరాలు అందిస్తుంది. అయితే నెల రోజుల నుంచి రాడార్ పనిచేయకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బీఎంసీ అత్యవసర విభాగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోయింది.
2005 జూలై 26న నగరంలో భారీ వరదలు రావడంతో 200 మంది ప్రజలు చనిపోయారు. రూ. కోట్లల్లో ఆస్తి నష్టం వాటిళ్లింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని ముంబైలో రెండు ప్రాంతాల్లో వెదర్ డాప్లర్ రాడర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2010లో నేవీ నగర్‌లో అర్చన భవనంపై రూ. 12 కోట్లతో రాడార్ ఏర్పాటు చేసింది. మరో రాడార్ ఏర్పాటుకు ఇంత వరకు అనువైన స్థలం లభించకపోవడంతో అది అలాగే ఉండిపోయింది. అయితే నెల రోజులుగా రాడార్ పని చేయకపోవడంతో వాతావరణ శాఖ వెల్లడించే సమాచారంపైనే ఆధారపడాల్సి వస్తోందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.