Dr. Mailavarapu Srinivasa Rao
-
అన్యోన్యంగా.. ఆదర్శంగా..
లక్ష్మీనారాయణౌ గౌరీశంకరౌ భారతీ విధీ ఛాయా సూర్యౌ రోహిణీందూ రక్షేతాం చ వధూవరౌ ఒకప్పటి రోజుల్లో ఈ శ్లోకం పెళ్లికూతురు నుదుట కట్టిన ఫాలపట్టిక (భాషికం)లా- శుభలేఖకి పైభాగంలో కన్పిస్తూ ఉండేది. చాలామంది ఈ శ్లోకాన్నే పెళ్లి శుభలేఖకి పైన ఎందుకుంచేవారు? కారణం - ‘లక్ష్మీనారాయణులూ, పార్వతీ పరమేశ్వరులూ, బ్రహ్మాసరస్వతులూ, ఛాయాదేవీ సూర్యులూ, రోహిణీ చంద్రులూ అనే ఈ ఐదుజంటలూ ప్రస్తుతం వివాహం చేసుకోబోతున్న ఈ జంటను రక్షిస్తూ ఉందురు గాక!’ అని ఈ శ్లోకానికి అర్థం. అదీగాక ఈ ఐదుజంటలూ ప్రేమించుకుని పెళ్లాడిన వాళ్లే. ఇంతకీ ప్రేమపెళ్లెలా ఉంటుంది, ఎలా ఉండాలి? ఈ పురాణ పాత్రల కథలేం చెబుతున్నాయి... - డా.మైలవరపు శ్రీనివాసరావు గెలిచిన ప్రేమ రుక్మిణీ కృష్ణులది ప్రేమవివాహమే. తన శరీరం, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు అనే పంచ జ్ఞానేంద్రియాలూ తనవేనంటూ రుక్మిణి కృష్ణునికి తెలియజేసింది. అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని ద్వారా ఆ వర్తమానాన్ని పంపింది. (‘ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని కర్ణరంధ్రమ్ముల కలిమియేలా..? జన్మమేల ఎన్ని జన్మములకు?...’ అని పోతనామాత్యుడి ‘శ్రీమద్భాగవతం’లో రుక్మిణి అంటుంది). ఆ సందేశంలోని మనఃపూర్వక విధానాన్ని గమనించిన కృష్ణుడు ఆమెను పత్నిగా పరిగ్రహించాడు. భార్యగా కావాలని తీసుకువెళ్లాడు. ఆ కృతజ్ఞతాభావం ఆమెలో ఉంది కాబట్టే శ్రీకృష్ణుడు ఆ తరువాతి కాలంలో ప్రేమపరీక్షా సమయంలో ఒక్క తులసిదళంతో తూగిపోయాడు. ఇక, రాధాకృష్ణులనే ప్రేయసీప్రియుల్లో రాధ అనే ఆమె కృష్ణుని సర్వాంగాలనూ ఆరాధించే ఆరాధన మూర్తి. అయితే, అక్కడ మనమనుకునే తీరుగా ప్రేమ, పెళ్లి, సంతానమనే ధోరణి కలది కాదు. నిజమైన ప్రేమ పరమశివుడు తపస్సు చేసుకుంటుంటే ఆయన వద్ద సేవకురాలిగా చేరింది పార్వతి. ఒకరోజు ఆయన దినచర్యని గమనించింది. అంతే! ఆయన చెప్పనవసరం లేకుండా ఏ సమయానికి ఏది అవసరమో అలా సేవ చేయడం ప్రారంభించింది. అప్పటికి ఇద్దరికీ ఏ విధమైన ఆలోచనా లేనేలేదు. మన్మథుడు ప్రేమబాణం వేయగానే శంకరుడామెని మరోదృష్టితో చూశాడు. కర్తవ్యానికి విఘ్నం కలుగుతోందని గమనించి మన్మథుణ్ణి భస్మం చేశాడు. పార్వతికి ఆ విధానం నచ్చింది. ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని దీక్షతో నెరవేర్చుకుంటూన్న వేళ విఘ్నాన్ని కావాలని కలుగజేసినప్పుడు అతణ్ణి క్షమించడం నేరం కాదనే అభిప్రాయంతో శివుణ్ణే వివాహమాడాలని ప్రేమించ ప్రారంభించింది. తలిదండ్రులు కాదన్నా వినలేదు. తపస్సు ప్రారంభించింది. శంకరుడు మాయారూపంలో బ్రహ్మచారిగా వెళ్లాడు. బూడిద బుస్సన్న- ఇల్లు లేనివాడు- శ్మశాన నివాసి- బిచ్చగాడు- రుద్రాక్షధారి- లయకర్త- వాడితో నీకెందుకన్నాడు పార్వతితో. ‘శంకరుణ్ణి గురించి తెలియక నిందిస్తున్న నీ మాటలను వినడం నేర’మంటూ ఆమె వెళ్లిపోబోయింది. అంతే... శంకరుడామె చేతిని పట్టి వివాహం కావాలన్నాడు. ‘నీ ప్రేమతో దాసుణ్ణి కొనుక్కున్నా’వన్నాడు. అంతేకాదు, తల నుండి కాలి వరకూ తనలో సగభాగాన్ని ఆమెకు బహుమతిగా ఇచ్చేశాడు. తల ఆలోచనకి స్థానమైతే, కాలు ఆచరణకి సంకేతం. కాబట్టి ఆలోచన నుండి ఆచరణ వరకూ ఇద్దరం కలిసే చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ ప్రేమజంట. అంటే... పెళ్లి అయ్యాక కూడా పరస్పరం సహకరించుకుంటే అదే నిజమైన ప్రేమ అని ఈ జంట చెబుతోందన్నమాట. విజయ ప్రేమ పాలసముద్రం దగ్గరికొచ్చారు దేవతలూ రాక్షసులూ. సముద్రంలో దాగున్న లక్ష్మీదేవి గమనిస్తోంది. తాము పాముకి తలవైపు పట్టుకుని చిలుకుతామన్నారు రాక్షసులు. సరేనన్నాడు శ్రీహరి. కొంతసేపయ్యాక తోకవైపు పట్టుకుంటామన్నారు- తలవైపు నుండి విషం వస్తుంటే ఆ ఘాటుకి తట్టుకోలేక. దానిక్కూడ సరేనన్నాడు నారాయణుడు. ఇంతలో కవ్వంగా ఉన్న మందర పర్వతం కాస్తా సముద్రంలో దిగబడిపోయింది. తాబేలు రూపాన్నెత్తి పర్వతాన్ని నిలబెట్టి పనిని కొనసాగింపజేశాడు విష్ణువు. ఇలా ప్రతి సందర్భంలోనూ తన కార్యసాధన పద్ధతిని నిరూపించుకుంటూ మొత్తానికి అమృతాన్ని సాధించాడు జనార్దనుడు. శ్రీమన్నారాయణుని కార్యదీక్షాదక్షతకి ఆనందపడి ఆయనతో చూపులు కలిపింది లక్ష్మీదేవి! విష్ణువు కూడా లక్ష్మితో చూపుల్ని కలిపాడు. వారికి వివాహమైంది. ఆమెకి నివాసంగా తన వక్షఃస్థలాన్ని ఇచ్చాడు శ్రీహరి. ఆమె శ్రీహరి హృదయం మీదే నివసిస్తూ- ఆయన ఏ ఆలోచనతో ఉన్నాడో గమనిస్తూ సహకారాన్ని అందించడం ఆరంభించింది. ‘రావణుణ్ణి ఎలా వధించాలా?’ అని విష్ణువు ఆలోచిస్తుంటే వేదవతి రూపంతో వెళ్లి రావణునికి మరణ శాపాన్నిచ్చి వచ్చింది లక్ష్మి. అంటే ... పెళ్లయ్యాక కూడ పరస్పరం సహకరించుకోవడం జరిగితే ఆ ప్రేమపెళ్లి విజయవంతమైనట్లేనని భావమన్నమాట. పెళ్లికి ముందూ, పెళ్లికాలంలో, పెళ్లయ్యాక కూడ ఉండేదే ప్రేమ అని భావం! -
ధర్మనిర్ణయ గీత
(రేపు గీతాజయంతి) భగవద్గీత... సన్మార్గ దర్శిని... సాక్షాత్తూ భగవంతుని ముఖత వెలువడిన అమూల్యమైన గ్రంథం. జీవితాన్ని ఎలా నడుపుకోవాలో చెప్పే మార్గదర్శక మణిదీపం. గాంధీజీ వంటివారు కూడా నిరంతరం పఠించి, చేతితో పట్టుకు తిరిగిన గ్రంథం. అసలు భగవద్గీత ఎందుకు పుట్టింది? మంచితనంతో పాండవులు రాజ్యాన్ని చేసుకోనిస్తే దాన్ని హస్తగతం చేసుకోదలచీ- ధర్మంగా సంపాదించిన రాజ్యంగా ప్రకటించుకోదలచీ జూదాన్ని ఆడించాడు దుర్యోధనుడు. తెరవెనుక నిలబడ్డాడు ధృతరాష్ట్రుడు. అధర్మంగానూ వంచనతోనూ ఎదుటి వ్యక్తులు శత్రువులుగా మారి యుద్ధానికి దిగినప్పుడు వీళ్లు మా అన్నలు తమ్ముళ్లు తాతలు గురువులు- అనుకుంటూ కూచోకు! ఇది వెనుకడుగు వేయాల్సిన సందర్భం కాదు! అందుకే ఈ దశలో హృదయ దౌర్బల్యాన్ని విడువు! తెగబడి యుద్ధం చేసి విజయుడనే పేరుని సార్థక పరచుకో- అన్నాడు శ్రీకృష్ణుడు అర్జునునితో. కాబట్టి గీత అనేది ధర్మసంకటం వచ్చినప్పుడు తీర్చగల చక్కటి న్యాయగ్రంథమన్నమాట. అందుకు పుట్టింది గీత. ఇది రెండవ అంశం. అందరం మానవజాతికి చెందినవాళ్లమే అయినప్పుడూ కులాలనేవి మనం ఏర్పాటు చేసుకున్నవే అయినప్పుడు కులాంతర వివాహం చేసుకోవడం నేరమా? అలా చేసుకున్నవాళ్లని చాటుగా మరోలా అనుకోవడం ధర్మమా? అనేది మరో ధర్మసందేహం. కులాంతరంలాగానే మంతాంతర వివాహం చేసుకున్నాడు. మరొకరు దేశాంతర స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇవన్నీ పరస్పరం ఇష్టపడి చేసుకున్నప్పుడు ఆచారాలూ విధానాలూ అంటూ ఎందుకు తప్పుపట్టాలనేది మరో సందేహం! దీనికి భగవద్గీత చక్కటి సమాధానం చెప్తుంది. ఇది సున్నితమైన అంశం కాబట్టి నిదానంగా ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి కూడ. ఉదాహరణకి ఓ బ్రాహ్మణుడు మరో కులపు స్త్రీని వివాహం చేసుకున్నాడనుకుందాం. ముందుగా తేడా వచ్చేది భోజనం వద్ద. ఈయన శాకాహారి. ఆమె, ఆమెవైపు బంధుమిత్ర జనం మాంసాహారులు. వంటింటి వద్ద పేచీ ప్రారంభమవుతుంది. ఇక ఎవరైనా మరణించిన సందర్భంలో జరిగే క్రియాకలాపాలూ ఆ మీదట చేయవలసిన మాసిక సాంవత్సరిక శ్రాద్ధాది క్రియాలూ స్నానాలూ మంత్రాలూ విధివిధానాలూ ఆమెకి అలవాటు లేక... వీటి ప్రాశస్త్యం తెలియక... నిరాసక్తతతో చేస్తుంటే చూసేవారికి మరోలా అనిపించవచ్చు. ఇలా ఆచార వ్యవహారాలు ధ్వంసమయ్యే అవకాశాన్ని ముందే పసిగట్టిన గీత ఇలాంటి వివాహాలు ఈ కారణంతో వద్దు - అంది. ఇది నిజమే కదా! ఆ స్త్రీ ఇంట్లో కొన్ని ఆచారాలుంటాయి. వాటిని ఇతడు పాటించకపోతే వాళ్లకీ కష్టమే కదా! కాబట్టి గీత అనేది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ని అందునా కుటుంబానికి సంబంధించిన వాటిని కూడా ముందుచూపుతో పరిష్కరిస్తుందన్నమాట. భగవంతుణ్ణి చూడాలంటే... భగవంతుడుంటే అందరికీ కన్పించాలి కదా! అని వాదిస్తుంటారు కొందరు. ఏదైనా ఓ విషయాన్ని నిరూపించాలంటే కొన్నిటిని ప్రత్యక్షంగా నిరూపించవచ్చు. కొన్ని అనుభవం ద్వారానే సాధ్యం. ఉదాహరణకి మనోబాధ, వాయుప్రసారం, నిప్పువేడిమి వంటివన్నీ అనుభవం ద్వారా తెలుసుకోదగినవే తప్ప నిరూపించలేం. ఈ దృష్టితో చూస్తే భగవంతుడున్నాడా? అనే ప్రశ్నకి సాక్ష్యం అనుభవమే. మరణానికి భయమా?... కొంతమంది మరణమనేదానికి చాల భయపడుతూ కన్పిస్తారు. మరణానికి దుఃఖించాల్సింది ఎప్పుడంటే- వస్త్రం జీర్ణం (శిథిలం) అయినప్పుడెలా విడిచి కొత్తదాన్ని ధరిస్తామో అలా శరీరం కూడ వృద్ధాప్య దశ దాకా వచ్చి శిథిలమై విడవనప్పుడు - మాత్రమే. ఏ అపమృత్యువో సంభవించినట్లయితే దుఃఖించే అంశమే అంటున్న ఆ భగవంతుడెంతటి హేతువాది! రహస్యాల స్థావరం ఆకాశం: ఈ రోజున నాసా వంటి సంస్థలన్నీ ఆకాశాన్ని విజ్ఞానశాస్త్రజ్ఞులు బహిరంగ పరిశోధనాలయం, ప్రయోగవేదిక అని చెప్తున్నారుకానీ, ఈ విషయాన్ని భగవంతుడు తన గీతలో ఏనాడో చెప్పాడు ఆకాశాన్ని గూర్చి. ఆః అంటే ఆశ్చర్యమంది సంస్కృతం. ఆకాశం పేరు వినగానే అలాగే ఆశ్చర్యంతో చూస్తాట్ట ప్రతివ్యక్తీ. ఇలా ఆశ్చర్యమాశ్చర్యమంటూండ టమే తప్ప ఎవరికీ ఏమీ తెలియనంత ఉంది ఆకాశంలో... అన్నాడు గీతలో భగవంతుడు. అన్ని రహస్యాలున్నాయి కాబట్టే అది కనిపించకుండా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. ఇలా ఎన్నెన్నో కుటుంబం- సంఘం నడవడికల గురించిన అనేక ధర్మసందేహాలను తీర్చగల ధర్మనిర్ణయ శాస్త్ర గ్రంథంగా కనిపించే ఈ గీత పుట్టింది మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు. ఆ రోజున శిరఃస్నానాన్ని చేసి భగవద్గీతను పూజించి 10, 11 అధ్యాయాలని చదివి శ్రీకృష్ణునికి షోడశోపచారాలు చేయాలి. - డా. మైలవరపు శ్రీనివాసరావు నువ్వు ముందు ఏదైనా నేర్చుకోవాలంటే మంచి విద్యార్థివి కావాలి. నా బోధనల్ని కంఠతా పడితే ఉపయోగం లేదు. ఆచరణ లేని బోధ వంటబట్టదు. నా లీలల్ని చదివి నువ్వు ఆశ్చర్యం చెందాలన్నది నా అభిమతం కాదు. వాటిని చిత్తశుద్ధితో ఆచరించాలన్నదే నా సంకల్పం. అందుకే జీవితాంతం మంచి విద్యార్థిగా ఉండు. - శ్రీ షిరిడీ సాయిబాబా