ఐదో తేదీవరకు ముసాయిదా మేనిఫెస్టో
ముంబై: వచ్చే నెల 5వ తేదీ వరకు తమ పార్టీ మ్యానిఫెస్టోను సిద్ధం చేయనున్నట్లు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి, పార్టీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ సుశీల్‌కుమార్ షిండే ఆధ్వర్యంలో గురువారం తిలక్‌భవన్‌లో సమావేశం నిర్వహించారు. కమిటీని మూడు విభాగాలుగా విభిజించి ఒక్కో విభాగానికి ఒక్కో పని అప్పగించారు. నగర సమస్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు జనార్ధన్ చతుర్వేది, ఆరోగ్య సంబంధ విషయాలపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి సురేష్ శెట్టి, యువతకు సంబంధించిన అంశాలపై ఎంఎల్సీ అనంత్ గాడ్గిల్ ఆధ్వర్యంలోని విభాగాలు సెప్టెంబర్ రెండో తేదీవరకు సమాచారాన్ని అందించాలని షిండే సూచించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. 5వతేదీనాటికి ముసాయిదా మ్యానిఫెస్టో సిద్ధమవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
‘వార్ రూం’గా మారిన ఆస్పత్రి గది
నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రి గది కాంగ్రెస్ పార్టీ ‘వార్ రూం’గా మారిపోయింది. రాష్ట్ర పార్టీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మోహన్ ప్రకాశ్ ఒక కాలుజారి పడిపోవడంతో చికిత్స నిమిత్తం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అతడి కాలులో రాడ్ వేశారు. కాగా, త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆస్పత్రిలోనే రాష్ట్ర నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిపై ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ.. మోహన్ ప్రకాశ్ ఆస్పత్రి పాలవ్వడం తమ పాలిట వరంగా మారిందని, లేదంటే తామంతా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేదని సరదాగా వ్యాఖ్యానించాడు.