అవనిగడ్డ టీడీపీలో నాలుగో కృష్ణుడు
కొత్తగా తెరపైకి డాక్టర్ చంద్రశేఖర్!
బుద్ధప్రసాద్, ముత్తంశెట్టికి మొండిచెయ్యేనా?
సర్వేల్లో వెనుకబడటమే కారణమా?
హైదరాబాద్‌కు పయనమైన బుద్ధప్రసాద్, ముత్తంశెట్టి
సాక్షి, మచిలీపట్నం/ చల్లపల్లి, న్యూస్‌లైన్ : అవనిగడ్డలో గట్టెక్కడం కష్టమని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఖరారులో ప్రయోగాలు చేస్తోంది. వరుసగా అభ్యర్థులను మార్చినా సర్వేల్లో వారికి సానుకూల ఫలితాలు రాకపోవడంతో నాలుగో కృష్ణుడిని తెరపైకి తెస్తోంది. ఇప్పటికే ఇక్కడ ఉప ఎన్నికల్లో గెలిచిన అంబటి శ్రీహరిప్రసాద్‌కు టిక్కెట్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన టీడీపీ అధిష్టానం పొరుగు నియోజకవర్గానికి చెందిన ముత్తంశెట్టి కృష్ణారావును దిగుమతి చేసుకుంది.
అప్పటికీ పరిస్థితి చక్కబడకపోవడంతో కాంగ్రెస్‌కు చెందిన మండలి బుద్ధప్రసాద్‌కు పచ్చకండువా కప్పి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామంటూ బొట్టు పెట్టింది. ఆయనకు కూడా ఎదురుగాలి తప్పకపోవడంతో తాజాగా నాలుగో కృష్ణుడు రంగంలోకొచ్చారు. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా దివంగత మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ తనయుడు హైదరాబాద్‌లో ఉంటున్న ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు సింహాద్రి చంద్రశేఖర్‌ని రంగంలోకి దించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆయనతో బుధవారం చంద్రబాబు మంతనాలు జరిపినట్టు తెలిసింది.
అవనిగడ్డ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, నూజివీడుకు చెందిన నోవా విద్యాసంస్థల అధినేత ముత్తంశెట్టి కృష్ణారావు ఆగమేఘాల మీద గురువారం హైదరాబాద్ చేరినట్టు సమాచారం. అవనిగడ్డ నియోజకవర్గంలో అభ్యర్థుల గురించి ఫోన్ల ద్వారా అభిప్రాయ సేకరణ చేసిన పుడు బుద్ధప్రసాద్, ముత్తంశెట్టిలకు ప్రజల నుంచి ప్రాధాన్యత లేకపోవడం, సర్వేల్లో వీరికి సానుకూల ఫలితాలు రాకపోవడంతో వీరిద్దరినీ పక్కన పెట్టేందుకు టీడీపీ అధినాయకత్వం యత్నిస్తున్నట్టు తెలిసింది.
టీడీపీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి...
ప్రస్తుత శాసనసభ్యుడు అంబటి శ్రీహరిప్రసాద్ తాను పోటీలో ఉన్నట్టు ప్రకటించినప్పటికీ చంద్రబాబు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఉప ఎన్నికల్లో సానుభూతి గెలుపు కోసం అంబటి శ్రీహరిప్రసాద్‌ను దగ్గరకు తీసుకున్నట్టు ప్రేమ నటించిన చంద్రబాబు ఇప్పుడు ఆయనకు ఆర్థిక బలం లేకపోవడం, ఆరోగ్య కారణాల నేపథ్యంలో పక్కనపెట్టారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముందు తెరపైకి వచ్చిన నూజివీడుకు చెందిన నోవా విద్యాసంస్థల అధినేత ముత్తంశెట్టి కృష్ణారావుకు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.
స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు కృష్ణారావే పెద్ద దిక్కయ్యారు. తనకే టికెట్ ఇస్తారని ఆయన ప్రచారం కూడా చేసుకున్నారు. తాజాగా కాంగ్రెస్ నుంచి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌కు టికెట్ ఖాయమని ప్రచారం జరిగింది. బుద్ధప్రసాద్ రాకతో జిల్లాతో పాటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాపు సామాజిక నాయకులు, ఓటర్లు టీడీపీలో చేరతారని ఆశించారు. అందుకు భిన్నంగా ఒకరిద్దరు నాయకులు మినహా బుద్ధప్రసాద్‌తో కాంగ్రెస్ నాయకులెవరూ వెళ్లకపోవడంతో అధిష్టానం తన నిర్ణయాన్ని పునరాలోచిస్తున్నట్టు సమాచారం.
వీటికితోడు గత 30 ఏళ్లుగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా బుద్ధప్రసాద్ వర్గీయులు వ్యవహరించడంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత కొంపముంచుతుందని భావించిన టీడీపీ అధినాయకత్వం బుద్ధప్రసాద్‌కు హ్యాండిచ్చే అవకాశాలున్నట్టు ఆ పార్టీ నాయకులు కొందరు చెబుతున్నారు.
దీంతో నియోజకవర్గంలో ఇప్పటివరకు టికెట్లు ఆశించిన ఎమ్మెల్యే అంబటి, ముత్తంశెట్టి, బుద్ధప్రసాద్ నిరాశలో ఉన్నట్టు వారి సన్నిహితులు చెబుతున్నారు. అవనిగడ్డ లో ఇప్పటికే ముగ్గురు కృష్ణులు మారగా, తాజాగా నాలుగో కృష్ణుడు తెరపైకి రావడంతో ఒకప్పుడు కంచుకోటగా ఉన్న టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారటంపై తెలుగు తమ్ముళ్లు మధనపడుతుండటం కొసమెరుపు.