ఒబామాకు ప్రధాన వైద్యునిగా భారతీయుడు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి ఇంకో భారతీయుడికి పెద్దపీట వేశారు. డాక్టర్ వివేక్ హళ్లెగెరె మూర్తిని తన ప్రధాన వైద్యుడిగా నామినేట్ చేయనున్నట్లు ప్రకటించారు. డాక్టర్స్ ఫర్ అమెరికా అనే సంస్థ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన డాక్టర్ మూర్తి.. ప్రస్తుతం హార్వర్డ్ మెడికల్ స్కూల్లోని మహిళల ఆస్పత్రిలో అధ్యాపక వృత్తిలో ఉన్నారు. అసమాన ప్రతిభాపాటవాలు కలిగిన డాక్టర్ మూర్తి అమెరికన్లకు తన సేవలు సమర్ధంగా అందించగలరన్న విశ్వాసం తనకుందని, ఆయన తన కొత్త పాత్రలో కూడా చక్కగా ఒదిగిపోతారని ఒబామా అన్నారు. ఈ నిర్ణయాన్ని ఎన్నారై వైద్యులు సాదరంగా స్వాగతించారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీ పూర్తి చేశారు. డాక్టర్ మూర్తిని ప్రధాన వైద్యునిగా నియమించడం ద్వారా ఒబామా సరైన నిర్ణయం తీసుకున్నారని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఏఏపీఐ) అధ్యక్షుడు డాక్టర్ జయేష్ బి.షా అన్నారు.