రాష్ట్రంలో పెట్టుబడులకు డీపీ వరల్డ్ ఆసక్తి
సాక్షి, అమరావతి: పోర్టులు, లాజిస్టిక్ పార్కులు, పారిశ్రామిక పార్కులు నిర్వహించే దుబాయ్‌కు చెందిన డీపీ వరల్డ్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న నాలుగు పోర్టుల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆసక్తి చూపుతోంది. దుబాయ్ ఎక్స్పో 2020లో భాగంగా దుబాయ్ పర్యటనలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని బృందం డీపీ వరల్డ్ అభివృద్ధి చేసిన జెబెల్ అలీ పోర్టును పరిశీలించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎగుమతుల కోసం ఒకేసారి 10 లక్షల కార్లను నిలిపే సామర్థ్యంతో ఈ పోర్టును అభివృద్ధి చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు.. రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి డీపీ వరల్డ్ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు మంత్రి మేకపాటి తెలిపారు.
భారత రాయబార కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రోడ్ షో
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలపై మంత్రి మేకపాటి అబుదాబీలోని భారత రాయబార కార్యాలయంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ప్రోత్సాహానికి అనుసరిస్తున్న విధానాలను వివరించారు. రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల కల్పనలో ఉన్న ముబదల గ్రూపు, ఐటీ రంగానికి చెందిన జీ42 ప్రతినిధులు మంత్రితో సమావేశమై రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, మిడిల్ ఈస్ట్ అండ్ ఫార్ ఈస్ట్ ప్రత్యేక ప్రతినిధి జుల్ఫీ రావ్జీ, ఏపీఐఐసీ ౖచైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ మారిటైమ్ డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్ బాబు, పరిశ్రమల శాఖ, ఏపీఈడీబీ, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.
తబ్రీవ్ ఏషియాతో ఒప్పందం
దుబాయ్ ఎక్స్పో 2020లో రూ.3,000 కోట్ల విలువైన పెట్టుబడులకు ఇప్పటికే మూడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, గోడౌన్ల నిర్మాణం, ఉష్ణోగ్రతలను తగ్గించే టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేసేందుకు అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏషియా పరిశ్రమతో మరో కీలక ఒప్పందాన్ని కుదర్చుకుంది. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ సమక్షంలో ఏపీఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, తబ్రీవ్ ఏషియా సీడీవో (చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్) ఫ్రాన్ కో–యిస్ జావియర్ బాల్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అనంతరం మంత్రి అబుదాబీలోని ఉక్కు కంపెనీ కొనరస్ను సందర్శించారు. ఉక్కు తయారీ విధానాన్ని పరిశీలించారు. వైఎస్సార్ కడప జిల్లాలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్‌తో పాటు రాష్ట్రంలో ఇతర పెట్టుబడుల అవకాశాలను కొనరస్ ప్రతినిధులకు మంత్రి వివరించారు. ఇంక్యుబేషన్ సెంటర్లు సహా వెబినార్, రోడ్ షోల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌కు సహకరించేందుకు అబుదాబీ గ్లోబల్ మార్కెట్, ఫైనాన్షియల్ మార్కెట్ సంస్థ ఏజీడీఎం సంసిద్ధత వ్యక్తం చేసింది.