ప్రమాదంలో దేశ భవిత
- ఏఎన్యూ ప్రొఫెసర్ నన్నపనేని అంజయ్య
ఒంగోలు సబర్బన్: దుర్మార్గాన్ని అడ్డుకోక పోతే దేశానికి భవిష్యత్తు ఉండదని ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్(ఏఎన్యూ)నన్నపనేని అంజయ్య ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్జీఓ అసోసియేషన్ భవన్లో ఆదివారం డాక్టర్ ఎం.ఎం.కల్బర్గి హత్యకు నిరసనగా సదస్సు జరిగింది. ప్రగతిశీల ప్రజాతంత్ర మేధావుల వేదిక-జనసాహితి సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అంజయ్య మాట్లాడారు. తమ అభిప్రాయాలతో విభేదించిన వారిని చంపుకుంటూ పోతున్న హిందూ మతోన్మాదుల దుర్మార్గాన్ని ఖండించాల్సిన పరిస్థితి ఆసన్నమైందని పిలుపునిచ్చారు.
ప్రముఖ కన్నడ సాహితీవేత్త, హంపి యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎం.ఎం.కల్బర్గిని హిందూ మతోన్మాదులు హత్య చేయటాన్ని తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ వ్యవస్థలకు అధిపతులుగా మతోన్మాదుల్ని నియమించడం ద్వారా బీజేపీ.. దేశాన్ని హందూ మత రాజ్యంగా మార్చి తద్వారా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు.. నిరంకుశమైన రక్షణ కల్పించాలని భావిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతిశీల ప్రజాతంత్ర మేధావుల వేదిక కన్వీనర్ పి.గోవిందయ్య, డాక్టర్ సి.హెచ్.శాంతి కుమారి, డాక్టర్ పణిధర్, హేతువాద సంఘం నాయకులు ఎస్వీ రంగారెడ్డి, వేదిక సభ్యుడు బీవీ శేషయ్య, ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఐ. విజయసారధి, ప్రముఖ రచయిత మల్లవరపు రాజేశ్వరరావు , వేదిక నాయకుడు కారుమంచి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.