విధానసౌధ ముందు కేసీ రెడ్డి ప్రతిమ
► సీఎంకు విన్నవిస్తా
► మంత్రి రామలింగారెడ్డి
కేజీఎఫ్ : రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి కేసీ రెడ్డి ప్రతిమను విధాన సౌధ ముందు ప్రతిష్టించాలని సీఎం సిద్ధరామయ్యకు విన్నవిస్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. కేసీ రెడ్డి 114వ జయంతిని పురస్కరించుకుని బంగారుపేట తాలూకా క్యాసంబళ్లి గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన 5 రోజుల కబడ్డీపోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేసి మాట్లాడారు. క్రీడ లతో దైహిక, మానసిక ఆరోగ్యం మెరుగు అవుతుందన్నారు. తాలూకాలో రెండు ఎకరాల స్థలం చూపిస్తే క్రీడా మైదానం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
కేసి రెడ్డి రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించారన్నారు. కేసి రెడ్డి స్వగ్రామంలో ఆయన విగ్రహం ఏర్పాటుకు గ్రామస్తులు ముందుకు వస్తే సహకారం అందజేస్తానన్నారు. నగరంలో చేపట్టిన బస్టాండ్ పనులు పూర్తయ్యాయన్నారు. త్వరలోనే ఎంపీ కేహెచ్ మునియప్పతో చర్చించి ప్రారంభోత్సవం చేస్తానన్నారు. అనంతరం డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ కర్ణాటక ఆధ్వర్యంలో రెండు వేల మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు భక్తవత్సల రెడ్డి, బత్తుల అరుణాదాస్, రాష్ట్ర న్యాయవాదుల పరిషత్ సభ్యుడు హరీష్, కేడీపీ సభ్యుడు వెంకటకృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.