సైన్స్ కాంగ్రెస్లో సైన్స్ లేదు
ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. పీఎం భార్గవ విమర్శ
హైదరాబాద్: తిరుపతిలో ఈ నెల 3 నుంచి 7 వరకు నిర్వహించే భారతీయసైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో సూడో సైన్స్ ను ప్రచారం చేయడం సహించరానిదని, ఈ సమావేశా లను సమర్థించే శాస్త్రజ్ఞుల డిగ్రీలను రద్దు చేయాలని ప్రముఖ శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలుక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపక డైరెక్టర్ డా. పీఎం భార్గవ అభిప్రాయపడ్డారు. సైన్స్ కాంగ్రెస్లో అసలు సైన్స్ యే లేదన్నారు సైన్స్ .. లాజిక్ రీజన్ (కారణం), ప్రూఫ్, ఎవిడెన్స్(సాక్ష్యం) అంశాలకు సంబంధించిందన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలో జరుగుతున్న శాస్త్ర పరిశోధనలను అంతర్జాతీయ శాస్త్ర, సాంకేతికతతో బేరీజు వేసుకొని దేశవాళి పరిశోధనలకు దిశానిర్దేశం చేస్తూ.. యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం, శాస్త్ర ప్రగతి ని ప్రజాజీవితంలో అంతర్భాగం చేయడం లాంటి అంశాలతో చర్చ జరగాల్సిన సమా వేశంలో ఆధ్యాత్మికం, చేతబడులు, హోమి యోపతి, జ్యోతిష్యం లాంటి అశాస్త్రీయ విషయాలపై దృష్టి కేంద్రీకరించడం దుర దృష్టకరమన్నారు. ఇలాంటి వాటిని ప్రధాని, ప్రభుత్వం ప్రోత్సహించడం చేటన్నారు. 1940–50 దశకంతో పోల్చితే నేటి సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు దిగజారుడుతనంతో ఉన్నాయన్నారు.
నిరంకుశత్వాన్ని ఎదుర్కొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది సైన్సేనని అన్నారు. ప్రస్తుతం విజ్ఞానశాస్త్రాన్ని ఎగతాళి చేస్తూ మూఢనమ్మకాలను ప్రోత్సహించడం ఈ సమావేశ ఉద్దేశంగా కనబడుతోందన్నారు. నేడు భారత్లో అంతా అశాస్త్రీయమే తప్ప శాస్త్రీయత గురించి 0.001 శాతం కూడా చర్చించే వారు లేరన్నారు. అనంతరం జనవిజ్ఞాన వేదిక తెలంగాణ అధ్యక్షుడు ప్రొ. ఎం ఆదినారాయణ, ఉపాధ్యక్షుడు బీఎన్ రెడ్డి, జాతీయ నేతలు రమేష్, ప్రొ. వెంక టేశ్వర్రావు కోయ, కాశప్ప మాట్లాడారు.