సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయించండి: కేంద్రం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత స్థాయి అధికారుల క్యాడర్ కేటాయింపులపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్(డీవోపీటీ)దే పూర్తి అధికారమని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అఖిల భారత స్థాయి అధికారుల కేటాయింపులకు సంబంధించి ఐదుగురు సభ్యులతో వేసిన ప్రత్యేక కమిటీ సిఫార్సుల మేరకే ఏపీ, తెలంగాణకు కేటాయింపులు చేశామని తెలిపారు. తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు.
సోమేశ్ పిటిషన్‌ను విచారించిన క్యాట్... ఆయన్ను తెలంగాణకు కేటాయిస్తూ గతంలో ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూరేపల్లి నందలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఏపీకి కేటాయించిన 15 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించి తెలంగాణకు కేటాయించేలా ఉత్తర్వులు పొందారని తెలిపారు. క్యాట్ ఉత్తర్వులను రద్దు చేసి సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయించేలా ఆదేశించాలని అదనపు సొలిసిటర్ జనరల్ కోరారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం వాదనలు కొనసాగనున్నాయి.