ప్రైవేట్‌కు పండుగ
సెలవుల వారం ..
=సొంత ఊర్లకు నగర వాసులు
=ప్రైవేట్ బస్సుల నిలువు దోపిడీ
=పండుగ సీజన్లో చార్జీలు రెండింతలు
=ప్రయాణికుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్న యాజమాన్యం
=10 శాతం అధికంగా చార్జ చేస్తున్న కేఎస్ ఆర్టీసీ
=‘ప్రత్యేకం’ పేరుతో వడ్డన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దసరా పండుగ సీజన్‌ను ప్రైవేట్ బస్సులు చక్కగా ‘సద్వినియోగం’ చేసుకుంటున్నాయి. పండుగలకు ఊర్లకు వెళ్లాలని తహతహలాడుతున్న ప్రయాణికుల నుంచి రెండింతల చార్జీలను వసూలు చేస్తున్నాయి. కేఎస్ఆర్టీసీ మాత్రం ఎప్పటిలాగే రద్దీ సీజన్లో అదనంగా పది శాతం వసూలు చేస్తోంది. దసరా సెలవులతో పాటు బక్రీద్, వాల్మీకి జయంతి కలసి రావడంతో ప్రయాణికుల రద్దీ అధికమైంది. రెండో శనివారం, ఆదివారం, విజయ దశమి (సోమవారం), బక్రీద్ (మంగళవారం)తో పాటు మరో మూడు రోజులు ప్రభుత్వోద్యోగులు
ప్రైవేట్‌కు పండుగ
సెలవు పెడితే వచ్చే వారం అంతా ఊర్లలోనే గడపవచ్చు. చాలా మంది పర్యాటక స్థలాల సందర్శనకు వెళుతున్నారు. దీని వల్ల ఆర్టీసీ ఎన్ని అదనపు బస్సులు నడిపినా చాలడం లేదు. శుక్రవారం రాత్రి దాదాపుగా ప్రయాణికులందరూ గమ్య స్థానాలకు బయలుదేరారు. మంగళూరుకు ఆర్టీసీ వోల్వో మల్టీ-యాక్సిల్ బస్సులో చార్జీ రూ.740 కాగా ప్రైవేట్ బస్సులో రూ.1,100 వసూలు చేశారు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే గోవా (పనాజీ)కు ప్రైవేట్ బస్సులో చార్జీ రూ.2,500 కాగా ఆర్టీసీలో రూ.840. రద్దీ దృష్ట్యా గోవాకు ఆర్టీసీ 17 ప్రత్యేక వోల్వో బస్సులను నడుపుతోంది. ఇందులో ఛార్జీ రూ.1,304గా నిర్ణయించారు.
ఆర్టీసీ ఈ పండుగ సీజన్‌కు గాను రిజర్వేషన్ సౌకర్యంతో 300 బస్సులను, రిజర్వేషన్ లేకుండా 700 బస్సులను నడుపుతోంది. ఇవి కాకుండా మైసూరు దసరా కోసం 200 అదనపు బస్సులను నడుపుతున్నారు. ఆదివారం వరకు వివిధ గమ్య స్థానాలకు అదనపు బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మెజిస్టిక్ బస్ స్టేషన్లో మెట్రో రైలు పనులు జరుగుతున్నందున, అదనపు బస్సులను విజయనగర టీటీఎంసీ, నవరంగ్, మైసూరు రోడ్డు శాటిలైట్ బస్ స్టేషన్, బనశంకరి టీటీఎంసీ, మల్లేశ్వరం 18వ క్రాస్, జయనగర నాలుగో బ్లాక్, గంగా నగరల నుంచి నడపనున్నట్లు వివరించారు. బస్సును ఎక్కడ ఎక్కాలో టికెట్‌పై నిర్దేశించారు. రిజర్వేషన్ లేకుండా నడుపుతున్న బస్సులన్నీ మెజిస్టిక్ నుంచి బయలుదేరుతాయి.