ఒకటి కాదు ఏకంగా 12 సింహాలు వచ్చాయి..
న్యూఢిల్లీ: రోడ్డుపై అకస్మాత్తుగా ఓ సింహం ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? జనం భయంతో పరుగులు పెడతారు..! అలాంటిది ఏకంగా 12 సింహాలు గుంపుగా వస్తే..!? పరిస్థితిని ఊహించలేం కదూ..! గుజరాత్లోని ఓ హైవేపై ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.
పిపవావ్-రాజుల హైవేను దాటి మరోవైపు వెళ్లేందుకు అటవీ ప్రాంతం నుంచి 12 సింహాలు గుంపుగా వచ్చాయి. వీటిని చూడగానే కొందరు వాహానదారులు భయపడగా.. మరికొందరు యువకులు ధైర్యం చేసి మొబైల్ ఫోన్లతో ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఉత్సాహం చూపారు. గత శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనను ఓ డ్రైవర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. హైవేపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో సింహాలు రోడ్డు దాటేందుకు కొంత సమయం పట్టింది. సింహాలు మొదట హైవేపైకి రాగానే ఓ వైపు లేన్లలో వాహానాలను ఆపివేశారు. కాగా హైవేపై డివైడర్ ఎత్తుగా ఉండటంతో అటుపక్క లేన్లలో వస్తున్న వారికి సింహాలు కనపడకపోవడంతో వాహనాలను ఆపలేదు. సింహాలు నెమ్మదిగా డివైడర్ ఎక్కి రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా, అటువైపు వస్తున్నవారు వాహనాలను ఆపి అవి వెళ్లేందుకు దారి ఇచ్చారు. సింహాలు రావడంతో హైవేపై దాదాపు 15 నిమిషాల పాటు ట్రాఫిక్ ఆగిపోయింది. సింహాలన్నీ రోడ్డు దాటిన తర్వాత ట్రాఫిక్ క్లియరైంది. కాగా ఓ సింహం రోడ్డు దాటలేక వెనక్కు వెళ్లిపోయింది. గతంలో ఈ ప్రాంతంలో రోడ్డు, రైల్వే లైన్ దాటుతూ చాలా సింహాలు ప్రమాదాల్లో మరణించాయి.