నేడు రాజయ్య రాక
టీఆర్ఎస్ శ్రేణుల స్వాగత సన్నాహాలు
- పెంబర్తి నుంచి ర్యాలీ..అమరుల స్థూపాలకు నివాళి
- హన్మకొండలో పార్టీ కార్యకర్తలతో సమావేశం
- రేపు అధికారులతో వివిధ శాఖలపై సమీక్ష
వరంగల్: డిప్యూటీ సీఎంగా నియామకమైన తర్వాత డాక్టర్ రాజయ్య తొలిసారి ఆదివారం జిల్లాకు వస్తున్నారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నా రు. రాజయ్య హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి 10గంటలకు పెంబర్తికి వస్తారు. అక్కడి నుంచి జనగామ, రఘునాథపల్లి మీదుగా సొంత నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్ చేరుకుంటారు. అక్కడ స్థానిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 4గంటలకు కాజీపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి సాయంత్రం 5గంటలకు కలెక్టరేట్, అదాలత్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పిస్తారు. అదేవిధంగా బాలసముద్రం లోని జయశంకర్ విగ్రహానికు పూలమాల వేస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారని టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు నరేందర్ తెలిపారు. రాజయ్య సోమవారం జిల్లా అధికారికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు.
రాజయ్యపైనే భారం
రాజయ్య డిప్యూటీ సీఎం కావడంతో జిల్లా టీఆర్ఎస్ రాజకీయూల్లో కీలకంగా మారారు. రాష్ట్ర మంత్రివర్గంలో సైతం ఇప్పటి వరకు ఆయనకొక్కడికే అవకాశం దక్కింది. జిల్లా నుంచి సీనియర్ నాయకులు చందూలాల్, వినయభాస్కర్, కొండా సురేఖ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రస్తుతానికి బెర్త్ దక్కలేదు. ఇక స్పీకర్‌గా భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూదనాచారికి అవకాశం కల్పించినప్పటికీ ఆయనకు పరిమితులు నెలకొన్నాయి. ఈ దశలో ప్రస్తుతానికి రాజకీయూల్లో రాజయ్యదే ఆధిపత్యంగా చెప్పవచ్చు.
కలిసిసాగడం పరీక్షే..
గులాబీ పార్టీ నేతలను, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎలా కలుపుకుపోతారన్న అంశం పార్టీ లో చర్చనీయాంశంగా మారింది. నిర్మాణపరంగా పార్టీ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. ఎన్నికల ముందు లోటుపాట్లు బహిర్గతం కానప్పటికీ పార్టీని జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం ఇప్పుడు ప్రధానం కానున్నది. ఎన్నికల ముందున్న విభేదాలు పక్కనపెట్టి జిల్లా ప్రజాప్రతినిధులను ఒక్కతాటిపై నడపాల్పి ఉంటుంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా జిల్లాను వివిధ రంగాల్లో ప్రగతిబా ట పట్టించాల్సి ఉంది. ముఖ్యంగా జిల్లా ప్రజలు పె ట్టుకున్న కోటి ఆశలను నిజం చేసే బాధ్యత ఆయన భుజస్కందాలపై ఉంది. జిల్లాలో విపక్ష ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు. వీరి నుంచి రాజకీయ విమర్శలను ఎదుర్కొవడం అంతసులువైంది కాదు. పార్టీని, ప్రభుత్వాన్ని జోడెడ్లబండిగా నడపడం ఇప్పుడు రాజయ్యకు సవాల్‌గా మారనున్నది.