డీపీసీ ఏకగ్రీవం
సాక్షి, సంగారెడ్డి:మంత్రి హరీష్‌రావు వ్యూహం ఫలించింది. జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. డీపీపీ ఎన్నికల బరిలో నిలిచిన 27 మంది అభ్యర్థులు తమ నామినేషన్ల మంగళవారం ఉపసంహరించుకున్నారు. దీంతో డీపీసీ ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీతోపాటు జెడ్పీలో ఆ పార్టీకి మద్దతుగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు 19 మందికి జిల్లా ప్రణాళిక కమిటీలో స్థానం లభించింది. ఏకగ్రీవానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు జెడ్పీటీసీలకు డీపీసీలో చోటు దక్కింది. డీపీసీ ఎన్నికలు ఏకగ్రీవం కావటంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.
ఉదయం నుంచే ఉపసంహరణలు
జిల్లా ప్రణాళిక కమిటీలో నలుగురు కౌన్సిలర్లు, 20 మంది జెడ్పీటీసీ సభ్యుల ఎన్ని క కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో కౌన్సిలర్ సభ్యుల స్థానాలకు 10, జెడ్పీటీసీ సభ్యుల స్థానాలకు 42 మంది జెడ్పీటీసీలు నామినేషన్లు వేశారు. సోమవారం నా మినేషన్ల పరిశీలన సందర్భంగా అధికారులు ఒక నామినేషన్‌ను తిరస్కరించారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ఉండగా, మంగళవారం ఉదయమే బరిలో ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవటం ప్రారంభించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు నామినేషన్ల ఉపసంహరణకు ససేమిరా అనడంతో ఆ పార్టీకే చెందిన మిగతా జెడ్పీటీసీలు వారిని బుజ్జగించారు. దీంతో ఎన్నికల బరిలో ఉన్న 21 మంది జెడ్పీటీసీలు, ఆరుగురు కౌన్సిలర్లు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో డీపీసీ ఎన్నికలు ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. డీపీసీలో 21 మంది సభ్యులు టీఆర్ఎస్ ఆ పార్టీ మద్దతు ఇచ్చిన సభ్యులు ఎన్నిక కాగా, కాంగ్రెస్ నుంచి ఐదుగురు జెడ్పీటీసీలు డీపీసీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చక్రం తిప్పిన హరీష్‌రావు
డీపీసీ ఎన్నికల్లో మంత్రి హరీష్‌రావు తెరవెనక చక్రం తిప్పారు. డీపీసీ సభ్యుల స్థానాల కోసం కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పటికీ వారు నామినేషన్లు ఉపసంహరించుకునేలా మంత్రి హరీష్‌రావు మంత్రాంగం నడిపించారు. జెడ్పీతోపాటు మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య ఎక్కుగా ఉండడంతో ఈ విషయాన్ని మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్ నేతలకు వివరించి ఏకగ్రీవానికి సహకరించాలని కోరారు. ప్రతిగా ఐదుగురు కాంగ్రెస్ జెడ్పీటీసీలకు డీపీసీలో స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ సైతం ఏకగ్రీవానికి సహకరించినట్లు తెలుస్తోంది. డీపీసీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేందుకు వీలుగా ఐదుగురు జెడ్పీటీసీలను మినహాయించి కాంగ్రెస్ మిగితా జెడ్పీటీసీ, కౌన్సిలర్లతో నామినేషన్లు ఉపసంహరింపజేసింది. దీంతో డీపీసీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.
డీపీసీలో ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులు
కౌన్సిలర్లు : ఎం.వీణ(సంగారెడ్డి), భవాని(అందోలు), తోట నరేందర్‌రావు(గజ్వేల్), మాయా మల్లేశం(మెదక్)
జెడ్పీటీసీలు:ఎం.కమల(శివ్వంపేట),కె.శోభారాణి(చేగుంట),వజ్రవ్వ(సిద్దిపేట),నమున్లకమల(చిన్నకోడూరు),రవికుమార్(నారాయణఖేడ్), మమత(అల్లాదుర్గం), యాదమ్మ(కౌడిపల్లి), సునీతపాటిల్(ఝరాసంగం), కె.ప్రభాకర్(జిన్నారం), రాములుగౌడ్(రామచంద్రాపురం), మనోహర్‌గౌడ్(సంగారెడ్డి), వెంకటేశంగౌడ్(గజ్వేల్), విజయలక్ష్మి(రామాయంపేట), లావణ్య(మెదక్), జయమ్మ(మిర్దొడ్డి), వీరమణి(దౌల్తాబాద్), అంజయ్య(రాయికోడ్), స్వప్న(కల్హేర్), శ్రీనివాస్‌రెడ్డి(కొల్చారం), సత్తయ్య(ములుగు)