‘తెలుగు భాషాభివృద్ధి గ్రంథాలయం’ పుస్తక పంపిణీ
షోలాపూర్: విద్యకు మించిన ధనం లేదని, విద్యను పంచితే మరింత పెరుగుతుందని సీనియర్ సాహితీ వేత్త డాక్టర్ లక్ష్మినారాయణ బొల్లి పేర్కొన్నారు. ఇటీవల ప్రపంచ గ్రంథాలయం దినోత్సవం సందర్భంగా అశోక్ చౌక్‌లోని తెలుగు భాషాభివృద్ధి సార్వజనిక గ్రంథాలయం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పుస్తకాలు చదివి అందులోని సారాంశాన్ని అర్థంచేసుకోవాలని, పుస్తక పఠనంతో జ్ఞానం పెంపొందుతుందని విద్యార్థులకు తెలిపారు.
సుభాషిత గ్రంథం గొప్పదనాన్ని వివరించారు. పరిసరాలలోని బాలబాలికలకు లక్ష్మినారాయణ చేతుల మీదుగా ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. మహాత్మ, క్రాంతి, నరసింహ జోపడిపట్టికి చెందిన 60 మంది బాల బాలికలకు పుస్తకాలు పంపిణీ చేశారు. మంచి పుస్తకాలను చదివితే సంస్కారం అలవడుతుందని, చిన్నతనం నుంచే బాలబాలికలకు చదువులోని తియ్యదనం రుచి చూపించాలని తెలుగుభాషాభివృద్ధి గ్రంథాలయం తరఫున పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నామని గ్రంథాలయం అధ్యక్షుడు మల్లికార్జున్ కంటం పేర్కొన్నారు. శ్రీనివాస్ ఎన్గందుల, రాధ యెరజల్, తిప్పన్న గణేరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.